29 మంది మృతి
సాంకేతిక లోపమే కారణమని అనుమానం
విచారణను కొనసాగిస్తున్న రష్యా దర్యాప్తు కమిటీ
మాస్కో: రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం క్రిమియాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున సంభవించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంపై ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా అక్రమంగా ఆక్రమించిన ఈ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో విమానం మిలిటరీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం విమానం కూలినట్టు అధికారులు నిర్థారించారు.
దాడిచేసిన ఆనవాళ్లు లేవు
రష్యా ప్రధాన దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే ప్రధాన కారణం అయ్యుండవచ్చని భావిస్తున్నారు. అయితే విమానంలో ఎలాంటి అంతరాయం కలిగించే విషయాలు లేదా దాడి జరిగినట్టుఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి ముందు విమానం ఒక కొండ అంచును ఢకొీట్టి కూలిపోయినట్టు తెలుస్తోంది. రక్షణ బృందాలు, అత్యవసర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు కమిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. విమాన ప్రయాణ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
ఏఎన్-26 విమానం విశేషాలు
ఏఎన్-26 ఒక సోవియట్ రూపొందించిన సైనిక రవాణా టర్బోప్రాప్ విమానం. దీనిని ప్రధానంగా సరకు రవాణా, పారాట్రూపర్ల తరలింపు, వైద్య సహాయానికి ఉపయోగిస్తారు. 1960 నుంచి ఈ విమానాలు సేవలందిస్తుండగా క్రిమియాలో జరిగిన ఈ ఘటన రష్యాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.
గతంలోనూ అనేక ప్రమాదాలు
ఈ ఏఎన్-26 విమానాలు గత దశాబ్ద కాలంలో అనేక ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2022లో ఉక్రెయిన్‌లోని జపోరిజ్రియాలో ఏఎన్-26 విమానం కూలిపోయింది. ఓ వ్యక్తి మృతి చెందాడు. 2020లో ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోనూ మరో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 27 మందిలో ఒకరు మినహా, మిగిలిన వారందరూ మరణించారు. 2020లో దక్షిణ సూడాన్‌లో ఒక ఏఎన్-26 విమానం కూలినప్పుడు, ఐదుగురు రష్యన్లతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. 2017లో పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌లో ఒక ఏఎన్-26 విమానం ల్యాండింగ్ అవుతుండగా కూలిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో నలుగురు మరణించారు.



