Sunday, March 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేడు రైతుభరోసా నిధులు విడుదల

నేడు రైతుభరోసా నిధులు విడుదల

- Advertisement -

రూ.3600 కోట్లను రిలీజ్‌ చేయనున్న ముఖ్యమంత్రి
నర్మెట్టలో 32 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ
ప్రారంభించినున్న సీఎం రేవంత్‌రెడ్డి
నేటి నుంచి అందుబాటులోకి
‘ఎల్లంపల్లి’ని నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గుజరాత్‌లో పాలకు కురియన్‌లా.. ఇక్కడ ఆయిల్‌పామ్‌కు తుమ్మల : మంత్రి పొన్నం ప్రభాకర్‌

నవతెలంగాణ-నంగునూరు
నేడు (ఆదివారం) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రైతులకు రూ.3600 కోట్ల్ల రైతుభరోసా నిధులు విడుదల కానున్నాయని మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసమే చేశానని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలో ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే ముఖ్యమైందని అన్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లను ఈ ఫ్యాక్టరీకి ఖర్చు చేసినట్టు చెప్పారు. అతి తక్కువ సమయంలో 16 నెలల్లోనే పూర్తి చేసిన దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ ఇది అని అన్నారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ ఆయిల్‌పామ్‌ సాగు చేసినా అశ్వారావుపేటకి తీసుకెళ్లాల్సి వచ్చేదని తెలిపారు.

అందుకే సిద్దిపేట జిల్లాలో తక్కువ సమయంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామన్నారు. మల్లన్నసాగర్‌ రాకముందే ఇక్కడ మొక్కలు నాటినట్టు తెలిపారు. కాళేశ్వరానికి జీవనాడి ఎల్లంపల్లి అని.. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తరలించాలన్నా ఇదే కీలకమని చెప్పారు. అలాంటి ఎల్లంపల్లిని నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. ఎల్లంపల్లి నుంచి మంచి నీళ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తే.. స్విచ్‌ను వేరే ప్రభుత్వం వాళ్లు నొక్కారన్నారు. కేంద్రం రాష్ట్రాలకు వాటాగా, హక్కుగా రావాల్సిందే ఇస్తోందని, అందులో వారు అదనంగా ఇచ్చేది ఏముంటుందని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఆయిల్‌పామ్‌ సాగును తాను ప్రమోట్‌ చేశానని చెప్పారు.

గత ప్రభుత్వంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాలుగు టర్మ్‌లలో డబ్బులు వేయడం వల్ల రైతుపై రుణభారం పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామన్నారు. పార్లమెంట్‌, ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే.. రెండేండ్లలో రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పడానికి నిదర్శనమని అన్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన రూ.8.50 లక్షల కోట్ల అప్పుకు రూ.7 వేల కోట్లు వడ్డీనే కట్టాల్సి వస్తోందన్నారు. గత ప్రభుతంలో ఎన్నో హామీలు విస్మరించారని, దళితులకు మూడెకరాలు, దళితబంధు ఇవ్వలేదని అన్నారు.

కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే మహాలక్ష్మీ ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందన్నారు. రైతాంగ మహోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు జరిగే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డి, సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అన్వేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు తూంకుంట ఆంక్షారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గం ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ ఆయిల్‌పామ్‌కి తుమ్మల బ్రాండ్‌ అంబాసిడర్‌ : మంత్రి పొన్నం
తెలంగాణలో ఆయిల్‌పామ్‌ అభివృద్ధికి తాను స్వయంగా ఓ రైతుగా పూర్తి కార్యదీక్షత చేపట్టానని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇందుకోసం అనేక సార్లు ఫ్యాక్టరీని పరిశీలించానని చెప్పారు. గుజరాత్‌లో పాలకు కురియన్‌ మాదిరిగా.. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కి తుమ్మల నాగేశ్వరరావు అని అన్నారు. ఉత్తర తెలంగాణలో ఈ ఫ్యాక్టరీ.. ఆయిల్‌పామ్‌ సాగు చేసిన వారికి ప్రధాన కేంద్రంగా ఉండబోతుందని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభించడంతోపాటు రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారన్నారు. ఆయిల్‌పామ్‌కి తుమ్మల నాగేశ్వరరావు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -