Saturday, November 29, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅస్సాంలో ఆరెస్సెస్‌,బీజేపీల విద్వేష వ్యూహం!

అస్సాంలో ఆరెస్సెస్‌,బీజేపీల విద్వేష వ్యూహం!

- Advertisement -

అస్సాంలో బహుళపెండ్లిళ్ల (పాలిగామి)ను నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ముస్లింల్లో పురుషులు, నలుగురు స్త్రీలను పెండ్లాడే అవకాశం ఉంది కనుక ఆ అవకాశాన్ని తొలగిస్తూ తాము చట్టం తెస్తునట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఆ రాష్ట్రంలోని అదివాసీల్లో కూడా పురుషులు ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలను పెండ్లాడుతారు. ఆదివాసిల్లోని ఆ ఆచారాన్ని తాము నిషేధించడం లేదని కూడా చెప్పారు. ఒకరికంటే ఎక్కువ మందిని పెండ్లాడిన వారికి ఈ బిల్లు ప్రకారం ఏడేండ్ల్ల కఠిన కారాగార శిక్షతో పాటు, జరిమానా విధించవచ్చు. రెండోసారి అదే తప్పు చేస్తే పదేండ్ల వరకు శిక్ష పడుతుంది. మొదటి భార్య బతికి ఉండి విడాకులు తీసుకున్న వారికి ఈ చట్టం వర్తిస్తుంది. ఆ రాష్ట్ర శాసనసభలో బీజేపీకి ఉన్న బలం వల్ల బిల్లు ఇట్టే చట్టంగా మారిపోతుంది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల బెడదలేదు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ పేర ముస్లిం పట్ల ద్వేష భావాన్ని సజీవంగా ఉంచడానికి బీజేపీ ఒక్కొక్కటిగా ఇలాంటి చట్టాలను తెస్తోంది. అయితే చట్టాల ఆవశ్యకతను తెలియచేసే డేటా మాత్రం బీజేపీ ప్రభుత్వాల దగ్గర లేదు. ముస్లింలపై విద్వేషం చిమ్మే ఏ పనికైనా బీజేపీకి డేటా అక్కర్లేదు. ఏ డేటాతోనూ ఆ పార్టీకి, ప్రభుత్వాలకు పనిలేదు.

సాధారణంగా ఒక బిల్లును చట్టసభల్లో పెట్టినప్పుడు ప్రభుత్వాలు బిల్లు ఆవశ్యకతను వివరిస్తాయి. కాని అస్సాం ప్రభుత్వం ఎలాంటి డేటాను సభ ముందు, తద్వారా ప్రజల ముందు ఉంచలేదు. కాంగ్రెస్‌, సీపీఐ (ఎం) ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా వాకౌట్‌ చేశాయి కూడా. బహు భార్యాత్వాన్ని నిషేధిస్తే తప్పేమిటని చాలామంది ప్రశ్నిస్తారు. నిజమే నిషేధం విధించడంలో తప్పులేదు. తప్పల్లా బీజేపీ ఉద్దేశంలోనే ఉంది. దానికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే కనీసం అస్సాం రాష్ట్రంలోనైనా ఎంతమంది ఒకరికంటే ఎక్కువ మందిని పెండ్లాడుతున్నారు. అలా పెండ్లాడుతున్న వారిలో ఏమతం వారు, ఏ కులంవారు, ఏ తెగవారు ఎంత మంది ఉన్నారు? అన్న వివరాలు సేకరించి ఉండేది. కొద్దికాలం క్రితం సిఏఏ, ఎన్‌ఆర్‌సిల పేర అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్వేష ప్రచారానికి తలపడింది. ఆ సమయంలోనైనా బహుళ పెండ్లిండ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి ఉండవచ్చు. కాని ఆ పని చేయలేదు. ఏ విషయంలోనూ బీజేపీ డేటా ఇవ్వదు. బట్ట కాల్చి మీద వేస్తుందంతే. వచ్చే ఏడాది అస్సాంలో జరుగనున్న ఎన్నికల దృష్ట్యా ముస్లింలపై మరో విద్వేష ప్రచారం ఇప్పుడు మొదలెట్టింది.

ముస్లింలు, క్రైస్తవులపై విద్వేష ప్రచారం సాగించడం బీజేపీ, ఆరెస్సెస్‌ల రాజకీయ వ్యూహంలో భాగం. హిందూ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి మాత్రమే బీజేపీ ఆ పని చేయడం లేదు. ప్రజల దృష్టిని మత విద్వేషం వైపు మళ్లించి బడా కంపెనీలకు ప్రజాధనాన్ని దోచి పెట్టడం, స్త్రీలపై అణిచివేతను కొనసాగించడం, వర్ణవ్యవస్థను, మనుస్మృతిని సంరక్షిచడం వంటి పనులను సునాయాసంగా చేసుకెళ్లడానికి అనుసరించే ఎత్తుగడ అది. స్త్రీలను వంటింటికి, సంతానోత్పత్తికి పరిమితం చేయాలని సంఘీయులు పలుసార్లు బహిరంగంగానే చెప్తుంటారు. అందుకే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టినా అమలుచేయటంలో చిత్తశుద్ధి లేదు. ఈ నేపథ్యంలోనే కార్మిక హక్కులను హరిస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను మోడీ ప్రభుత్వం చల్లగా అమల్లోకి తెచ్చింది. పిఎఫ్‌ పెన్షన్‌ ఫండ్‌లో కోట్లాను కోట్ల రూపాయలు మగ్గుతున్నా పెన్షన్‌దార్ల పెన్షన్‌ను అది పెంచదు. పిఎఫ్‌ పెన్షన్‌దారుల్లో హిందువులే కదా అత్యధికంగా ఉండేది. అయినా వేయి, రెండువేల పెన్షన్‌తో వారు బతుకులు ఈడ్చాల్సిందేనని చెప్తోంది.

ముస్లింలపై తమ విద్వేష ప్రచారంలో భాగంగా 2019లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్రిపుల్‌ తలాఖ్‌ విడాకుల ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర డేటా లేదు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి 2025 వరకు నమోదైన త్రిపుల్‌ తలాక్‌ కేసులెన్నో తెలపమని సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఆ డేటాను సుప్రీం కోర్టు ముందుంచలేక పోయింది. ఎందు కంటే ముస్లింలను దోషులుగా నిలబెట్టడం తప్ప వారిలో వెనుకబడిన, కాలదోషం పట్టిన ఆచారాలను సంస్కరించే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వాలకు ఏ కోశాన ఉండదు కనుక. ముస్లింల్లో విడాకులకు త్రిపుల్‌ తలాఖ్‌ పద్ధతి ఒక్కటే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంటే, అదికాదు షరియత్‌లో విడాకులకు అనేక పద్ధతులున్నాయని చెప్పే ధైర్యం ఉలేమాలకు లేదని ముస్లిం మేధావులు చెప్తున్నారు. బీజేపీ సాగిస్తున్న దుష్ట్రచారాన్ని తిప్పికొట్టగల నాయకత్వం ఈరోజు ముస్లింలకు లేకుండా పోయింది. ఇమారత్‌ ఎ షరియా, ముస్లిం పర్సనల్‌ లా బోర్డులే కాదు. ఉర్దూ సాంస్కృతిక వేదికలు కూడా నిస్పత్తువ స్థితిలోకి జారిపోయాయి.

గతంలో ఆ సంస్థలు మాట్లాడేవి, అభ్యంతరాలు చెప్పేవి. ఇప్పుడు వాటి నోర్లు మూత బడ్డాయి. కారణం తనను ప్రశ్నించలేని దుర్బలులను ఏదో ఒక విధంగా ఆ సంస్థల్లో బీజేపీ ప్రభుత్వం జొప్పిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో, రాజ్యాంగ బద్ధ సంస్థల్లో తన అనుయాయిలను బీజేపీ అక్రమంగా నియమిస్తోంది. లేదా వాటి స్వతంత్రతను నాశనం చేసి క్రమంగా తన చెప్పుచేతుల్లోకి తీసుకొంటోంది. ఫలితంగా వారు రాజ్యాంగ పరమైన, చట్టపరమైన నిబంధనలను, విలువలను గాలికొదిలి ‘చిత్తం మహాప్రభో’ అంటూ అడుగులకు మడుగులు ఒత్తే పరిస్థితి నెలకొంది. సిబిఐ డైరెక్టర్‌ పదవికి ఒక అధికారిని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తేటతెల్లమైంది. ముస్లిం సంస్థలను కూడా ప్రభుత్వం అదే స్థితికి దిగజార్చగలిగింది. ఇక మీడియా రంగానికి వస్తే ఒకనాటి స్వేచ్ఛ, నేడు మీడియాకు లేకుండా పోయింది. జర్నలిస్టులను మీడియా యజమానుల దయా దాక్షిణ్యాలకు వదలి యాజమాన్యాల నుండి మోడీ సర్కార్‌ అదనపు ప్రాపకం సాధించింది.

