తన మత విశ్వాసానికి తగినట్టు జీవించే స్వేచ్ఛ ప్రతీ భారతీయుడికీ ఉంది. అదే సమయంలో మతం రాజ్య నిర్వహణలో జోక్యం కల్పించుకో కూడదన్న భావన కూడా ఉంది. మన రాజ్యాంగం పునాది సూత్రాలలో ఒకటైన లౌకికవాదం విలువ ఈ ప్రాతిపదిక పైనే ఏర్పడింది. కాని ఇప్పుడు అదే రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసి అధికారం చెలాయిస్తున్నవారు ఈ రెండు విలువలనూ ఉల్లంఘిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా, క్రమంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చివేసే పథకాన్ని వాళ్లు అమలు చేస్తున్నారు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసి అదే స్థలంలో రామ మందిరాన్ని నిర్మిం చడం వంటి చర్యలు ఆ పథకంలో భాగమే. ఇప్పుడు కేవలం మత ప్రాతిపదికన చాలా హెచ్చు సంఖ్యలో ప్రజలకు పౌరసత్వా న్ని నిరాకరించడం కూడా ఆ దిశగా వేస్తున్న మరో అడుగు.
పౌరసత్వానికి సంబంధించి రెండు దృక్పథాలు ఉన్నాయి. మొదటిది: ఎక్కడ పుట్టారన్నదానిని బట్టి పౌరసత్వం నిర్ణయించడం. రెండవది: ఏ జాతికి, (రేస్) ఏ సంస్కృతికి చెందినవారన్న దాన్ని బట్టి పౌరసత్వాన్ని నిర్ణయించడం. 1949 రాజ్యాంగ సభలో పౌరసత్వం మీద చర్చ జరిగిన అనంతరం, పుట్టిన స్థలాన్ని బట్టి పౌరసత్వాన్ని నిర్ణయించాలన్న ఆధునిక దృక్పథాన్ని మన భారత రాజ్యాంగం స్వీకరించింది. అప్పుడు కూడా మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని పౌరసత్వం నిర్ధారించాలన్న వాదనలు వచ్చాయి. కాని రాజ్యాంగ సభ ఆ వాదనలను తిరస్క రించింది. ఏ ప్రగతిశీల సమాజానికీ మత అస్థిత్వాలను బట్టి పౌరసత్వాన్ని నిర్ణయించడం పొసగదు అన్న వైఖరిని రాజ్యాంగసభ అవలంబించింది. మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని పౌరసత్వాన్ని నిర్ణయించే ఏ రాజ్యం అయినా లౌకిక రాజ్యం అనిపించుకోదు. అది మతాధిపతుల పాలన అవుతుంది. భారతదేశాన్ని అట్టి రాజ్యంగా మార్చివేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం.
భారత రాజ్యాంగంలోని 5 నుండి 11 వరకు గల అధికరణలు పౌరసత్వం గురించి నిర్దేశిస్తాయి. భారత భూభాగం మీద జన్మించిన ఏ వ్యక్తి అయినా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అర్హుడు లేదా అర్హురాలు అని చాలా స్పష్టంగా 5(ఎ) అధికరణ చెప్తోంది. ఐతే, ఆ తర్వాత కాలంలో దీనినుండి కొంత పక్కకు పోవడం జరిగింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ స్పష్టతను కొంత నీరుగార్చాయి. ముఖ్యంగా, 2003లో చేసిన సవరణలో ఈ గడ్డ మీద పుట్టినప్పటికీ, తల్లిదండ్రులలో ఒకరు గనుక చట్ట విరుద్ధంగా ఈ దేశంలోకి వచ్చి బతుకుతున్నట్టైతే అప్పుడు ఆ బిడ్డకు పౌరసత్వం పొందే అర్హత ఉండదని ఉంది. ఈ రోజు మన ముందున్న పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ)కు దీనిని తొలిరూపం అని చెప్పవచ్చు. దానిని తెచ్చినది బీజేపీ ప్రభుత్వం అయితే, యు.పి.ఎ-2 ప్రభుత్వం 2010లో దాన్ని అమలు చేయడానికి కావలసిన సన్నాహాలను ప్రారంభించింది. అందులో భాగంగానే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) అన్నదానిని రూపొందించింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను రూపొందించాలన్న ఉద్దేశాన్ని ప్రకటించింది. ప్రజాబాహుళ్యంలో బలంగా తలెత్తిన వ్యతిరేకత కారణంగా ప్రస్తుతానికి ఈ రెండూ ఆగిపోయాయి.
పౌరసత్వ సవరణ చట్టం వలన ఇప్పుడు పౌరులుగా ఉన్న వారికేమీ ఇబ్బంది ఉండబోదని సంఘపరివార్ అంటోంది. అయితే, కేంద్ర హోంమంత్రి పార్లమెంటులోను, వెలుపల కూడా ”వరుస క్రమాన్ని అర్ధం చేసుకోండి” అని ప్రకటించారు. ఏమిటా వరుస క్రమం? మొదట పౌరసత్వ చట్ట సవరణ అమలు అవుతుంది. ఆ తర్వాత జాతీయ పౌరసత్వ రిజిస్టర్ వస్తుంది. తగిన డాక్యుమెంట్లను చూపలేనివారు తమ పౌరసత్వాన్ని సి.ఎ.ఎ నిబంధనల ప్రకారం రుజువు చేసుకోవలసి వస్తుంది. పౌరసత్వ రిజిస్టరు తయారీ సమయంలో అధికారులు అడిగిన వివరాలకు-తమ తల్లిదండ్రుల జన్మస్ధలాల వివరాలతో సహా, ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వలేనివారు అనుమానాస్పద జాబితాలో పడతారు. అలా పడ్డవారు అస్సాంలో 19 లక్షల మంది. వారిలో మూడింట రెండొంతులు మహిళలు. వారం దరి పౌరసత్వమూ అనుమానాస్పదమై పోయింది. ఇదే మాదిరిగా దేశమంతటా జరగదన్న గ్యారంటీ ఏముంది?
సంఘపరివార్ లక్ష్యం మైనారిటీ మతస్తులు కావచ్చు. కాని మెజారిటీ మతానికి చెందినవారైనప్పటికీ చదువు లేనివారు, పేదలు కూడా చాలామంది దగ్గర ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఉండవు. ఒక అంచనా ప్రకారం దేశంలో 42శాతం మంది దగ్గర జనన ధఅవ పత్రాలు (బర్త్ సర్టిఫికెట్) లేవు. అటువంటి వారి విషయంలో పౌరసత్వం ఏవిధంగా నిర్ధారించాలో ఇంతవరకూ స్పష్టత లేదు. అంటే, ఖచ్చితమైన ధృవపత్రాలు లేనందున కోట్లాదిమంది భారతీయ పౌరులు కాకుండా పోతారన్నమాట. అటువంటివారంతా నిర్బంధ క్యాంపుల్లోనైనా బతకాలి లేదా ఎటువంటి పౌర హక్కులూ లేకుండానైనా కొనసాగాలి. ఈ చేదు వాస్తవం మన ముందు నిలిచి సవాలు చేస్తోంది.
ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తున్న పరిణామాల మాదిరిగానే గతంలో నాజీ జర్మనీలో కూడా జరిగాయి. ముఖ్యంగా తాజాగా ఎన్నికల కమిషన్ బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించే పేరుతో సాగిస్తున్న కసరత్తు చూస్తే దొడ్డి దారిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు భావించాలి. 1935 సెప్టెంబర్ 15న నాజీ జర్మనీ న్యూరెంబర్గ్ చట్టాలు అనే యూదు వ్యతిరేక, జాత్య హంకార చట్టాలను తయారు చేసింది. అందులో ప్రధానమైనవి రెండు చట్టాలు. 1.రీచ్ (జర్మన్ రాజ్యం) పౌరసత్వ చట్టం, 2. జర్మన్ రక్తాన్ని, జర్మన్ గౌరవాన్ని పరిరక్షించే చట్టం. మొదటి చట్టంలో జర్మన్లు, జర్మన్లతో బంధుత్వం ఉన్నవారు మాత్రమే పౌరులుగా పరిగణించబడతారు. యూదులు, తక్కినవారు రాజ్యానికి భఅత్యులుగా పరిగణించబడతారు. వారికి ఓటు హక్కు, పదవులు చేపట్టే హక్కు వంటివి ఉండవు. వారికి న్యాయపరమైన రక్షణ కూడా ఉండదు. రెండవ చట్టం ప్రకారం జర్మన్ పౌరులతో యూదులు వివాహ, వివాహేతర సంబంధాలను కలిగి వుండరాదు. యూదులు తమ ఇళ్ళలో 45 సంవత్సరాల లోపు వయస్సు కల మహిళలను ఇంటి పనులకోసం నియమించుకోరాదు. యూదులు జర్మనీ పతాకాన్ని ఎగురవేయరాదు.
యూదుల అస్తిత్వాన్ని మత ప్రాతిపదికన కాకుండా జాతి ప్రాతిపదికన గుర్తించడం ఈ చట్టాలలో ప్రత్యేకత. వారి మతాచారాలను బట్టి లేదా వారి వ్యక్తిగత విశ్వాసాలను బట్టి కాకుండా వారి పూర్వీకులను బట్టి యూదులా కాదా అన్నది నిర్ధారించడం ప్రారంభించారు. మూడు లేదా నాలుగు తరాల వెనుక వారు (ముత్తాతల కాలం నుండి) గనుక యూదులు అని తేలితే అట్టివారిని యూదులుగా గుర్తించారు. తక్కినవారిని సంకర జాతి వారుగా గుర్తించారు. వారి చట్టపరమైన హోదా తక్కువగా ఉండేది. యూదులను చట్టపరంగా వేధించడంలో న్యూరెంబర్గ్ చట్టాలు ఒక కీలక అడుగు. వివక్షత, వేరుగా ఉంచడం, చివరిగా సామూహికంగా అంతం చేయడం అనే దుర్మార్గాలకు ఈ చట్టాలు పునాది వేశాయి. అప్పటి నాజీ జర్మనీకి, నేటి భారతదేశానికి ఈ విషయంలో, చట్టాల సారాంశంలో కాని, లక్ష్యాల్లో కాని, ఎంత దగ్గర పోలికలు ఉన్నాయో ఇంకా వివరించనవసరం లేదు.
ఈ పోలికలుండడం యాదృచ్ఛికం ఏమాత్రమూ కాదు. ఆరెస్సెస్ ఏర్పడే సమయంలో, అంటే 1920-1930 కాలంలో, అది నాజీ జర్మనీ నుండి, ఫాసిస్టు ఇటలీ నుండి ప్రేరణ పొందింది. బి.ఎస్ మూంజె హిందూ మహాసభ అధ్యక్షుడు, ఆరెస్సెస్ వ్యవస్థాపకుడైన కేశవ్ బలిరాం భగత్‌కు గురువు. వీరిద్దరూ 1931లో ముస్సోలినీని కలవడంతో ఇటలీలో పుట్టిన ఫాసిస్టు సిద్ధాంతానికి, భారతదేశంలోని హిందూ జాతీయ దురహంకార భావజాలానికి మధ్య సంపర్కమైంది. 1931 మార్చి 15 నుండి 24 దాకా బి.ఎస్ మూంజె ఇటలీలో పర్యటించాడు. అప్పుడు ప్రధాని బెనిటో ముస్సోలినీని కలిశాడు. ”ఇటలీని సైనికంగా పునరుజ్జీవింపజేసిన ముస్సోలినీ దార్శనికత”ను ప్రశంసిస్తూ మూంజె తన డైరీలో రాసుకున్నాడు. ”భారత దేశానికి, ముఖ్యంగా హైందవ భారతానికి అటువంటి సైనిక సంస్థలుంటేనే ఇక్కడ కూడా హిందువుల సైనిక పునరుజ్జీవనం సాధ్యం” అని స్పష్టంగా అందులో పేర్కొన్నాడు.
అక్కడ చూసినదానితో ఉత్తేజం పొందిన మూంజె 1935లో కేంద్ర హిందూ మిలిటరీ విద్యా సొసైటీని స్థాపించాడు. భోన్సాలా మిలిటరీ స్కూల్‌ను నాసిక్‌లో 1937లో స్థాపించాడు. హిందూ రాజ్యాన్ని సైనికీకరణ చేసే లక్ష్యంతో వాటిని ఏర్పరిచాడు. వీటిలో రిక్రూట్ చేయడానికి, నిర్వహించడానికి అనుసరించిన విధానం ఆపెరా నాజియొనేల్ బాలిల్లా (ఇటలీ ఫాసిస్టు యువజన సంఘం)ను పోలివుంది. ఇదే విధానాన్ని ఆరెస్సెస్ తర్వాత కాలంలో తన సంస్థకు కూడా వర్తింపజేసింది. ముస్సోలినీ పద్ధతుల పట్ల మూంజె కనపరిచిన ఆరాధన తర్వాత కాలంలో ఆరెస్సెస్ సంస్థ, తక్కిన హిందూ జాతీయవాద సంస్థలు పాటించే విధానాలను, విలువలను తీర్చి దిద్దడంలో ప్రతిబింబించింది. ఆ ప్రభావం ఆరెస్సెస్ పైన, దాని సంస్థాగత అభివఅద్ధిపైన దీర్ఘకాలంగా కొనసాగు తున్నాయి. అందులో ఇటాలియన్ ఫాసిస్టు శక్తుల, పారా మిలిటరీ దళాల సంస్థాగత విధానాలు కూడా ఒక భాగం.
తొలి తరం ఆర్.ఎస్.ఎస్ నేతలు,మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్, సిద్ధాంతవేత్త వినాయక్ దామోదర్ సావర్కర్ బహిరంగంగానే హిట్లర్, ముస్సోలినీల పాలనను ప్రశంసించారు. ”సాంస్కృతిక జాతీయవాదం” భావనతోను, ఆధిపత్యం చెలాయించగల ఒక మెజారిటీ జాతికో లేక మెజారిటీ మతానికో చెందిన వారితో సమాజాన్ని నడిపించడం అనే భావన తోను వారు ప్రత్యేకించి ప్రభావితులయ్యారు. 1939లో గోల్వాల్కర్ రచించిన ‘వురు అండ్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ అన్న గ్రంథంలో ప్రత్యేకంగా హిట్లర్ విధానాల పట్ల ఆరాధన వ్యక్తమైంది. భారతదేశం కూడా హిందూ రాష్ట్రగా పునర్నిర్వచించ బడాలని, జర్మనీలో నాజీలు యూదుల పట్ల వ్యవహరించి నట్టుగానే ఇక్కడ మైనారిటీ మతస్తుల పట్ల వ్యవహరిం చాలని ఆ గ్రంథంలో వాదించాడు.ఆరెస్సెస్ సిద్ధాంతం రూపొందడం వెనుక ఈ గ్రంథం కీలక పాత్ర పోషించింది. ఆ సంస్థను ఫాసిస్టు భావజాలంతో ముడివేసింది. జాతీయత అన్న అంశంలో ఆరెస్సెస్ హిందూ రాష్ట్ర అన్నది కూడా ఫాసిస్టు, నాజీ నమూ నాల మాదిరిగా రూపొందాలని గోల్వాల్కర్ తన బహిరంగ ఉపన్యాసాలలో సైతం ప్రకటించేవాడు. ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అన్న తన మరొక గ్రంథంలో ముస్లింలను, క్రైస్తవులను, కమ్యూనిస్టులను భారతదేశానికి అంతర్గతంగా పొంచి వున్న ప్రమాదాలుగా వర్ణించాడు.
