టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
నవతెలంగాణ – నక్కలగుట్ట
వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం(ఆర్‌టీఎఫ్‌ఎంఎస్)ను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఏర్పాటు చేశామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ఆధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నామని, ఈ సిస్టమ్ ద్వారా విద్యుత్ అంతరాయాలను రియల్ టైంలో గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవచ్చని వివరించారు. ఫీడర్ల పర్యవేక్షణతో విద్యుత్ అంతరాయాల సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మొదట ఐదు సబ్‌స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం అయిన తర్వాత 133 సబ్‌స్టేషన్లకు విస్తరించామని చెప్పారు.
అదనంగా ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు(ఏఫ్‌పిఐఎస్)ను 33కేవీ, 11కేవీ లైన్లలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా లోపాలు సంభవించిన భాగాన్ని వెంటనే గుర్తించి విద్యుత్ పునరుద్ధరణ వేగవంతమవుతుందని చెప్పారు. ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (ఏఏంఆర్) ద్వారా హెచ్‌టీ వినియోగదారులకు బిల్లులలో పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతుందని తెలిపారు. సిబ్బంది సమయం ఆదా అవుతుందని, బిల్లింగ్ లో తప్పులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆర్‌టీఏఫ్‌ఏంఎస్, ఏఫ్‌పిఐఎస్, ఏఏంఆర్ ఆధునిక సాంకేతికతలతో ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని వివరించారు.



