Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంచట్టబద్ద పాలన హైజాక్‌

చట్టబద్ద పాలన హైజాక్‌

- Advertisement -

– విద్యార్థి నాయకుల కిడ్నాప్‌నకు ఖండన
– మోహన్‌బాబు యూనివర్శిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
– రాష్ట్ర పరిస్థితులపై వామపక్ష పార్టీల సమావేశం అభిప్రాయం
– ప్రజా ఉద్యమకారులపై అక్రమ కేసులు ఎత్తేయాలి
– 12న సార్వత్రిక సమ్మెకు మద్దతు
– అమెరికాతో వాణిజ్య ఒప్పందం దేశానికి తీవ్ర నష్టం

అమరావతి : రాష్ట్రంలో చట్టబద్ధపాలన హైజాకవుతోందని, అక్రమ కేసులు, ఘర్షణల చుట్టూ తిప్పుతూ ప్రజాసమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ నాయకులు పి.ప్రసాదు, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు టి.హరినాథ్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు, ఫార్వర్డ్‌బ్లాక్‌ నాయకులు సుందరరామరాజు, ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌భాషా, చంద్రశేఖర్‌, ఎస్‌యుసిఐసి నాయకులు అమర్‌నాథ్‌, సుధీర్‌ పాల్గొన్నారు. అనంతరం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌లా హైజాక్‌ అయిందని, చట్టబద్ధపాలన జరుగుతుందా అనే అనుమానం వస్తోందని తెలిపారు. ఎపి బీహార్లా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్చగా దోచుకుంటూ కార్పొరేట్లకు భూములు కట్టబెడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని అన్నారు. ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటూ విద్యార్థులను హింసిస్తూ, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న మోహన్‌బాబు యూనివర్శిటీ అన్యాయాలపై ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అక్బర్‌, వినోద్‌లను యూనివర్శిటీ బౌన్సర్లు అనబడే గూండాలు కిడ్నాప్‌ చేసి అడవుల్లో తిప్పుతూ తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. అసలు యూనివర్శిటీలో విద్యాబుద్దులు చెబుతు న్నారా, రౌడీయిజం చేస్తున్నారా అనే అనుమానం వస్తోందన్నారు. పోలీసులు తక్షణం స్పందించకపోతే విద్యార్థులను చంపేసేవారని తెలిపారు. కిడ్నాప్‌నకు ముందు ఎలిబీ కోసం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని, అంటే పథకం ప్రకారం విద్యార్థి సంఘ నాయకులను హత్య చేసేందుకు కుట్రపన్నారని విమర్శించారు. యూనివర్శిటీలో బౌన్సర్లను పెట్టి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బెదిరించడం చట్టవిరుద్ధమని తెలిపారు. అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని, యూనివర్శిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనకాపల్లిలో రైతు సంఘం నాయకులు అప్పలరాజును పిడి యాక్టు కింద అరెస్టు చేసి ములాఖత్‌కు కూడా అనుమతి ఇవ్వడం లేదని, నెలరోజుల తరువాత ఇంటర్వ్యూ ఇప్పించారని తెలిపారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం అన్నారు. ఖూనీకోర్లు, దోపిడీదార్లు, రేపిస్టులు, అవినీతిపరులు, నేరగాళ్లకు జైల్లోవేసిన మరునాడే ములాఖత్‌ ఇప్పిస్తున్నారని, అప్పలరాజుకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డోన్‌లో ఉపాధి హామీపై ప్రశ్నించిన సిపిఐ నాయకులను తలకిందులుగా కట్టేసి కొట్టారని దోపిడీని ప్రశ్నించడం రాష్ట్రంలో నేరంగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. మన దేశ ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్‌ 18 శాతానికి తగ్గిస్తే ఆనందపడుతున్నారని, అదే మనదేశంలో దిగుమతులకు అసలు పన్నులే ఎత్తేశారని అన్నారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, అసలు ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి కూడా మోడీ భయపడుతున్నారని విమర్శించారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా, టెక్స్‌టైల్స్‌, డెయిరీ రంగం మొత్తం దెబ్బతిని పోతుందని తెలిపారు. సిపిఐ రాష్ట్రకార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టిడిపి, వైసిపి నాయకులు బూతులు తిట్టుకుంటూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పాలకపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తిరుపతి పోలీసులు మాత్రం వేగంగా స్పందించి విద్యార్థులను కాపాడారని, వారికి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -