Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

- Advertisement -

ఆర్థిక ఇబ్బందులే కారణం
సంగారెడ్డి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-న్యాల్‌కల్‌

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆర్టీసీ డ్రైవర్‌ మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం చాల్కి గ్రామ శివారులో శనివారం జరిగింది. హద్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఝరాసంగం మండలం కుప్పనగర్‌కు చెందిన పాపయ్య.. నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్నుంచి ఇద్దరు కూతుళ్లతో కలిసి నారాయణఖేడ్‌లోనే నివాసం ఉంటున్నాడు. కాగా శుక్రవారం బైక్‌పై నారాయణఖేడ్‌లోని ఇంటి నుంచి వెళ్లిన పాపయ్య.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం చాల్కి గ్రామ శివారులో మంజీరా నది వద్దకు చేరుకుని తన కూతురు స్వాతికి వీడియో కాల్‌ చేశాడు. ‘భయం భయంగా ఉంది. చనిపోతాను.. మీరందరూ బాగుండాలి’ అని కూతురితో చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దాంతో కంగారుపడిన స్వాతి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది.

అందరూ కలిసి మంజీరా నది వద్దకు వచ్చి పాపయ్య కోసం వెతికారు. ఈ క్రమంలో నది ఒడ్డున బైక్‌, సెల్‌ఫోన్‌, బట్టలు కనిపించాయి. భయాందోళనతో కుటుంబసభ్యులు హద్నూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాపయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో శుక్రవారం రాత్రి వరకు గాలింపు చేపట్టగా.. ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో సహాయక చర్యలు ఆపేసిన పోలీసులు.. శనివారం తెల్లవారుజామునే గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు పాపయ్య మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాపయ్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -