Wednesday, January 21, 2026
E-PAPER
Homeబీజినెస్రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

- Advertisement -

ట్రంప్‌ టారిఫోన్మాదంతో అనిశ్చితి… కుప్పకూలిన దలాల్‌ స్ట్రీట్‌
సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పైగా పతనం
దేశీయంగా పలు ప్రతికూలాంశాలు…రూపాయి ఐదో రోజూ క్షీణత
తరలిపోతోన్న విదేశీ పెట్టుబడులు

ముంబయి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అటావిక టారిఫ్‌ చర్యలకు తోడు భారత వృద్ధి రేటు తగ్గొచ్చనే అంచనాలు, రూపాయి విలువ పతనం తదితర ప్రతికూలాంశాలు దలాల్‌ స్ట్రీట్‌ను కుప్పకూ లేలా చేశాయి. వరుసగా 10 రోజూ విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. ముఖ్యంగా ఐటిస్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ట్రంప్‌ చర్యలకు పోటీగా యూఎస్‌పై యూరప్‌ దేశాలు టారిఫ్‌ యుద్ధానికి దిగడంతో ప్రపంచ వాణిజ్యంపై అనిశ్చితులను పెంచింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడే లో 1200 పాయింట్ల మేర క్షీణించగా.. నిఫ్టీ 25,200 దిగువకు పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపద ఒక్క పూటలో రూ.9 లక్షల కోట్లు పైగా హరించుకుపోయింది. సెన్సెక్స్‌ ఉదయం 83,207 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. రోజంతా అమ్మకాల ఒత్తిడిలోనే కొనసాగింది. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తుదకు 1,065.70 పాయింట్లు లేదా 1.28 శాతం పతనంతో 82,180. 47కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో 82,010 కనిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 353 పాయింట్లు లేదా 1.38 శాతం నష్టంతో 25,232.50కు పరిమితమయ్యింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.9.46 లక్షల కోట్లు ఆవిరై రూ.455.7 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌-30 సూచీల్లో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మినహా మిగిలిన స్టాక్స్‌ అన్నీ నష్టాలు చవి చూశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌, సన్‌ఫార్మా, ఇండిగో షేర్లు అధిక నష్టాలను చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టీ రియాల్టీ సూచీ ఏకంగా 5 శాతం పతనమయ్యింది. ఇదే బాటలో ఆటో రంగం 2.56 శాతం, ఐటి 2.06 శాతం చొప్పున క్షీణించాయి. మిడ్‌క్యాప్‌ 2.62 శాతం, స్మాల్‌క్యాప్‌ 2.85 శాతం చొప్పున ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.

ప్రధాన ప్రతికూలాంశాలు..
గ్రీన్‌లాండ్‌ విషయంలో తనకు సహకరించకుంటే టారిఫ్‌లు విధిస్తానని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే బెదిరించడంతో ఇయులోని 27 దేశాలు యూఎస్‌కు ప్రతి సవాల్‌ను విసిరాయి. తాము కూడా యుఎస్‌ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తామని హెచ్చరించాయి. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితిని పెంచింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత జీడీపీ అంచనాలను చేరకపోవచ్చని విశ్లేషణ సంస్థల అంచనాలు గత కొన్ని రోజులుగా దలాల్‌ స్ట్రీట్‌పై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. యూఎస్‌తో భారత వాణిజ్య ఒప్పందం కొలిక్కి రాకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐల) వరుసగా 10వ రోజూ అమ్మకాలను కొనసాగించారు. జనవరి 19న రూ.3,263 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండిపై ఇన్వెస్టర్లను పెట్టుబడులను కొనసాగించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా ఐదో రోజూ పతనమయ్యింది. ఒక దశలో రూపాయి విలువ 91.05 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. తుదకు 7 పైసలు కోల్పోయి 90.97 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -