ఆర్యులు, అనార్యులు, ద్రావిడులు, హుణులు, సింథియన్లు, చైనీయులు, పఠాన్లు, మొఘలులు అందరూ ఈ నేలలో ఇంకిపోయి ఏకాత్మను సాధించుకున్నారు. ఆ ఏకాత్మే- భారతీయత!!
– విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్
ఒకరు దేశపరిస్థితిని చూసి, చొక్కా వదిలేసి, తనను తాను అర్థనగ్నంగా చేసుకుని ‘జాతిపిత’ అయ్యారు. మరొకరు పదిలక్షల విలువగల సూటు వేసుకుని, దేశవాసులనే నగ్నంగా రోడ్డున పడేసి విశ్వ గురువయ్యారు! విశ్వ గురువు చిన్నప్పుడు స్కూలు వదిలి పారిపోయ్యాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో దేశం వదిలి పారిపోతున్నాడు. ఇలా వదిలేసి పారిపోవడమనేది ఆయన ఆరెస్సెస్ సంస్థ నుంచి నేర్చుకున్నది. ఆ ఆరెస్సెస్ ఎంత గొప్పదంటే, స్వాతంత్య్ర పోరాటాన్ని వదిలేసి పారిపోయిన పిరికి సంస్థ. బ్రిటీషు వారికి గూఢాచారులుగా పనిచేసి, వారి దయా దాక్షిణ్యాల కోసం అర్రులు చాచిన సంస్థ.
ఆరెస్సెస్ సంస్థ తమ సభ్యులకు కర్రసాము వంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అలాంటి కవాతు కార్యక్రమం వారు చెన్నైలోని ఒక హయ్యర్ సెకండరీ స్కూలులో చేస్తున్నప్పుడు పోలీసులు అడ్డగించారు. ముందుగా అనుమతి తీసుకోకుండా అలాంటి కార్యక్రమాలు చేయగూడదని చెన్నై పోలీసులు సుమారు నలభై మంది ఆరెస్సెస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు నిరసిస్తూ స్థానిక బీజేపీ సభ్యులు ఆరెస్సెస్‌కు మద్దతు తెలుపుతూ నినాదాలిచ్చారు. తమిళనాడు పోలీసులు ప్రదర్శకులను బేఖాతరు చేసి, వారందరిపై చట్ట బద్ధమైన చర్యలు చేపట్టారు.
గతంలో నెహ్రూ మంత్రివర్గంలో గుజరాత్‌కు చెందిన వల్లభ్‌భాయ్ పటేల్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ సంస్థ రెండుసార్లు నిషేధానికి గురయ్యింది. క్షమాపణలు కోరుతూ బయటపడుతూ వచ్చారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం మళ్లీ ఆరెస్సెస్‌ను నిషేధించింది. ఇలాగే కొంతకాలం క్రితం, కేరళలో ఒక దేవాలయ ఆవరణలో ఆరెస్సెస్ కర్ర కవాతులు నిర్వహిస్తున్నప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్యం కూడా ఆరెస్సెస్‌ను బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే! ఈ సంస్థ విషయంలో నెహ్రూ-పటేల్ తప్పు చేశారని కొందరంటారు. రెండుసార్లు నిషేధిస్తే, క్షమాపణలు కోరిందని రెండుసార్లూ నిషేధం ఎత్తేశారు కదా? కరుణించి వదిలేయడం తప్పయిపోయింది కదా? జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేయించిన సంస్థను – జాతీయ జెండాను ఏ మాత్రం గౌరవించని సంస్థను వదిలేయ వచ్చా? కనికరం చూపవచ్చా? ఆనాడే ఆ సంస్థను కూకటివేళ్లతో పెకిలించి, నామరూపాలు లేకుండా చేయగలిగిన శక్తి ఉండి కూడా నెహ్రూ చేయకపోవడం తప్పుయి పోయిందా? అంటే, అప్పుడు ఆయన ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసమే చర్యలు తీసుకున్నారు. ఇప్పటి బీజేపీ ప్రభుత్వంలాగా ఆయన బుల్డోజర్లు ఉపయోగించలేదు. ఆ విషయం ప్రస్తుత పాలకులకు అర్థమవుతున్నట్టు లేదు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేక సిబిఐ కేసు ఉపసంహరించుకుంది. ఆరెస్సెస్-బీజేపీ ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలను ఎలా వాడుకుందో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ! అధికారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టి ఏం సాధించిందీ ప్రభుత్వం? కోర్టు అందరినీ నిర్దోషులని తేల్చింది. దేశ ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వం పరువు పోగొట్టుకుంది. భారతదేశం బ్రిటిషువారితో స్వాతంత్య్రం సాధించుకుంది. కానీ, దేశంలోని జాతివాదం, మూర్ఖత్వం, అంధ విశ్వాసాల సంకెళ్ల నుంచి దేశం ఇంకా స్వాతంత్య్రం పొందలేదు. అందుకు కారణం, గత పన్నెండేళ్లుగా అధికారంలో ఉండి దేశాన్ని శరవేగంగా ఆదిమ సమాజంలోకి నడిపిస్తున్నది ప్రస్తుత ప్రభుత్వమే కదా! ఈ దేశంలో ఒక నేతకు ముప్పయి మంది అంగరక్షకులుంటారు. కానీ, ముప్పయిమంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండదు. అందుకేనా ఈ దేశాన్ని మహాన్ అంటున్నారు. దేశ నాయకు లేమో విశ్వగురువంటున్నారు. సరే, ఆ గురువు ఏం చదివాడో చెప్పమంటే మళ్లీ మనోభావాలు దెబ్బతింటున్నాయ్యయే! మన విశ్వగురువు ఈ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూలాగ కావాలనుకున్నాడు.
