నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీకి రూ.110 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సారి 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని తొలుత నిర్ణయించినప్పటికీ ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో 5,300 వరకు మాత్రమే తిప్పినట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ఈసారి 50 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేశారు. గతేడాది ఇదే సీజన్‌లో 6,300 ప్రత్యేక బస్సులు నడపగా.. రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈసారి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందనీ, కొందరు ప్రయివేటు వాహనాలనూ ఆశ్రయించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 5, 6వ తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని సంస్థ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను టీజీఎస్పీడీ సీఎల్, ట్రాన్స్‌కో ద్వారా నిర్మించింది. రాబోయే 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీని సంస్థ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీని సంస్థ విధించనుంది. అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ అదనపు చార్జీ అమలు ఈ నెల 6 (సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది.
ఆర్టీసీకి రూ.110కోట్ల ఆదాయం : యాజమాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES