Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ కాదు.. దేశానికి పట్టిన విషం

ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ కాదు.. దేశానికి పట్టిన విషం

- Advertisement -

కార్పొరేట్ల దోపిడీ ఆగాలంటే నిరంతర పోరాటాలు జరగాలి : సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌
విశాఖ :
‘వందేండ్ల ఉత్సవాలు ఆర్‌ఎస్‌ఎస్‌ చేసుకోవడానికి ఏం సాధించింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో వారు పాల్గొన్నట్టు ఒక్క పేరునైనా ఎవరైనా చెప్పగలరా? ఈ వందేండ్లలో వారు చెడ్డీల నుంచి ప్యాంటులకు వచ్చారు. మీకు కమలం పువ్వు పైకి కనిపిస్తోంది. నేను దాని కింద ఉన్న విషపు వేళ్లను చూసి చెబుతున్నాను. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఈ దేశానికి పట్టిన విషం’ అని ప్రగతిశీలవాది, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. భారతదేశం సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఐటీయూ అఖిల భారత మహాసభ సందర్భంగా శనివారం నుంచి వారం రోజులపాటు విశాఖలో తలపెట్టిన శ్రామిక ఉత్సవ్‌ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖలోని దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తొలుత మీడియా వారు ‘ఎలా వున్నారు సార్‌’ అనగానే ‘ఏముందన్నా కార్మికులు, వారికోసం పోరాడే వారంటే నాకెంతో ఇష్టం. సీఐటీయూ పిలవగానే విశాఖపట్నం వచ్చేశాను’ అనడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి వారంపాటు సాంస్కృతిక ఉత్సవాలు, ఆటాపాట, కవులు, రచయితలతో సందడిగా విశాఖ ఉంటుందని, సినిమా నటులను పిలవడం సహజం కదా అని ప్రకాశ్‌రాజ్‌ అంటూనే… ‘అయితే నేను నటుడిని మాత్రమే కాదు.. అభ్యుదయ ఆలోచనలు, ఆందోళనలకు అండగా ఉండే వ్యక్తిని’ అని చెప్పుకొచ్చారు. సీఐటీయూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావడం నా బాధ్యత అన్నారు. చెమట చుక్కకి ఓటమి ఉండదు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటుపరం చేస్తున్నాయి మీరేమంటారు అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘అమ్మేవాడు ఒకడు.. కొనేవాడు మరొకడు. కండ్లముందే వ్యాపారం జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడుపోయారు’ అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. పదేండ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉండడం, వారికి ప్రభుత్వాలు అమ్ముడుపోవడం కళ్లారా చూశామని విమర్శించారు. ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులు, రాజ్యాంగ యంత్రం వారి చేతిలో ఉన్నాయి కదా పీడీ చట్టాలు పెడతారు, స్టాన్‌ స్వామి విషయంలో అన్యాయంగా వ్యవహరించారు, గౌరీ లంకేశ్‌ని చంపిన వారు బెయిల్‌పై బయటకి వచ్చేస్తారు అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు.

పాలకులకు ప్రశ్నించే వారంటే గిట్టరని అన్నారు. కానీ ప్రజలకు నిరంతరం ప్రశ్నించడమే మార్గమని, లేదంటే మార్పురాదని ప్రకాశ్‌రాజ్‌ ఆవేశంగా వెల్లడించారు. మెడికల్‌ కాలేజీలను ఏపీలో పీపీపీ పేరుతో అమ్మడం ప్రజలకు నష్టమన్నారు. అసలు ప్రజలు ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో నేర్చుకోవాలన్నారు. కర్నాటకలోని బెంగళూరులో 1007 ఎకరాల వ్యవసాయ భూమిని ఇది వరకు ఒకసారి ప్రభుత్వం ప్రయివేటు వాళ్ల చేతుల్లో పెట్టాలనుకున్నపుడు ప్రజలంతా కలిసి పోరాడి ఆపగలిగారని గుర్తుచేశారు. మీడియా కూడా అమ్ముడుపోయిందని, ఎంతో కొంత ఇండిపెండెంట్‌ మీడియా సక్రమంగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. సినిమాలు, మీడియా ద్వారా 90 శాతం చెత్తను పాలకులు ఎక్కిస్తున్నారని, కేరళ ఫైల్స్‌ అనే సినిమా తీయించి స్వయంగా మోడీయే రూ.కోట్లు ఖర్చు చేసి సినిమా చూడాలనే క్యాంపెయిన్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. అబద్ధాలతో భయాన్ని కలిగించే సామ్రాజ్యాన్ని దేశంలో పాలక శక్తులు నిర్మిస్తున్నాయని తెలిపారు. ప్రజలు నిత్యం పోరాడాలని, ఈ వ్యవస్థను అర్థం చేసుకుని పోరాడేలా సీఐటీయూ వంటి సంస్థలు చేస్తున్నాయని అభినందించారు. మీడియా సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.నర్సింగరావు, అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ. గఫూర్‌, కందారపు మురళి పాల్గొన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఇంకొన్ని కామెంట్స్‌
– ఆడవారి డ్రెస్సులపై శివాజీ చెత్తగా మాట్లాడాడు. ఆడవారి మీద ఆయన మాటలు అహంకారంతో కూడినవి. వేదికల మీద మాట్లాడేప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా ఉండాలి. అనసూయకు నా మద్దతు.
– మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు అవయవాలు మాత్రమే కనిపిస్తాయి.
– ఐ బొమ్మ రవి దొంగతనం చేశాడు. దొంగ…దొంగే..?. టికెట్ల ధరలు పెరిగితే ప్రజలు సినిమాలు చూడొద్దు.
– మావోయిస్టులు అలా ఎందుకు మారారో తెలుసుకుని చర్చలు జరపాలి తప్ప టెర్రరిస్టుల మాదిరి వారిని ప్రభుత్వం కాల్చేయడం ఏంటి?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -