భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఎన్నో విశిష్టమైన సదుపాయాలు పొందుపరిచారు. అందులోని జీవితం అనే పదానికి ఎంతో విశాలమైన హక్కులతో కూడిన జీవితంగా పేర్కొంటూ దాన్ని అర్థవంతంగా చేసుకునే విధంగా భారత సర్వోత్తమ న్యాయస్థానం భాష్యం చెప్పింది. ఈ హక్కులు మానవ మనుగడను రక్షించే విధంగా తయారు చేయబడినాయి. అంటే గౌరవంగా, స్వేచ్ఛగా, న్యాయంతో జీవించే హక్కుగా నిర్వచించింది. ఈ జీవన హక్కులో గౌరవంగా పనిచేసే హక్కు కూడా పొందుపరచబడింది. గ్రామీణ భారతంలో కులాలు, మతాలు లింగ బేధం లేకుండా అన్ని రకాల ప్రజలకు వారి జీవన హక్కులను బలోపేతం చేయడానికి 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( దాన్ని నరేగా అని కూడా పిలుస్తున్నారు) పార్లమెంటులో ఆమోదించబడి చట్టంగా తయారైంది. మొట్టమొదటి యుపిఏ ప్రభుత్వ కాలంలో వామపక్షాల సంపూర్ణ మద్దతుతో రూపొందించబడింది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోగానే ఉపాధి చట్టానికి తూట్లు పొడవడం మొదలు పెట్టి దాని స్ఫూర్తిని నాశనం చేయడానికి చర్యలు చేపట్టింది. పార్లమెంటులో తయారైన శాసనానికి ఏ విధమైన చర్చ లేకుండా దానికి మార్పులు చేయడం ద్వారా ఆ పార్టీ చట్టం స్ఫూర్తినే కాక భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిపై కూడా దాడి చేయడం ప్రారంభించింది. ఈ చట్టం ద్వారా గ్రామీణ భారతంలో ఎక్కువ పనిదినాలు కల్పించి ఉపాధి పెంచే పథకంగా జరగగా బీజేపీ చేసిన సంస్కరణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
ఉపాధిపై బీజేపీ దాడి
అధికారంలోనికి వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రభుత్వం ఉపాధి చట్టం స్ఫూర్తిని నీరుగార్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది.
మొదటిది: మొట్టమొదట పథకం ప్రవేశపెట్టినపుడు కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతం నిధులు అంటే 2.5 లక్షల కోట్లు కేటాయించగా తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం 1.37శాతం అంటే 86వేల కోట్లుమాత్రమే కేటాయించింది. అంతేకాక గతేడాది కేటాయింపులకు ఈ సంవత్సరపు కేటాయింపులు పెరగకపోగా కేటాయించిన పూర్తి బడ్జెట్‌ను కూడా ఈ పథకానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. చట్టం ప్రకారం రకరకాల కారణాలచేత కనీసం వంద పనిదినాలు కల్పించడంలో విఫలమవుతుండగా బడ్జెట్ కేటాయింపులు ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఈ ఏడాది సగటున కల్పించిన పని దినాలు 50.23 కాగా గత ఆర్థిక సంవత్సరం ముందు అది 52.8 గా ఉండింది. గతేడాది 40,74,214 కుటుంబాలకు అంటే నమోదైన కుటుంబాల్లో కేవలం ఏడు శాతం వంద పని దినాలు కల్పించగా అంతకు ముందు ఏడాది 44,94,214 అనగా 7.6శాతం కుటుంబాలు లబ్ధి పొందాయి. అంటే రానురానూ బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనడంలో సందేహం లేదు.
