– కేసీఆర్ ఎవరికి జాతిపిత..? ఎలా జాతిపిత.?
– కడుపులో విషం పెట్టుకొని నల్లగొండకు నిర్లక్ష్యం
– బీఆర్‌ఎస్, బీజేపీకి డిపాజిట్లు దక్కవ్ : మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలర్పించడంతో చలించిపోయి సోనియా గాంధీ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యారు? ఎవరికి జాతిపిత?.. పెళ్లాం మొగుడు జోలి విన్న సన్యాసి జాతిపితనా?.. బీఆర్‌ఎస్ పాలనలో కడుపులో విషం పెట్టుకొని నల్లగొండ జిల్లాకు అన్యాయం చేశారు.. వరి వేస్తే ఉరే అన్నారు.. కాంగ్రెస్ పాలనలో మద్దతు ధరతోపాటు బోనస్ ఇస్తున్నాం.. మున్సిపల్ ఎన్నికల అవ్వగానే రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేస్తాం.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే బీఆర్‌ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో బుధవారం 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రజాపాలన ప్రజావిజయోత్సవ సభ, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.
భార్యాభర్తలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ శాఖల మధ్య జరిగే సంభాషణనలను వినేందుకు ఫోన్ ట్యాపింగ్ వంటి సిగ్గుమాలిన పనులు చేసి ప్రభుత్వానికి అడ్డంగా దొరికిన కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యావు? అని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ శాఖ నోటీసులు ఇస్తే తెలంగాణ జాతికి నోటీసు ఇచ్చినట్టు అవుతుందా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మొఖాలకు పోలీసులు ముసుగు తొడిగి విచారణకు తీసుకొచ్చేది ఉండే.. అని అన్నారు. కేసీఆర్ జాతిపిత అయితే.. ఆయన అక్రమంగా సంపాదించిన ఎర్రబెల్లి ఫామ్‌హౌస్ తెలంగాణ జాతికి అంకితం చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావులా ఫామ్‌హౌస్‌లోకి తెలంగాణ ప్రజలను రానిస్తారా అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అవుతారు.. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అవుతుంది అని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మొదటి ప్రచార సభ మిర్యాలగూడలో ఏర్పాటు చేశామని అన్నారు. 26 నెలలుగా తాము చేసిన అభివృద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు. పేదలు, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పదేండ్లు నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఆనాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారు. నేడు ప్రజా ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తోంది’ అని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తే.. కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఒక్కరికీ ఇంటి నిర్మాణం చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసినప్పటికీ ఇంకా అదనంగా కావాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ వస్తోందన్నారు. వచ్చే బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. బీఆర్‌ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.. మొదటి సమరం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైందని సీఎం చెప్పారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలను చూస్తుంటే మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో ఎదురు లేదన్న విశ్వాసం కనిపిస్తోందన్నారు. మిర్యాలగూడ రైస్ బోల్ ఆఫ్ తెలంగాణగా మారిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మరోసారి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని ప్రకటించారు.
నక్కజిత్తులకు బుద్ధి చెప్పాలి..
”జానారెడ్డి వెంట తిరిగి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి భాస్కరరావు.. ఎన్నికల్లో నామినేషన్ వేస్తే కాంగ్రెస్ నేతలను బెదిరిస్తావా?.. ఇలాంటి నక్కచిత్తుల వారు చాలా మంది వస్తారు. పేద ప్రజలకు అండగా ఉన్నాం.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు” అని సీఎం అన్నారు. భాస్కర్‌రావు వస్తే తగిన బుద్ధి చెప్పండని సూచించారు. మహిళలకు రూ.27 వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ అభ్యర్థులు గెలవాలని, కోదాడలో 3 వార్డులు ఏకగ్రీవం అవ్వడం శుభపరిణామం అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోండని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు.
మిర్యాలగూడ 48 వార్డులను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. రానున్న 8 ఏండ్లు మనమే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ సభతో అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నమ్మకం వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బి. లక్ష్మరెడ్డి ,బాలు నాయక్, వేముల వీరేశం, పద్మావతి రెడ్డి, వంశీకృష్ణ, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేల్, పర్యాటకశాఖ చైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.



