– నాలుగు రెట్లు పెరిగిన ‘వేదాంత’ చెల్లింపులు
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే విరాళాలు ఏటా అనేక రెట్లు పెరిగిపోతున్నాయి. ‘క్విడ్ ప్రోకో’ ఆరోపణలు, కొన్ని కార్పొరేట్ సంస్థలపై బెదిరింపులు, కేంద్ర సంస్థలతో దాడులకు పాల్పడుతుందన్న ఆరోపణలు తరచూ వస్తున్న నేపథ్యంలో… అవి ఇచ్చే మొత్తం విరాళాల్లో సింహభాగం కమలం పార్టీకే వెళ్తున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బిలియనీర్ అనిల్ అగర్వాల్‌కి చెందిన వేదాంత లిమిటెడ్ రూ.97 కోట్లు బిజెపికి ఇచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కమలం పార్టీకి ఇచ్చిన విరాళం నాలుగు రెట్లు అంటే 88 శాతం పెరిగినట్లు ఆ సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ”ఇతర ఖర్చులు” కింద, వేదాంత తన మాతృసంస్థ లండన్‌లో జాబితా అయిన వేదాంత రిసోర్సెస్ పీఎల్‌సీకి చెల్లించిన రాజకీయ విరాళాలతోపాటు నిర్వహణ, బ్రాండ్ ఫీజు ఖర్చులను వివరించింది. 2024-25లో రాజకీయ విరాళాలు మొత్తం రూ.157 కోట్లుగా ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.97 కోట్లు పెరిగినట్టు తెలిపింది. బీజేపీకి విరాళాలు బాగా పెరిగాయని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే మొత్తాన్ని రూ.10 కోట్లకు తగ్గించినట్టు వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అతిపెద్ద బిలియనీర్ సంస్థల్లో వేదాంత ఒకటి.
2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.97 కోట్లు (మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.26 కోట్లు), బిజు జనతాదళ్ రూ.25 కోట్లు (2024లో రూ.15 కోట్లు), జార్ఖండ్ ముక్తి మోర్చా రూ.20 కోట్లు (2024లో రూ.5 కోట్లు), కాంగ్రెస్‌కు రూ.10 కోట్లు (2024లో రూ.49కోట్లు) ఉన్నాయి. 2022-23లో రూ.155 కోట్లు, 2021-22లో రూ.123 కోట్లు విరాళంగా రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టు ప్రకటించినా, ఏఏ పార్టీలకు ఎంత మొత్తం ఇచ్చిందన్న వివరాలను వెల్లడించలేదు. ‘ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం’గా పేర్కొంటూ గత ఏడాది సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి బాండ్లు రద్దయ్యేవరకూ ఐదేళ్ల పాటు రూ.457 కోట్లు ఈ సంస్థ వివిధ పార్టీలకు విరాళంగా అందజేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించకుండా, వీటిని రద్దు చేయాలంటూ సీపీఐ(ఎం) సుప్రీంకోర్టులో పోరాడిన సంగతి తెలిసిందే.
బీజేపీకి రూ.97 కోట్ల విరాళం
- Advertisement -
- Advertisement -