Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపాలనలో పారదర్శకత కోసమే ఆర్టీఏ కమిషన్‌

పాలనలో పారదర్శకత కోసమే ఆర్టీఏ కమిషన్‌

- Advertisement -

– సభ్యులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి.శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-వరంగల్‌

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీ తనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ కమిషన్‌ సభ్యులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి.శ్రీనివాసరావు అన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం-2005పై పీఐఓ, ఆపిలెట్‌ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ఆర్టీఏ కమిషన్‌ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, జిడబ్ల్యూఎంసీ కమిషనర్‌ చాహాత్‌ బాజ్‌ పారు, డీసీపీలు షేక్‌ సలీమా, అంకిత్‌ కుమార్‌ స్వాగతం పలికారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో వారు మొక్కలు నాటారు. అనంతరం అవగాహన సదస్సులో మాట్లాడారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఇందులోని అంశాలపై అధికారులు సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాల్లో వరంగల్‌ జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సకాలంలో పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా, చట్టంలో ఉన్న సమయ పరిమితి లోపల సమాధానమివ్వాలని చెప్పారు. మూడేండ్ల నుంచి 17వేల ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లాల పర్యటనలు చేపట్టి కేసులను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.
అన్ని శాఖల అధికారులు 4-1బి, సిటిజన్‌ చార్టర్‌ను పక్కాగా అమలు చేస్తే సమస్యలు తగ్గుతాయని అన్నారు. జిల్లా స్థాయిలో మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం పెండింగ్‌ లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఏసీపీ శుభం, డిఆర్‌ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -