”పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు అనివార్యం. అలల మాదిరిగా అప్పుడప్పుడు వచ్చె సంక్షోభాలు క్రమంగా పెను తుఫానులుగా మారుతాయి” అని ఏనాడో కారల్ మార్క్స్ చెప్పాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో ప్రజలకు ఏం అవసరమో అది ఉత్పత్తి జరగదు. దేనికైతే లాభాలు వస్తాయో అదే అధిక ఉత్పత్తి జరుగు తుంది. దీంతో డిమాండ్ సప్లరుల మధ్య అసమతుల్యత ఏర్పడి, సంక్షోభాలు అనివార్యంగా వస్తాయి. చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని రుజువు చేసింది, చేస్తూనే ఉంది.పెట్టుబడిదారులు ఈ సంక్షోభ భారాలను సామాన్య ప్రజల మీదకు నెట్టివేసి, తాము గరిష్ట లాభాలను పొందటానికి, సంక్షోభ కాలంలో మరింత ప్రయత్నం చేస్తారు.నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. ఈ దృక్పథం నుండి పరిశీలిస్తే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ పతనం శరవేగంగా కొనసాగు తూ ఉంది. తాజాగా అది మరింత అగాధంలోకి పడిపోయింది. నేటి గణాంకాల ప్రకారం డాలర్‌తో రూపాయి మారకం విలువ అత్యంత గరిష్టంగా 90.74 రూపాయలకు పడిపోయింది. స్వాతంత్రా నంతరం రూపాయి విలువ పతనంలో ఇదే రికార్డు. భారతదేశ చరిత్రలో ఇంత కనిష్ట విలువతో రూపాయి ఎప్పుడు లేదు. ఈ తాజా పతనంతో ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా ఇండియన్ రూపాయి నమోదైంది.
ప్రపంచ ద్రవ్య మార్కెట్లో ఇండియా రూపాయి విలువ పతనం కొంతకాలంగా క్రమంగా క్షీణిస్తూ ఉన్నది. సరిదిద్ది చర్యలు చేపట్టవలసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు .పైగా మన దేశము నుండి జరిగే ఎగుమతులకు రూపాయి విలువ పతనం ఉపయోగపడుతుందని సర్ది చెప్పుకుంది. మరోవైపు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్య నిలువలు క్షీణించడం జరిగింది. అలాగే దేశంలో ప్రజల కొనుగోలుశక్తి కూడా దారుణంగా పడిపోతూ ఉంది. దీనికితోడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటంతో రూపాయి విలువ పతన ప్రభావం సామాన్యులపై నేరుగా పడి, గుదిబండగా మారింది. భారతదేశంపై అమెరికా విధించిన సుంఖాలు, విదేశీ పెట్టుబడుల భారీ ఉపసం హరణలు, వాణిజ్య లోటు పెరగటం, తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు వంటివి మన రూపాయి విలువ మరింత దిగజారేటట్టు చేశాయి. ముఖ్యంగా నెల రోజుల్లోనే రూపాయి విలువ దాదాపు 80 పైసలు పతనం అయింది. నవంబర్ 15వ తేదీన డాలర్‌కు 90.80 రూపాయలుగా నమోదు కాగా, నవంబర్ 25న 9.10గా ,డిసెంబర్ 10న 90.53గా, అదే డిసెంబర్ 15న 90.74 రూపాయలుగా భారత కరెన్సీ విలువ పడిపో యింది. ఈ ఏడాది ఇప్పటివరకు మన రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే దాదాపు ఆరుశాతం క్షీణించింది. ప్రస్తుతం ఆసియా కరెన్సీలో అత్యంత దారుణ పతనం కనబరిచిన కరెన్సీగా రూపాయి నమోదయింది. ఇలాగే కొనసాగి ఈ నెలలోనే మరింత క్షీణించి రూ.90.80కి పడిపోవచ్చని నిపుణుల అంచనా. ఇంకా ఇది దాటి రూ. 91 నుంచి 92 దిశగా వెళ్లే అవకాశం ఉందని భావిస్తు న్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటిక.
ఇలా భారత రూపాయి విలువ పతనం పరిశీలిస్తే స్వాతంత్రం సిద్ధించిన 1947లో డాలర్ తో రూపాయి మారకం విలువ మూడు రూపాయలు. 1967 వరకు కొంచెం అటు ఇటు నిలకడగా ఇదే విలువ కొనసాగింది. 1967 నుండి 2014 వరకు చిన్నగా 60 చేరుకుంది. అంటే ఈ దశకు రావటానికి 47 సంవత్సరాలు పట్టింది. కానీ 60 రూపాయల నుండి 90 రూపాయలు కావటానికి (2014-2025) సంవత్సరాలే పట్టింది. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఘనత. వాస్తవం ఇలా ఉంటే మోడీ ప్రభుత్వం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని గొప్పలు చెప్పుకుంటుంది. త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని డాంబికాలు పలుకుతూ ఉంది. ఇది పూర్తి వాస్తవ విరుద్ధం. కరెన్సీ అనేది భౌతిక సంపదకు విలువ కట్టే ప్రతినిధి. కరెన్సీ విలువ అంటే కరెన్సీ మారకపు విలువ .మన కరెన్సీ మారకపు విలువ మన ఎగుమతులకు విదేశాలలో ఎంత డిమాండ్ ఉన్నది అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది.
మరి ముఖ్యంగా 1991 నుండి దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరిట స్వావలంబనకు సలాం చెప్పి, విదేశీయతకు గులాం అని మొత్తం దేశ వనరులను విదేశీయులు దోచుకోవటానికి మన మార్కెట్‌ను బార్ల తెరిచింది. అప్పటినుండి రూపాయి విలువ వేగంగా పతనమైంది. 1990లలో ఒక డాలర్‌కు రూపాయి మారకం విలువ 17-20రూ.ల మధ్య ఉంది. అదే ఇప్పుడు అత్యంత వేగంగా 2025 నాటికి రూ.90 దాటింది. 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణల ప్రభావం పూర్తిగా వికటించి ,నేడు పూర్తి పతనా వ్యవస్థకు చేరుకుంది. ఈ చేదు వాస్తవం
కళ్ల ముందు కనబడుతుంటే, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని మోడీ సర్కారు బాకా ఊదుతోంది. ప్రపంచ అసమానతల నివేదిక 2026 నివ్వెర పరిచే విషయాలు బయటపెట్టింది. అన్ని దేశాల్లో కల్లా ఆర్థిక అసమానతలు భారతదేశంలోనే ఎక్కువని వాస్తవం తేటతెల్లం చేసింది. దేశంలోని ఆదాయంలో అరవైశాతం కేవలం పదిమంది చేతుల్లో పోగుబడి ఉందని, పేదలు మరింత పేదలుగా దిగజారి పోతున్నారని, ఆదాయ అసమానతలు చాలా లోతుగా పాతుకుపోయాయని చెప్పింది. సంపద అత్యంత అసమానమైన రీతిలో పంపిణీ కావటం ఆందోళనకరం. ఇదేనా మోడీ’ వికసిత్ భారత్’…? ఏదైనా రూపాయి విలువ ఇంతగా దిగజారటం వలన ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోయింది .జీవన ప్రమాణం తగ్గిపోయింది. ఉపాధి అవకాశాలు తగ్గి, నిరుద్యోగం ప్రబలి పోయింది. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ఒక ఆర్థిక విషవలయంలో చిక్కుకుంది. ఈ పరిణా మాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందో ళనలకు దిగుతారు. శ్రీలంక ,బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు మన దేశంలో చోటు చేసుకునే అవకాశం ఉంది.ఈ సంక్షోభాల నుంచి బయట పడాలంటే దేశంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలి. ఆ దిశగా ప్రజలు కార్యచరణకు సిద్ధమవ్వాలి.
షేక్ కరీముల్లా
9705450705