రెండవది: నమోదైన కూలీల పేర్లు అర్ధాంతరంగా తొలగించడం గత సంవత్సరానికి ముందు ఉపాధి పథకానికి 25.2 కోట్ల మంది నమోదు కాగా ఆధార్ ఆధారిత ధ్రువీకరణ తర్వాత ఆ సంఖ్య 18.28 కోట్లకు తగ్గింది. అంతమందినే ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా నిర్ధారించింది. 6.94 కోట్ల మంది అంటే 27.52శాతం మందిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. మహారాష్ట్రలో 6.44శాతం, గుజరాత్‌లో 58.01శాతం, తెలంగాణలో 39.31శాతం ఇంకా ఇతర రాష్ట్రాల్లో అంతా కలిపి 25శాతం పైగా అనర్హులుగా ప్రకటించబడ్డారు. బీజేపీ ప్రభుత్వం జాతీయస్థాయిలో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం ప్రవేశపెట్టిన నాటి నుండి ఈ పరిస్థితి నెలకొన్నది. చట్టంలోని మూడవ సెక్షన్ ప్రకారం ప్రతి తొలగింపు వ్యక్తిగతంగా సమీక్షించి గ్రామసభ ద్వారా ధ్రువీకరించి మాత్రమే జరగాలి. ఇంకా ఆ జాబుకార్డుకు ఏమైనా బాకీలు అంటే చేయవలసిన చెల్లింపులు నిరుద్యోగ భృతి లేదా ఆలస్యానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం లాంటివి తొలగింపుకు ముందే పరిష్కరించాలి. సుప్రీంకోర్టు, గ్రామీణ అభివృద్ధికి చెందిన స్టాండింగ్ కమిటీ నిర్ణయాలకు విరుద్ధంగా బీజేపీ ఈ విధానాన్ని నిర్బంధం చేసింది. ఆర్బిఐ నివేదిక ప్రకారం 25 కోట్ల మంది భారతీయులు స్మార్ట్ ఫోన్లు వాడే అవకాశం లేదా స్థితి లేని వారు. అందులో ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలే ఎక్కువమంది. ఈమధ్య వచ్చిన వార్త ప్రకారం భారతదేశంలో 35 శాతం మంది దళిత ఆదివాసీ పురుషులు 15 శాతం మంది స్త్రీలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం ద్వారా నమోదు చేయించుకోవడం వారికి గగనమే. దాని పర్యవసానంగా వారంతా అనర్హులుగా నిర్ధారించబడ్డారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ విధంగా గమనంలోకి తీసుకోలేదో అర్థం కాదు. కానీ దాని ఫలితంగా వారంతా జాబ్ కార్డ్ లిస్ట్ నుండి తొలగించబడ్డారు. ఒకపక్క గ్రామీణ భారతంలో కొన్నేండ్లుగా నిరుద్యోగం, ఉపాధి లేమి పెరుగుతుండగా ఉపాధి కల్పించే జాబు కార్డుల తొలగింపు కూడా పని దినాలకు దారితీసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం 389.09 కోట్ల పనిదినాలు కల్పించగా గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 286.26 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. అంటే వంద పనిదినాలు తగ్గించబడ్డాయి. ఇది అంతకు ముందు కల్పించిన దానిలో 1/3 వంతు అని గమనించాలి.
మూడవది: ఉపాధి అమలులోకి వచ్చిన కొత్తలో దళిత ఆదివాసీల అసైన్డ్ భూములను అభివృద్ధిపరిచే పని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక పరిస్థితుల్లో కొంతమేరకు అభివృద్ధి కనబడింది. కాగా తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత భూములపై కాక పట్టణ ప్రాంత భూముల అభివృద్ధిపై దృష్టి సారించింది. గతంలో 65శాతం నిధులు వ్యవసాయ లేదా దాని అనుబంధ కార్యకలాపాలకు వినియోగించితే నేడు అది 46.74 శాతానికి పడిపోయింది. మరొక ముఖ్యమైన డిమాండ్ ఉపాధి వ్యవసాయ పనులను అనుసంధానించడం. ఉపాధి పనులను పెంచడానికి బదులుగా బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదరైతు కూలీలను భూస్వాముల ధనికుల భూముల్లో పనిచేయమని బలవంతం చేస్తున్నది. తద్వారా గ్రామీణ ధనవంతులతో రైతు కూలీల బేరసారాల శక్తి తగ్గిపోయింది పనిదినాల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఉపాధి చట్టానికి మరిన్ని తూట్లు పొడుస్తూ బీజేపీ సర్కార్ రాష్ట్రాలకున్న నిర్ణయాత్మక శక్తి లేకుండా కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే పని దినాల కేటాయింపుకు తెగబడింది.
నాలుగవది: ఉపాధి అమలులో రైతు కూలీలకు పని దినాలు తగ్గే విధంగా యంత్ర సాంకేతికను ప్రోత్సహించడం సామాగ్రి విడి భాగాల కొనుగోలు ఖర్చును ఈ నిధుల నుండే ఖర్చు చేయడం జరిగింది. ఈ పథకం ప్రవేశపెట్టిన కొత్తలో కేవలం పది శాతం మాత్రమే వస్తువులు విడిభాగాలకు కేటాయించారు. మిగిలిన నిధులు రైతు కూలీల జీతాలు చెల్లింపులకు వినియోగించారు కానీ నేడు అది 36 శాతానికి పెరిగింది. యంత్రాల వాడకం కూడా పెరిగింది. పర్యవ సానంగా రైతు కూలీల బదులు యంత్రాలు సాంకేతికత వినియోగం పెరిగి పని దినాలు పడిపోయాయి.
ఐదవది: ఈమధ్య ఉపాధి రైతు కూలీలకు రెండు నుండి ఏడు శాతం వేతనం పెంచడం కేవలం వారిని స్పష్టంగా ఈ పనులకు దూరంగా ఉంచడమే. వారి శ్రమదోపిడీకి పాల్పడడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 300 నుండి 307కు పెరగగా బీహార్‌లో 245 నుండి 255కు కేరళలో 346 నుండి 349కి వారి వేతనాలు పెరిగాయి. ఈ రకమైన పెంపు చేసినప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని జీవనవ్యయాన్ని గమనంలోనికి తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఉపాధి చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జీతాన్ని కేంద్రం కూడా అమలు పరచాలి. ఉదాహరణకు కేరళ ప్రభుత్వం 800 రూపాయలు నిర్ణయించగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది చాలా తక్కువగా ఉండటం శోచనీయం.
ధనికుల, భూస్వాముల పక్షాన బీజేపీ
బీజేపీ ప్రభుత్వానికి గ్రామీణ ఉపాధి చట్టాన్ని స్ఫూర్తితో అమలు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈపథకం అన్ని రకాల ప్రజలకు కుల, మత, లింగ భేదం లేకుండా సమాన హక్కులు గౌరవప్రదమైన జీవన అవకాశాన్ని కలుగజేయడమే. గ్రామీణ నిరుపేదలు గౌరవంగా బతికితే గ్రామీణ ధనికుల భూస్వాముల ఆధిపత్యాన్ని వారు ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు. బీజేపీ ధనికుల, భూస్వా ములు చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ల ప్రయోజనాలు కాపాడుతూ ఆరెస్సెస్ మనువాద సంస్కృతికి కాపు కాస్తూ ఆధిపత్య కులాల వర్గాలను కాపాడుకుంటూ వస్తున్నది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం త్రైమాసిక నిధులుగా రూ.29,803 కోట్లు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు విడుదల చేసింది. ఇందులో రూ.19,226 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు కేటాయించింది. పనిచేసిన రైతు కూలీలకు 14రోజుల్లోగా చెల్లింపులు జరగాలి కానీ ఇప్పటికీ లక్షలాదిమందికి సకాలంలో చెల్లింపులు జరగక అవస్తలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా కేటాయించిన నిధులను రాష్ట్రాలకు విడుదల చేయకపోవడం దారుణం. బీజేపీ ఈ విధంగా నిరుపేదలపై దాడికి పూనుకోగా కొన్ని రాష్ట్రాలు గ్రామాలను పట్టణీకరించే పనిలో అత్యుత్సాహం చూపుతున్నాయి.. వాటిని మున్సిపాలిటీలలో కలుపుతున్నాయి. ఉపాధి చట్టం పట్టణాలకు వర్తించదు కాబట్టి ఆ చట్టం అమలు కొన్నిచోట్ల ప్రశ్నార్ధకమవుతున్నది. ఇది కేవలం పంచాయతీల్లోని గ్రామాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇదిచట్టాన్ని నీరుగార్చే కుట్రలో మరో భాగం. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ నాయకత్వంలోని ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని సాకుతో గత మూడేండ్లుగా ఆ రాష్ట్రానికి కేంద్రం ఉపాధి నిధులు విడుదల చేయడం లేదు. అవినీతిని అంతమొందించకుండా సమస్యను పరిష్కరించకుండా నిధులు కేటాయింపు అర్ధాం తరంగా నిలిపివేయడంతో బూర్జువా పార్టీలైన తృణమూల్, కాంగ్రెస్, బీజేపీల మధ్య సంఘర్షణ మొదలైంది. కానీ ఈ పార్టీల మధ్య అమాయకులైన గ్రామీణ రైతు కూలీలు బాధితులు కావడం బాధాకరం.నిధులు ఆపి గ్రామీణ కూలీలను ఇబ్బంది పెట్టిన కేంద్రం తీరును ఇటీవల కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. ఉపాధి గ్రామీణ ప్రజల హక్కు అని తేల్చిచెబుతూ 2025 ఆగష్టు ఒకటినుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది.
సంఘటిత ఉద్యమాలే శరణ్యం
నూతన సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ధనవంతమైన గ్రామీణ వర్గం ఉద్భవించింది. వారు బీజేపీ భావజాలాన్ని ఆర్థిక విధానాలను సమర్థించసాగారు. ముఖ్యంగా గ్రామీణ ఆధిపత్య కులాలు ఆరెస్సెస్ మనువాద భావజాలం నుండి లబ్ధి పొందుతూ నాటి హిందూ మహాసభ, వీహెచ్‌పీ, జన సంఘం, నేటి బీజేపీలు సమర్ధిస్తున్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కాపాడుకుంటూ గ్రామీణ పేదలను విభజించారు. ఈ రకమైన విభజన విధానం గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద పెట్టుబడులతో వనరుల వెలికితీతకు సహాయపడింది. ఉపాధి చట్టం సాంఘిక సామాజిక ఆధిపత్యాన్ని నిలదీసింది, నిలువరించింది. అది కేవలం ఉపాధి కల్పించడమే కాదు గ్రామీణ పేదల మధ్య సంఘీభావాన్ని పెంపొందించింది. కులమతాల విభజనల అడ్డుగోడలను కూల్చేస్తూ వారికి సమాన వేతనాలు కల్పించింది. దీంతో బీజేపీకి ఇంతకాలంగా ఉన్న అధికార పట్టు సడలింది. గ్రామీణ ధనికుల సామాజిక రాజకీయ ఆధిపత్యానికి ఈ చట్టం తెరదించింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రపంచ బ్యాంకు గణాంకాలను బీజేపీ చూపిస్తూ దేశంలో అత్యంత నిరుపేదలు తగ్గిపోయారని చెప్పుకుంటుంది. కానీ దానికి కారణం కేవలం ఉపాధి చట్టం అమలు మాత్రమే.
ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం మూడుకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు అత్యంత నిరుపేదలు. ఉపాధి చట్టం అమలు కారణంగా గ్రామీణ పేదలు అంతకన్నా ఎక్కువ ఆదాయం పొందడంతో అత్యంత నిరుపేదల లిస్టు నుండి వారు బయటపడ్డారు. కానీ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అమల్లోకి రావడంతో తిరిగి వారు మళ్లీ పేదరికంలోనికి నెట్టి వేయబడుతున్నారు. కేంద్రం విధానాల వల్ల నేటి గ్రామీణ భారతంలో నిరుపేదలకు, ధనస్వాములకు ఒక వైరుధ్యం ఏర్పడుతున్నది. ఈ అంతరాలను తొలగించడానికి మనం గ్రామీణ నిరుపేదల పక్షాన నిలవాలి. వారిని సంఘటిత పరిచి ముందుకు నడిపించాలి. అందుకుగాను కేంద్రం ఉపాధిని బడ్జెట్‌ను రూ 2.5 లక్షల కోట్లకు పెంచేలా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవాలి. అలాగే ఏడాదికి 200 పనిదినాలు కల్పించేందుకు, కనీస వేతనం రూ.600గా నిర్ణయించేలా పోరాటాలు చేయాలి. అప్పడు మాత్రమే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సంరక్షించుకోగలం.ఇది నేటి ఆవశ్యకత.
బి.వెంకట్
9490098045