భారత్‌కు అమెరికా అనుమతి
న్యూఢిల్లీ : రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా ‘అనుమతించింది’. ఈ వెసులుబాటుతో ఇంధన ధరల పెరుగుదలకు కళ్లెం వేయవచ్చునని, మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో దిగుమతులలో జరుగుతున్న జాప్యం కారణంగా సరఫరాలలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల వల్ల ఎదురవుతున్న ఒత్తిడులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ తెలిపారు. కాగా దేశంలో ముడి చమురు, పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినన్ని ఉన్నాయని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం భారత్ వద్ద ఇరవై ఐదు రోజులకు సరిపడా ముడి చమురు, ఇరవై ఐదు రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. భారత్ ఇటీవల కాలంలో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకొని, అమెరికా నుంచి సరఫరాలను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకుని అమెరికా, గల్ఫ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నందున దేశంపై ఆర్థిక భారం పెరుగుతోంది. కాగా ట్రంప్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘ఉదారత’పై కాంగ్రెస్ మండిపడింది. భారత్ ఎవరి వద్ద చమురు కొనుగోలు చేయాలో, ఎవరి వద్ద కొనుగోలు చేయకూడదో అమెరికా నిర్దేశిస్తోందని ఆరోపించింది.



