తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
భూనిర్వాసితుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు
నవతెలంగాణ- నారాయణపేట
మక్తల్, నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ఎకరం భూమికి కోటి రూపాయల పరిహారం ఇచ్చినా తక్కువేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద ఐదు రోజుల నుంచి జరుగుతున్న భూనిర్వాసితుల రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన మద్దతు తెలిపి ప్రసంగించారు.
ఈ జిల్లాకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరి స్పందించాలని, బహిరంగ మార్కెట్ ధరలకనుగుణంగా నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. రింగ్ రోడ్డు, నేషనల్ హైవేలకు ఖమ్మం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో రూ.50లక్షల నుంచి 60 లక్షల మేర పరిహారం అందిస్తుంటే సీఎం సొంత నియోజకవర్గంలో రూ.14లక్షల పరిహారం ప్రకటించడం అన్యాయమన్నారు. న్యాయమైన పరిహారం అందే వరకు నిర్వాసితులకు రైతు సంఘం మద్దతుగా ఉండి పోరాడుతుందని హామీనిచ్చారు. రైతు తన ఇష్టంతో భూమిని అమ్ముకోవడం లేదని, ప్రాజెక్టు కోసం.. ప్రభుత్వం మాట ప్రకారమే భూమిని అమ్ముతున్నారని, అలాంటి రైతుకు సరైన పరిహారం అందించి ఆనందంగా ఉంచాలని అన్నారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన నారాయణపేట ప్రాంతానికి నీరు అవసరం.. ప్రాజెక్టు అవసరం.. అదే సందర్భంలో ప్రాజెక్ట్‌కు భూమి ఇస్తున్న రైతును కూడా సంతోషపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు.
ఈ దీక్షలలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మశ్చందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలరామ్, జోషి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంజిలయ్య గౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, భూనిర్వాసితుల జిల్లా ఉపాధ్యక్షులు ధర్మరాజు, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, దస్తప్ప శివకుమార్, ఉట్కూర్ రైతులు పాల్గొన్నారు.
ఎకరానికి రూ.కోటి పరిహారం ఇచ్చినా తక్కువే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES