ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, అవాంతరాలు లేని సేవలను అందించడం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రవాణా శాఖకు చెందిన అన్ని చెక్‌పోస్టులనూ తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యతో రాష్ట్రంలో చెక్‌పోస్టుల వద్ద జరిగే జాప్యం, అవినీతి వంటి సమస్యలకు ముగింపు పలకనుంది. కొత్తగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం.. వాహన తనిఖీల కోసం ఇకపై మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ స్క్వాడ్‌లు వాహనాలను ఆరు నెలలకు ఒకసారి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) అనుమతితో తనిఖీ చేస్తాయి.
ఇది అక్రమ రవాణాను నివారించడంలో సహాయపడుతుంది. రవాణా ఫీజులు, పన్నులు చెల్లించడానికి వాహనదారులకు ఆన్‌లైన్ సదుపాయం కల్పిస్తారు. వాహన తనిఖీలు, పన్నుల వసూలు కోసం ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. నిబంధనల ఉల్లంఘన, రవాణా చట్టాలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు ఆన్‌లైన్‌లో విధిస్తారు. ఈ మార్పులన్నీ రాష్ట్ర రవాణా శాఖలో అవినీతిని తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వులన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.