నాలుగు కార్మిక కోడ్‌లతో వర్కింగ్‌ జర్నలిస్టు యాక్టును, నాన్‌ జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించే పారిశ్రామిక వివాదాల చట్టం, తదితర రక్షణ చట్టాలను, వేతన బోర్డును లాగి పారేసింది. జర్నలిస్టులను, నాన్‌ జర్నలిస్టు ఉద్యోగులను యాజమాన్యాల కాళ్ల దగ్గర కట్టి పడేసింది. ఒకనాడు పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఉద్యమాలు సాగించి ప్రభుత్వాల మెడలు వంచిన జర్నలిస్టులు నేడు నిస్సహాయులై అనాధలుగా మిగిలారు. ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లోని జర్నలిస్టుల గురించే ప్రజలకు తెలుసు కానీ నిజానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం జర్నలిజాన్ని చంపేసింది. నిజమైన జర్నలిస్టులను ప్రధాన మీడియా నుండి దూరంగా తరిమేసింది. మేధావుల్లోనూ బీజేపీ తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. దాని విధానాలను విమర్శించగల మేధావుల సంఖ్య తగ్గిపోతోంది. కమ్యూనిస్టులను కుహనా సెక్యులరిస్టుగా చూపెట్టిన బీజేపీ, తనను ప్రశ్నించే మేధావులకు అర్బన్‌ నక్సలైట్‌ అన్న ముద్రను తగిలించి వారిని ప్రజల దృష్టి నుండి దూరం చేస్తోంది. ఒకనాడు సందేశాత్మక అభ్యుదయ సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు, రచయితలు సినిమా రంగంలో నేడు ఒంటరి పాలయ్యారు.

ప్రముఖ హిందీ దర్శకుడు మహేశ్‌ భట్‌ నేటి సినిమా రంగం గురించి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై అసమ్మతి తెలియచేసే దర్శకులను, రచయితలను పక్కకు పెట్టారు. రచయితలు స్వేచ్ఛగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై రాయడానికి బదులు, సెన్సార్‌ షిప్‌కు వేధింపులకు ముందుగానే భయపడి ఆ పరిధుల్లోనే కథలు రాస్తున్నారు. దేశ సమస్యలపై సినిమాలు తీద్దామంటే, మీ ఆలోచలను కవితలుగా రాసుకోండి, పుస్తకాలుగా రాసుకోండి తప్ప వాటిపై సినిమాలు వద్దని నిర్మాతలు చెప్తున్నారట. ముస్లింలపై చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగా బీజేపీ తన మద్దతుదార్లను ఉపయోగించి కశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ స్టోరీస్‌ వంటి పలు సినిమాలను నిర్మిం చింది. వాటికి స్వయంగా ప్రధాని ప్రచారం చేసి పెట్టారు. అయితే అతిపెద్దగా ప్రజలను ఆకట్టుకోలేక పోయాయి. ప్రధాని ఇటీవల అయోధ్య రామమందిరంలో ధర్మధ్వజ్‌ (మతజెండా)ను ఎగరేశారు. 190 ఏండ్ల క్రితం లార్డ్‌ మెకాలే రూపొందించిన మానసిక బానిసత్వపు నిబంధనల నుండి భారతదేశం నేడు బయట పడిం దని ఆ సందర్భంగా చెప్పారు.

మెకాలేకు, ధర్మద్వజ్‌కు, మానసిక బానిసత్వానికి సంబంధం ఏమిటో మోడీ కే తెలియాలి. ప్రతి అంశాన్ని మతానికి జోడించే ప్రయత్నం అది. బానిసత్వం నుండి, మానసిక బానిసత్వం నుండి భారతీయులు ఏమాత్రమైనా బయటపడి ఉంటే అది దేశవిదేశాల్లో సాగిన ఉద్యమాల వల్ల భారత రాజ్యాంగం వల్ల మాత్రమే. ఈ సందర్భంగా న్యాయస్థానాల తీరును చూద్దాం. విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి ఒక చట్టం కావాలని తాము కోరడం లేదని సుప్రీం కోర్టు ఒక విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతి విద్వేష ప్రసంగాన్ని నియత్రించే పని కూడా న్యాయస్థానం చేయలేదని పేర్కొంది. నిజమే ప్రతి విద్వేష ప్రసంగాన్ని పరికించడం కోర్టులు చేయలేవు.

కాని రాజ్యాంగబద్ద స్థానల్లో ఉన్న వారి విద్వేష ప్రసంగాలను కూడా పరికించకపోతే ఎలా? వివిధ హక్కులపై నిషేధం విధిస్తూ చట్టాలు చేస్తున్న ప్రభుత్వాలు విద్వేష ప్రసంగాలను అరికట్టే చర్యలు మాత్రం చేపట్టవు. ఈ విషయంలో కోర్టులూ చేతులెత్తేస్తే పౌరుల పరిస్థితి ఏమిటి? చాలాకాలం తర్వాత బీజేపీ ప్రభుత్వం చివరకు కులగణనకు అంగీకరించింది. 2027లో జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన చేపడతామని ప్రకటించింది. అయితే కులగణన వల్ల ప్రజల్లో చీలిక రాకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ వ్యాఖానించారు. చాలా మందిలో ఆ భావన ఉండవచ్చు కూడా. కులవ్యవస్థ లక్ష్యమే శ్రమజీవులను విడదీయడం కదా? అలాంటప్పుడు కులగణన వల్ల ప్రజల్లో చీలిక వస్తుందన్న భావనను అత్యున్నత స్థానంలో ఉన్నవారు కూడా వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తుంది.

ఎస్‌.వినయకుమార్‌
9989718311

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -