– మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుంది
– కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అభివృద్ధి కోసం పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యాలయంలో మహిళలు భాగస్వామ్యం కావాలని అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ పథకాల పర్యవేక్షక బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అమీర్ నగర్, దొమ్మరి చౌడు తండా గ్రామ పంచాయతీల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పథకాల అమలు తీరును పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు తమ పర్యటనలో గ్రామ స్థాయిలో పెన్షన్ లు, మహిళా సంఘల పనితీరు, ఉపాధి హామీ కూలీల పనితీరు, గ్రామ పంచాయతీలలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబడిన కమ్యూనిటీ సాక్ పిట్స్, ఇతర పనులు, గ్రామ పంచాయతీలో గ్రామ సభల నిర్వహణ, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్వహణ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణము, మొదలగు పనులను పర్యవేక్షణ చేశారు.
దొమ్మరి చౌడు తండా గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల రికార్డులను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు, కల్పిస్తున్న ఉపాధి గురించి ఆరా తీశారు. అమీర్ నగర్, దొమ్మరి చౌడు తాండ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలలో పెన్షన్ పంపిణీ, రేషన్ పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలన్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాదుల కల్పన మిషన్ క్రింద స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వడంతో పాటు రుణపరిమితిని కూడా పెంచడం జరిగిందని అధికారులు తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలు నూతనంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తున్న సంగతిని గుర్తు చేశారు.
జిల్లాలోని మారుమూల గ్రామమైన దొమ్మరి చౌడు తండాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చక్కటి గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని చేశారని ప్రశంసించారు. తాము గతంలో చూసినప్పటికీ ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు చక్కగా అమలు అవుతున్నాయని అన్నారు. కేంద్ర బృందం సభ్యులకు స్థానికులు పలు వినతులు, సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఉపాధి పని దినాలను పెంచాలనీ, మహిళా సంఘాలకు వడ్డీ తగ్గించాలనీ, ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ, పెండింగ్ బిల్లులను ఇప్పించాలనీ స్థానికులు కేంద్ర బృందం సభ్యులకు విన్నవించారు. ఉపాధి హామీ పని దినాలని పెంచే అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఇదివరకే కమిటీ వేసిందని దానిపై అధ్యయనం జరుగుతుందని బృందం సభ్యులు తెలిపారు.
మహిళా సంఘాలకు బ్యాంకులు గతంలో 15 శాతం వరకు వడ్డీ విధించేవని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చొరవతో 11 నుంచి 12 శాతం వరకు వడ్డీ విధిస్తున్నాయని అన్నారు. దీనిని మరింత తగ్గించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని మహిళలు కోరగా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు. దొమ్మరి చౌడు తాండలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనానికి సంబంధించి బిల్లులు ఇంతవరకు రాలేదని స్థానిక మాజీ సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అట్టి నిధులను ఇతర పనులకు మళ్ళిస్తోందని, పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 40 శాతం వాట సకాలంలో విడుదల చేయడం లేదని అన్నారు.
వీటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించడం జరుగుతుందని, ఇది తుది దశలో ఉందని, తొందరలోనే అన్ని పెండింగ్ బిల్లులు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నూతన సాఫ్ట్ వేర్ వల్ల ఇకముందు కేంద్రం బిల్లులను నేరుగా చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అనంతరం అమీర్ నగర్, దొమ్మరి చౌడు తాండ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న ప్లాంటేషన్, సిసి రోడ్లు, పలు భవనాల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలను కేంద్ర బృందం సభ్యులు తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా ఏపీడి ఓంపాల్, తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ రాజేశ్వర్, డిఈ రమేష్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, ఈజీఎస్ ఏపీఓ విద్యానంద్, వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES