అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరిక
ప్రతి చర్యలు తప్పవని స్పష్టీకరణ
బీజింగ్ : రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్ తదితర దేశాలపై ఆంక్షలు, సుంకాలు విధిస్తామంటూ పదేపదే బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్న అమెరికా తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయబోమంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో చైనా కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ గురువారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా..అమెరికా తీరుపై జియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకపక్ష ఆంక్షలను సహించే ప్రసక్తే లేదని, తీరు మారకపోతే ప్రతి తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడాన్ని సమర్థించుకున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చట్టబద్ధమైనవని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదన్నారు. అమెరికా వైఖరి ఏకపక్ష బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు గురిచేడమే అమెరికా ఉద్దేశ్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఒంటెద్దు పోకడల వల్ల అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పారిశ్రామిక, సరఫరా గొలుసుల భద్రత, సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. రష్యాతో సహా పలు ప్రపంచ దేశాలతో చైనా సాధారణ వాణిజ్య, ఇంధన సహకారాన్ని కొనసాగిస్తోందని, ఇది పూర్తి చట్టబద్ధమైనదని జియాన్ స్పష్టం చేశారు.
రష్యా చమురు దిగుమతిదార్లపై ఏకపక్ష ఆంక్షలను సహించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES