Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపోరాటాలకు పాలకులు తలొగ్గాల్సిందే

పోరాటాలకు పాలకులు తలొగ్గాల్సిందే

- Advertisement -

– మహిళా నాయకత్వ ప్రోత్సాహంలో సీఐటీయూ ముందంజ : జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మెన్‌, పద్మశ్రీ శాంతా సిన్హా
– నవంబర్‌ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ జాతీయ సదస్సు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
– మహిళల శ్రమకు గుర్తింపు, సమాన వేతనం దక్కాల్సిందే : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆహ్వాన సంఘం ఏర్పాటు : చైర్‌పర్సన్‌గా శాంతాసిన్హా, చీఫ్‌ ప్యాట్రన్‌గా చుక్కరాములు, కో-చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మహిళా కార్మికులు గట్టిగా గొంతెత్తి పోరాడి పాలకులు భయపడి వినాల్సిందేననీ, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల, తదితర పోరాటాల్లో ఇది నిరూపితమైందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మెన్‌, పద్మశ్రీ శాంతాసిన్హా అన్నారు. పాలకులు దిగొచ్చి డిమాండ్లను నెరవేర్చేలా పోరాటాలు రూపొందించే శక్తి మహిళా కార్మికులకు ఉందని చెప్పారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సీఐటీయూ ముందంజలో ఉందని కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ జాతీయ సదస్సు సన్నాహక సమావేశం, ఆహ్వాన కమిటీ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతాసిన్హా మాట్లాడుతూ… ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాతబడిపోయిందనీ, ఇప్పుడు మహిళ బయట గెలిస్తేనే ఇంట్లో కూడా గౌరవం పెరుగుతుందని నొక్కిచెప్పారు. ఇంటి నుంచే సమానత్వం మొదలు కావాలని ఆకాంక్షించారు. ఆడపిల్లలకు చిన్నతనంలోనే పెండ్లీళ్లు చేయొద్దనీ, ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కళ్యాణలక్ష్మి పథకానికి వెచ్చించిన రూ.9 వేల కోట్లను విద్య మీద ఖర్చుపెడితే రాష్ట్రం ఎంతో బాగుపడేదని అభిప్రాయపడ్డారు. సదస్సు విజయవంతం కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. సమాజంలో, దేశ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న శ్రామిక మహిళల సమస్యలు పరిష్కరించడంలో, హక్కులు నిలబెట్టడంలో సీఐటీయూ మొదటి నుంచీ ప్రత్యేక కృషి చేస్తోందని వివరించారు. పాలకులు నేడు అన్ని రంగాల్లో మహిళలను విస్తరిస్తున్నారనీ, వారంతా కార్మిక చట్టాల పరిధికి దూరంగా ఉన్నారని చెప్పారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సహకారంతో రాబోయే రోజుల్లో స్కీమ్‌ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న మహిళల హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు. నవంబర్‌ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే అఖిల భారత శ్రామిక మహిళా జాతీయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ ”4 లేబర్‌ కోడ్స్‌” పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరుతో శ్రామిక మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారనీ, కుటుంబం కోసం మహిళలు రోజుకు 6 గంటలకుపైగా శ్రమించి మళ్లీ పని ప్రదేశాల్లో కష్టపడుతున్నా వారి శ్రమకు తగిన గుర్తింపు దక్కట్లేదన్నారు. పనిప్రదేశంలో లైంగిక వేధింపులు తీవ్రమవుతున్నాయని చెప్పారు. సదస్సు సందర్భంగా శ్రామిక మహిళలు ఎక్కువగా ఉన్న రంగాల్లోకి వారి సమస్యలపై సర్వేలు నిర్వహించాలనీ, అప్పుడే ఆయా రంగాల్లోని కార్మికుల్లోకి చేరుకోగలుగుతామన్నారు. టీఎస్‌డబ్ల్యూటీఎఫ్‌ నాయకులు సంయుక్త, శారద, జర్నలిస్ట్‌ షేక్‌ సలీమ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పద్మావతి, సీఐటీయూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి సమావేశాన్నుద్దేశించి మాట్లాడారు. సన్నాహక సమావేశంలో సీఐటీయూ ఆఫీస్‌ బేరర్లు పి. జయలక్ష్మి, కాసు మాధవి, జె. వెంకటేశ్‌, వంగూరు రాములు, వీఎస్‌.రావు, కూరపాటి రమేశ్‌, జె. చంద్రశేఖర్‌, బి. మధు, గోపాలస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. కోటంరాజు, పి. సుధాకర్‌, ఎ. సునీత, ఎస్‌ఎస్‌ఆర్‌ఎ. ప్రసాద్‌, ఏఐఐఇఎ మహిళా కన్వీనర్‌ వి. మైథిలి, ఈఐసీ సీనియర్‌ నాయకులు ఎన్‌.ఎస్‌. శైలజ, గాంధీ నర్సింగ్‌ కాలేజ్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ సిహెచ్‌. రోజా రాణి, సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆహ్వాన సంఘం ఏర్పాటు
అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ జాతీయ సదస్సు నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. 60 మందితో ఆహ్వాన సంఘం ఏర్పడింది. చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ శాంతా సిన్హా, చీప్‌ ప్యాట్రన్‌గా చుక్కరాములు, కో-చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎస్వీ రమ, కోశాధికారిగా ఎం.పద్మశ్రీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad