”డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతున్నది. మన్మోహన్ బలహీన ప్రధాని. మేము అధికారంలోకి వస్తే డాలర్‌తో సమానంగా రూపాయి విలువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రూపాయికి, రెండు, మూడు డాలర్స్ వచ్చే రోజులొస్తాయి” 2013లో బీజేపీ అధికారంలోకి రాకముందు నరేంద్రమోడీ చెప్పిన మాటలివి.ఆయనే కాదు, ఆ పార్టీ నేతలంతా 2014 ఎన్నికల వరకు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఆయుధంగా వాడుకున్నారు. మరి ఇప్పుడు? మోడీ దేశ ప్రధాని అయిన ఈ పదకొండేండ్ల కాలంగా రూపాయి బలహీనపడుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే ప్రమాదకరంగా పతనమవుతున్నది. కేంద్ర సర్కార్ చర్యలెందుకు చేపట్టడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థైర్యాన్ని కొలిచే కీలక సూచీలో ఒకటైన భారత కరెన్సీ విలువ కొద్ది నెలలుగా నిరంతర పతన దిశగా సాగుతున్నది. ఇది ఆర్థిక నిపుణులను మాత్రమే కాదు, సామాన్య ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ల ఒత్తిడికి, దేశీయ విధాన పరమైన వైఫల్యాలకు, రాజకీయ-ఆర్థిక అనిశ్చితులకు రూపాయి బలవుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే తొంబై ఎనిమిది పైసలు క్షీణించింది. ఆల్ టైం రికార్డ్‌గా ఈ పతనం ఉంది. ఇదిలా ఉంటే ఒక వైపు డాలర్ కూడా పతనంలో ఉందన్నది ఆర్థిక విశ్లేషకుల మాట. డాలర్ ఇండెక్స్ చూస్తే పది శాతం పడి పోయింది. డాలర్ పడిపోతుంటే ఆ డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా పడిపోవడం అంటే ఆర్థిక దారుణ మేనా అన్న చర్చ సాగుతోంది. డాలర్ బలంగా ఉండి అన్ని దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి, ఆ క్రమంలో మన రూపాయి కూడా పడిపోతోందని అనుకున్నా ఒక అర్థం ఉంది. కానీ డాలర్ పతనమవుతున్నా మన రూపాయి ఇంకా దానితో గ్యాప్ పెంచుకోవడమంటే దాన్ని ఏ విధంగా చూడాలన్నదే చర్చగా ఉంది. రూపాయి ఎందుకు పతనమవుతుందో విశ్లేషించడానికి కూడా ఇప్పుడు ఆర్థిక నిపుణులకు ధైర్యం చాలడం లేదు.
మరి రూపాయి ఎందుకు పడిపోయిందో గుర్తించి కట్టడి చేయాలని ఎందుకు అనుకోరు? విదేశీ మదుపుదార్లు స్టాక్, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. వాటిని ఇతరచోట్లకు తరలిస్తున్నారు. వారంతా డాలర్ల రూపంలోనే లావాదేవీలు చేస్తారు కాబట్టి డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచారు.
ఇది పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. డాలర్లను ఇక్కడ ఉపసంహరించి అమెరికాలో డిపాజిట్ చేసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. లొంగని దేశాలపై ట్రంప్ బెదిరింపులు, వాణిజ్యపోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణమవుతున్నాయి. మనపైనా అదే ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను ఆర్బిఐ గుర్తించడం లేదా అంటే అన్నీ వంద శాతం తెలుసు. గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ వంటి ఆర్థిక నిపుణుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకును రంగంలోకి దింపి విదేశీ కరెన్సీ విక్రయాలు చేసి రూపాయిని కాస్త బలం పుంజుకునేలా చేశారు. కనీసం పడిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి విధా నాలను పట్టించుకోవడడం లేదు. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ చెబుతున్నప్పటికీ అవన్నీ ఉత్తుత్తి ప్రయత్నాలే. గతంలో రూపాయి పతనం అయిన ప్రతీసారి రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి ఫారిన్ ఎక్స్ఛ్‌ంజ్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసి రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేది.
ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆర్బీఐ మార్కెట్‌లో ఫారిన్ ఎక్స్ఛ్‌ంజ్‌గా విడుదల చేసే మొత్తాలు పదకొండు బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈసారి ఆర్బీఐ చేతులెత్తేసింది. అంటే ఆర్బీఐ విధానాన్ని పరోక్షంగా ప్రభుత్వ విధానంగా చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్బిఐ దగ్గర 700 బిలియన్ డాలర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆర్బిఐ ఇన్వాల్వెమెంట్ కావడం లేదు. 2024లో ఆర్బిఐ ఎన్ని డాలర్లు వాడింది, 2025లో ఎన్నిడాలర్లు వాడిందో చూస్తే తన ఇన్వాల్మెంట్ ఎలా ఉందో అర్థమవుతుంది. రూపాయి పతనం చెందుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో ఆలోచిస్తున్నది. నిర్మలా సీతారామన్ రూపాయి బలహీనపడడం కాదు, డాలరే బలహీనపడుతుందని ప్రకటించింది. పైగా మన దేశ ”ఎకానమీ ఫండమెంటల్స్” బలంగా బాగానే ఉన్నాయి. ”గ్లోబల్ పరిస్థితుల” వలన రూపాయి పడిపోతున్నదని వాదిస్తున్నారు. అదే నిజమైతే గ్లోబల్ గానే డాలర్ పరిస్థితి బాగా లేదు. డాలర్ కూడా పతనం చెందుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మన రూపాయి ఎందుకు పడిపోతుందో చెప్పకుండా దాటవేస్తున్నారు.
నిజంగా గ్లోబల్ పరిస్థితులే కారణమైతే జపనీస్ కరెన్సీ డాలర్ కంటే పెరుగుతుంది. యురోపియన్ కరెన్సీ పెరుగుతుంది. ప్రధానంగా మనం నలభై దేశాలతో మేజర్ ట్రేడ్ చేస్తాం వరల్డ్ ఎకానమీలో డీ డాలరైజేషన్ ను అమెరికాను వణికిస్తుంటే, డాలర్‌తో పోల్చినప్పుడు ఇతర దేశాల కరెన్సీ పెరుగుతుంటే, డాలర్ తగ్గుతుంటే ఇండియా రూపాయి మాత్రం ఎందుకు తగ్గుతుంది? దీన్ని ప్రభుత్వం ప్రస్తావించడం లేదు. ప్రపంచవ్యాప్తంగానే అమెరికా డాలర్ కు ప్రతికూలత ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా పతనంలోకి వచ్చాయి. ఎఐ బబుల్ పతనమవుతుందని వాల్ స్ట్రీట్ అంచనా. అమెరికా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఎక్స్చెంజ్ హవా, డాలర్ ట్రేడ్ తగ్గుతుంది. ప్రపంచంలో దేశాలపై టారిప్స్‌తో ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. చైనా, యూరోపియన్ దేశాలపై ట్రంప్ టారిప్స్‌తో బెదిరిం పులు చేసిన, చైనా కూడా టారిప్స్‌తో రివర్స్ చేయడంలో బెంబేలెత్తి పోయాడు. కానీ భారత్ పట్ల మాత్రం ట్రంప్ తన దూకుడును ప్రదర్శిస్తున్నా మోడీ మౌనంతో తన భక్తినీ చాటుతున్నాడు.
మనదేశంలో పత్తి రైతులు ఆగమవుతున్నా, రోడ్డెక్కి పత్తిని కొనుగోలు చేయాలని ఆందోళనలు చెందుతున్నా ఇంపోర్ట్ డ్యూటీని కాటన్‌పై పదకొండు శాతానికి తగ్గించారు. పైగా మన రైతుల నుండి కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా నుండి విదేశీ పత్తిని దిగుమతి చేస్తున్నారు. టెస్లా కార్లకు అనుమతులిచ్చి ముంబాయి, ఢిల్లీలో టెస్లా షోరూంలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఆయిల్ కొనుగోలులో యాభై శాతం టారిప్స్ అమెరికాకు భయపడి రష్యా నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించారు. 2017 నుండి రష్యా నుండి మనం 62శాతం ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంటే 2024లో 32శాతం ఆయిల్ రష్యా నుండి దిగుమతి చేసుకునే శాతానికి పడిపోయింది. పైగా అమెరికా నుండి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకుని వచ్చాడు మోడీ. ఇండియా నుండి మూడు లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకుంటున్నారు. చదువుల కోసం తమ ఆస్తులను డాలర్లుగా మార్చి అమెరికాకు వారి పిల్లలను పంపుతున్నారు. హెచ్1-బి వీసాల పేరుతో అమెరికాలో పనిచేస్తూ వారి ఎకానమీ కోసం పనిచేస్తున్నారు.
ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఇండియా పాత్రను పరిగణలోకి తీసుకుని ఇండియా మార్కెట్ వారి మార్కెట్ కోసం ఓపెన్ చేయాలని ట్రంప్ బెదిరింపులు చేస్తున్నాడు. ట్రేడ్ డీల్ లేకుం డానే మోడీ అన్ని ముందే అమెరికాకు బార్లా తెరుస్తున్నారు. ఎగుమతులు చేస్తే డాలర్లు వస్తాయి. దిగుమతుల వల్ల డాలర్లు రావు, డాలర్స్ సంపాదిస్తున్న దానికి ఖర్చు పెడుతున్న దానికి ఇన్ బ్యాలెన్స్ వలన డిమాండ్ సప్లరులో అసమతుల్యత ఏర్పడి రూపాయి పతనమవుతోంది. మరోవైపు చూస్తే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి.దీనికోసం చర్యలు తీసుకోకుండా ప్రజల భాగోద్వేగాలతో ఆడుకుంటున్నారు. మనదేశంలో 44 బిలియన్ డాలర్ల వరకూ విదేశీ పెట్టుబడులు ఇపుడు దారుణంగా పడిపోయాయి.
డాలర్ల ఫ్లో కూడా తగ్గిపోయింది.చమురు దిగుమతులపై ఆధారపడిన దేశానికి రూపాయి పడిపోవడం అతి పెద్ద దెబ్బ. డాలర్ విలువ పెరుగుతున్న ప్రతిసారీ, భారత్ చెల్లించాల్సిన ఇంధన బిల్లులు అమాంతం పెరుగుతాయి. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో ప్రజల జేబులకు నేరుగా తాకుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత ముదురుతుంది. కూరగాయల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్ని రంగాల ధరలు పైకెక్కుతాయి. రూపాయి పతనం ఒక సంఖ్య మార్పే కాదు, దేశ ప్రజల ఎదుట కొత్త భారాల పర్వతం పెరగడమే. మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ప్రత్యామ్నాయం వైపు మళ్లడమే అన్ని సమస్యలకు పరిష్కారం.
టి. నాగరాజు
9490098292



