రైతు ఉత్సవాలకు సీఎం,డిప్యూటీ సీఎంను ఆహ్వానించాం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 22న రైతు భరోసా నిధులను విడుదల చేస్తామనీ, ఆ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో రైతులకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చేపడుతున్న ”ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను గురువారం హైదరాబాద్‌లో కలిసి ఆయన ఆహ్వానించారు. 19 నుంచి 22 వరకు నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ రైతు ఉత్సవాలు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని తుమ్మల పేర్కొన్నారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, పంటల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం ద్వారా వ్యవసాయ పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. నాలుగు రోజులు పాటు ప్రతి జిల్లాలో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, శిక్షణా శిబిరాలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శనలు, విజయవంతమైన రైతుల అనుభవాలు పంచుకునే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆధునిక వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, పంటల వైవిధ్యీకరణ, మార్కెట్ అవకాశాలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతుల ఆదాయం పెంపు, సాగు వ్యయాల తగ్గింపు, పంటలకు గిట్టుబాటు ధర కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుందని వివరించారు.