న్యూరెంబర్గ్ చట్టాలను రూపొందించిన కొద్ది కాలానికి నాజీ జర్మనీ అన్ని ప్రజాతంత్ర హక్కులనూ రద్దు చేసింది. ఎన్నికలను నిర్వహించడం ఆపివేసింది. సి.ఎ.ఎ, ఎన్.ఆర్.సి, బీహార్ ఓటర్ల జాబితా సవరణ వంటి నాజీ జర్మనీ విధానాలే ఇక్కడ, ప్రస్తుతం అమలు అవుతున్నాయి. ఇటువంటి చట్టాలు మనకి అవసరం అని చెప్పుకుంటున్నారు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు. అందుకే సీపీఐ(ఎం) ప్రస్తుతం భారతదేశంలో నయా ఫాసిస్టు విధానాలు ఉనికిలోకి వచ్చాయని సరిగ్గా అంచనాకి వచ్చింది. ఇది పాత కాలపు ఫాసిజం కంటే భిన్నం. నాజీలు చేసిన రీచ్ పౌరసత్వ చట్టం ఇక్కడ సి.ఎ.ఎ లో మనకు కనిపిస్తుంది. దానికి ఎన్.ఆర్.సిని కలిపితే అప్పుడు మత అస్తిత్వం బట్టి పౌరసత్వాన్ని నిర్ణయించే వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ చర్యలన్నీ ప్రత్యేకించి భారతీయ ముస్లింలను తమ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఖచ్చితమైన ధృవీకరణ పత్రాలను గనుక సమర్పించలేకపోతే, వారంతా రెండవ తరగతి పౌరులుగానో, దేశానికి చెందనివారు గానో మిగిలిపోతారు. అప్పుడు నాజీ జర్మనీలో కూడా ఈ మాదిరిగానే ఒక పద్ధతి ప్రకారం యూదులను, తక్కిన మైనారి టీలను ఒంటరి చేసి వారికి ఓటు హక్కు లేకుండా చేశారు.
బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చూస్తే మైనారిటీలు, ఇతర బలహీన తరగతులవారు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. అధికార యంత్రాం గాన్ని ఉపయోగించి జనాభాలో కొన్ని తరగతులవారిని రాజకీయ ప్రక్రియ నుంచి దూరంగా నెట్టివేసే ప్రయత్నంలో దీన్ని ఒక భాగంగా చూడాలి. నాజీ జర్మనీలో కూడా ఇదే మాదిరిగా చట్టపరంగా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని సమాజం నుండి యూదులను వేరు చేశారు. ఇలా చట్టాన్ని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయించడం, మైనారిటీలకు ఓటు హక్కు లేకుండా చేయడం ప్రమాదకరమైన చర్యలు. దీనికి తోడు మైనారిటీలకు వ్యతిరేకంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న విద్వేష ప్రచారం రానున్న కాలానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 1933లో నాజీలు జర్మనీలో అధికారానికి వచ్చిన అనంతరం యూదుల పట్ల వివక్షత చూపే చట్టాలతోనే మొదలుబెట్టారు. ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్యాన్ని ఒక మతాధికారుల రాజ్యంగా మార్చివేసే ప్రయత్నాలు మొదలుబెట్టారు.
కొందరేమో లౌకికతత్వం, సోషలిజం అనేవి విదేశీ భావనలు అని బాధపడిపోతున్నారు. కాని వాళ్లు మాత్రం సామ్రాజ్యవాదుల నుండి, నాజీల నుండి, ఫాసిస్టుల నుండి విదేశీ భావనలను అరువు తెచ్చుకుని వాటిని ఇక్కడ అమలు చేయడానికి తయారౌతున్నారు. బ్రిటిష్ పాలకులను ఏ ఐక్యతతో ఓడించామో అదే ఐక్యతను మళ్లీ సాధించి దానితోనే ఆరెస్సెస్‌ను, దాని మత విద్వేష ఎజెండాను ఓడించాలి. భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం భారతీయులందరి కోసమూ ఏర్పడినది. ఆ ఏర్పాటుకు ఆరెస్సెస్‌్ తోడ్పడలేదు. జాతీయోద్యమం నుండి దూరంగా ఉండిపోయింది ఆరెస్సెస్‌్ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, సిక్కులు, ఏ మత విశ్వాసాలూ లేనివారు అందరూ కలిసి ఐక్యంగా పోరాడబట్టే బ్రిటిష్ వాళ్ళు లొంగివచ్చారు. కమ్యూనిస్టులతో సహా పలువురు ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ ప్రాణాలను సైతం బలి ఇచ్చారు. అందుచేత ఈ దేశం అందరికీ చెందేలా చూడడం, ప్రజలందరి ఐక్యతను పరిరక్షించడం మన కర్తవ్యం.
(స్వేచ్ఛానుసరణ)
ఎం.ఎ.బేబీ