– ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ – ముషీరాబాద్
ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్ని మెమోరాండాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో చలో సెక్రటేరియట్ చేపట్టవలసి వచ్చిందని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని అన్నారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినా విలీన ప్రక్రియ ప్రారంభం కాలేదని అన్నారు. వైస్ చైర్మెన్ ఎం.థామస్ రెడ్డి మాట్లాడుతూ.. 2017 వేతన సవరణ అమలు చేసినప్పటికీ, సంబంధిత ఎరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదన్నారు. అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంపు జరగకపోవడంతో కార్మికులకు ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. 2017లో రిటైరైన కార్మికులకు ఫిక్సేషన్లు జరిగినా సెటిల్‌మెంట్లు పూర్తికాలేదని, 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ ఎండీ మౌలానా మాట్లాడుతూ.. 2019 నుంచి ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడంతో యాజమాన్యం వేధింపులు పెరిగాయని తెలిపారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించి, చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కో-కన్వీనర్ కె.యాదయ్య మాట్లాడుతూ.. విధినిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ బేసిస్‌లో కారుణ్య నియామకాలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