కానీ, విజ్ఞానం, వివేచన లేదు. లాల్ బహదూర్ శాస్త్రిలా కూడా కాలేకపోయాడు. ఎందుకంటే ఆయనకున్న సింప్లిసిటీ లేదు. ఈయనకు ఆర్భాటాలు, ఆడంబరాలు, ప్రచారాలు అధికం కదా? పోనీ, ఇందిరాగాంధీ లాగే అవుదామంటే, ఆమెకున్న గట్స్ – గుండె ధైర్యం లేవు. తప్పించుకుని పారిపోయే లక్షణం కాదా? ఏ విషయంలో ఎదురొడ్డి నిలబడ్డాడనీ? పోనీ రాజీవ్ గాంధీ కావాలనుకున్నాకాలేడు. ఆయన ట్రెయిన్డ్ పైలట్. దేశాన్ని కూడా ఒక విజన్‌తో నడిపించాడు. మరి మన విశ్వ గురువు ఇండియాకు ఇ-మెయిల్ సౌకర్యం రాకముందే ఇ-మెయిల్, కృత్రిమమేధ (ఎఐ) రాకముందే ఉపయోగించానని చెప్పుకున్నాడు. ఇక పి.వి.నరసింహారావు కావాలనుకుంటే ఎలా? ఆయనకు వచ్చినన్ని భాషలు రావు, పాండిత్యం లేదు. టెలిప్రాప్టర్ లేనిది నోరు తెరవడు. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ కావాలనుకుంటే ఆర్థిక శాస్త్రంలో ‘అ ఆ ఇ ఈ’లు రావు. ఆయనలా ప్రొఫెసర్ కాలేడు. సౌమ్యం, నమ్రత, వినయం, వివేకం లేవు. చివరకు వారి పార్టీ నాయకుడు వాజ్‌పేయ్ అయిపోదా మనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేదు. ఆయన అనర్గళంగా మాట్లాడగలిగిన వక్త కదా? పన్నెండేళ్లలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ జరపని వాడయే.
ఎలా? అందరూ తనని పార్ట్‌టైం ప్రధాని అని అంటూ ఉంటే ఉండబట్టలేక అంధ భక్తులను చేరదీసి తనే విశ్వగురువని ప్రచారం చేయించుకుంటున్నాడు. ఈ దేశ ప్రజల కష్టార్జితం తీసుకుపోయి విదేశాలలో వెదజల్లి ‘మోడీ మోడీ’ అని నినాదాలు చేయించుకుంటున్నాడు. ముందే ఏర్పాటు చేయించుకున్న మెడల్స్ విదేశాలలో మెడలో వేయించుకుని స్వదేశం తిరిగివస్తున్నాడు. గమనించాల్సిన విషయమేమంటే, ఆయా మెడల్స్-అంతకుముందు గానీ, ఈయన తర్వాత గానీ ఎవరికీ ఇచ్చి ఉండనివి! అలాంటి అవార్డుల గురించి గానీ, మెడల్స్ గురించి గానీ ప్రపంచ పౌరులు ఎప్పుడూ విని ఉండనివి – అవి! అందుకే వారి స్వంత పార్టీ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి- మోడీకి చదువు లేదు, దొంగ డిగ్రీ, ఆర్థిక శాస్త్రంలో అఆలు కూడా తెలియవు’ అని విమర్శిస్తున్నా విశ్వగురువు నోరు మెదపక భరిస్తున్నాడు. పేదవాడు అడుక్కుంటే ‘బిచ్చం’ అని అంటారు. పూజారి, మౌల్వి వంటి మత పెద్దలు అడుక్కుంటే ‘దైవార్పణం’ అని అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు అడుక్కుంటే ‘చందా’ అని అంటారు. ఇలాంటి విశ్వగురువులైతే తెలివిగా దేశ ప్రజల ఓట్లు చోరీచేసి, న్యాయబద్దంగా గెలిచినట్టు ‘మన్ కి బాత్’ భాషణ్‌లిస్తారు. విషయాలు ఇష్టం వచ్చిన రీతిలో వక్రీకరించి ‘నిజాలేనేమో’ అని అనిపించేట్టుగా అబద్దాల్ని ప్రచారం చేసే వారినే అంధభక్తులు – అని అంటారు. వీరు భజనలు చేసే ఆరెస్సెస్- బీజేపీ పాలకులు చరిత్రహీనులుగా తమ పేరు ఎప్పుడో నమోదు చేసుకున్నారు.
వీరి చరిత్ర పరిజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి! ‘చోళులు 1500 సంవత్సరాలు పాలిం చారు. చాళుక్యులు 600 ఏళ్లు పాలించారు. పల్లవులు 600 ఏళ్లు, రాష్ట్రకూటులు -200 ఏళ్లు, విజయనగర రాజులు-300 ఏళ్లు కానీ మొఘలులు కేవలం 300 ఏళ్లు మాత్రమే పాలించారు. మన చరిత్ర పుస్తకాలు అన వసరంగా మొఘలుల్ని మాత్రమే పొగడుతూ రాశాయి” – అని అంధభక్తులు ఒక వితండ వాదనను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మూర్కులకు తెలియనిది ఏమిటంటే, వారు చెప్పిన లిస్టులోని వారు భారత దేశంలోని చిన్నచిన్న ప్రాంతాలను మాత్రమే పాలించారు. వీరేమైనా మొ త్తం దేశాన్ని పాలించారా? లేదే. దేశం మొత్తాన్ని ఒకప్పుడు అశోక చక్రవర్తి పరి పాలిస్తే, చాలాకాలం తర్వాత మళ్లీ మొత్తం దేశాన్ని ఒకేపాలన కిందికి తెచ్చిన వారు మొఘలులు.సమభావంతో పాలించడమైనా, సంస్కరణలు తీసుకురావడమైనా అది మొఘలులకు సాధ్యమైంది. మనం కూడా గతాన్ని సమదృష్టితో పరిశీలించాల్సి ఉంటుంది!
వాస్తవమైన వార్త దాచివేయబడుతుంది.
లేనిపోని పుకార్లు ప్రచారం చేయబడతాయి.
ఇక్కడ కథ ఒకటి ఉంటుంది?
కానీ, మనకు మరొకటి వినిపించబడుతుంది!!
మహ్మమ్మద్ ఘోరీ, గజనీ.. తురుష్కులు, ఆఫ్ఘన్లు, మంగోలియన్లు, మొఘలులు, యురోపియన్లు ఇలా అనేకమంది మన దేశంపై దాడులు చేశారు కదా? మరి అలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఇక్కడి రామబాణాలు, సుదర్శన చక్రాలు, పాశుపతాస్త్రాలు వంటివన్నీ ఏమైపొయ్యాయి? ఎందుకు పని చేయలేక పొయ్యియి? మనువాదుల ఢంకా బజాయించడం ఆపేసి, మనుస్మృతికి పుక్కిటి పురాణాలకు భజనలు చేయడం మానేసి, నిజాలు, వాస్తవాలు తెలుసుకోవాలి! వివేచనతో, విజ్ఞతతో ప్రవర్తించడం ప్రారంభించాలి. యాభై రోజులు ఆగండి! నా నిర్ణయం తప్పయితే నన్ను ఉరి తీయండి!” అని బీరాలు పలికిన మోడీ, తన పెద్దనోట్ల రద్దు నిర్ణయింపై ప్రసంగిస్తూ ఆ మధ్య ఒక ప్రకటన చేశారు కదా? మరి ఏమైందీ? నల్లధనం పోలేదు. బ్యాంకులకు రూ.15లక్షల కోట్లు తిరిగొచ్చాయి.
ఆర్థిక వ్యవస్థ మంద్యంలో పడింది. అన్నింటికన్నా ప్రజలు కష్టాల పాలయ్యారు. రాబోయే తరాలు మిమ్మల్ని నిలదీసి, దేశాన్ని ఇంతగా ఎలా నాశనం చేశారని అడిగితే ఏం చెపుతారు? తల దించుకుని, నిజమే- గాడిదను పులిగా చూపెడదామన్న ప్రయత్నంలో దేశం నాశనమైంది! అని ఒప్పుకోవాల్సి వస్తుంది.’చైనాలో కుక్కల్ని, పిల్లల్ని ఎలా తింటారూ?’ అని మన దేశప్రజలు అసహించుకుంటూ ఉంటారు. వాళ్లు ఏదో ఓ జంతువు మాంసం తింటున్నారు. ఇక్కడి లాగా మలమూత్రాలు భక్తితో సేవించడం లేదుకదా? భారత్‌లో ఆవుపేడ తిని, ఆవు మూత్రం తాగుతున్నారని’ చైనా వాళ్లేకాదు, ప్రపంచమే నోరు వెల్లబెడుతూ ఉంది! ఛాతి ఎంత వెడల్పు ఉంది. నోరు ఎంత పెద్దదీ అన్న దానితో దేశంలో పరిపాలన సాగదు. దానికి వివేక వంతమైన మెదడూ,లోతైన హృదయ నైర్మల్యం ఉండాలి! అంతే గాని, వెడల్పైన ఛాతి, అరవగల పెద్దనోరూ అసందర్భ ప్రేలాపనలు, అబద్ధాల ప్రచారాలు ఎంతమాత్రమూ పనికి రావు!! – నేషనల్ బుక్‌ట్రస్ట్ సలహా సంఘ పూర్వ సభులు, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



