టెహ్రాన్ : రష్యా, చైనా, ఇరాన్ దేశాలకు చెందిన నౌకా దళాలు హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న జలాలలో యుద్ధ నౌకలను మోహరించి సైనిక విన్యాసాలకు సిద్ధమయ్యాయి. ఈ జలసంధి పర్షియన్ సింధుశాఖ నుంచి మహా సముద్రాలలోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలలో ఒకటి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యూఏఈ, ముసందమ్, ఒమన్ ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్ ఈ మూడు దేశాలు హార్ముజ్ జలసంధిలో విన్యాసాలు జరపబోతున్నాయి. సముద్ర కార్యకలాపాల సమన్వయాన్ని బలోపేతం చేసుకునేందుకు, వాణిజ్య నౌకా మార్గాలను రక్షించుకునేందుకు ఇరాన్ నేతృత్వంలో విన్యాసాలు చేపడతామని రష్యా అధ్యక్షుని సలహాదారు నికొలే పాత్రుషెవ్ చెప్పారు.
రష్యాకు చెందిన ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రుషెవ్ మాట్లాడుతూ వైమానిక సిబ్బంది, లాజిస్టిక్ నౌకలు, నౌకాదళ విమానయాన దళాలు విన్యాసాలలో భాగస్వాములవుతాయని తెలిపారు. యాంటీ పైరసీ, సెర్చ్-రెస్క్యూ డ్రిల్స్ నిర్వహిస్తామని, కమ్యూనికేషన్ విన్యాసాలు జరుపుతామని, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం కూడా వీటిలో భాగంగా ఉంటాయని వివరించారు. కాగా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రతి రోజూ 17 నుంచి 20 మిలియన్ బ్యారల్స్ చమురు రవాణా అవుతోంది. అంటే ప్రపంచ దేశాలు వినియోగిస్తున్న చమురులో ఐదో వంతు ఈ జలసంధి మీదుగానే సరఫరా అవుతోంది. ఇది ప్రపంచంలోని అత్యంత కీలక ఇంధన చెక్‌పాయింట్లలో ఒకటి. ఈ మార్గంలో లిక్విఫైడ్ సహజ వాయువు కూడా గణనీయంగానే రవాణా అవుతుంది. ఈ సరఫరాలకు ఏ మాత్రం అంతరాయం కలిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. హర్ముజ్ జలసంధి ద్వారా అమెరికా యుద్ధ విమానాలు ఇప్పటికే ఖతార్, జోర్డాన్, ఇతర గల్ఫ్ దేశాలలోని స్థావరాలలో మోహరించి ఉన్న విషయం తెలిసిందే.
హార్ముజ్ జలసంధిలో రష్యా, చైనా, ఇరాన్ సైనిక విన్యాసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



