Friday, July 4, 2025
E-PAPER
Homeఆటలుసాహో శుభ్‌మన్‌

సాహో శుభ్‌మన్‌

- Advertisement -

– ద్వి శతకంతో చెలరేగిన గిల్‌
– రాణించిన జడేజా, సుందర్‌
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 587/10

శుభ్‌మన్‌ గిల్‌ (269) ద్వి శతకంతో చెలరేగాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) తోడుగా శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌కు భారీ అందించాడు!. ఇంగ్లాండ్‌ బౌలర్లను అలవోకగా ఆడుకున్న శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ అత్యధిక స్కోరుతో పాటు ఇంగ్లాండ్‌ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా రెండో టెస్టులోనే ద్వి శతకం బాదిన గిల్‌.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు భారీ స్కోరు అందించాడు.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్‌
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్‌ ఇండియా పైచేయి కొనసాగుతుంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (269, 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) ద్వి శతకంతో చెలరేగాడు. తొలి రోజు సెంచరీతో మెరిసిన శుభ్‌మన్‌.. రెండో రోజు టెస్టుల్లో తొలిసారి డబుల్‌ శతకం సాధించాడు. రవీంద్ర జడేజా (89, 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (42, 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు విలువైన ఇన్నింగ్స్‌లతో రాణించారు. రవీంద్ర జడేజాతో 203 పరుగులు, వాషింగ్టన్‌ సుందర్‌తో 144 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించిన శుభ్‌మన్‌ గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ స్కోరు అందించాడు.


ద్వి శతక సేనాని
ఓవర్‌నైట్‌ స్కోరు 114తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. దూకుడుగా, వేగంగా పరుగులు రాబట్టిన గిల్‌ మరో 155 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో గిల్‌ పలు మైలురాళ్లు దాటేశాడు. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరుతో పాటు ఇంగ్లాండ్‌ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డులు తిరగరాశాడు. 17 ఫోర్లతో 263 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ చేరుకున్న గిల్‌.. 21 ఫోర్లు, రెండు సిక్సర్లతో 311 బంతుల్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. 29 ఫోర్లు, మూడు సిక్సర్లతో 348 బంతుల్లో 250 పరుగుల మార్క్‌ చేరుకుని ఔరా అనిపించాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై చెత్త గణాంకాలతో సిరీస్‌ను మొదలెట్టిన గిల్‌.. వరుస టెస్టుల్లో శతక మోగించాడు. భారత్‌ స్కోరు 95/2తో 23.3 ఓవర్లో క్రీజులోకి వచ్చిన గిల్‌ ..143.3 ఓవర్లో నిష్క్రమించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 574 పరుగులు.


మెరిసిన జడేజా, సుందర్‌
శుభ్‌మన్‌ గిల్‌కు స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ చక్కగా సహకరించారు. ఈ ఇద్దరితో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన గిల్‌.. భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ రవీంద్ర జడేజా (89) ఆరు ఫోర్లతో 80 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. శతకం వైపు సాగుతున్న జడేజా వికెట్‌ కోల్పోయినా.. భారత్‌ దూకుడు తగ్గించలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ (42) క్రీజులో కుదురుకున్నాడు. చక్కగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేయటంతో పాటు ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. జో రూట్‌ మాయకు సుందర్‌ అర్థ సెంచరీ ముంగిట వికెట్‌ కోల్పోయాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆకాశ్‌ దీప్‌ (6), మహ్మద్‌ సిరాజ్‌ (8) తేలిపోగా.. ప్రసిద్‌ కృష్ణ (5 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో భారత్‌ 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ (3/167), క్రిస్‌ వోక్స్‌ (2/81), బ్రైడన్‌ కార్స్‌ (2/83) రాణించారు.


ఈసారి అదుర్స్‌
తొలి టెస్టులో భారీ స్కోరు అవకాశాలను చేజార్చుకున్న భారత్‌.. బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టింది. లీడ్స్‌లో వరుసగా 41 పరుగులకే ఏడు వికెట్లు, 31 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన గిల్‌ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో పొరపాటును దిద్దుకుంది. 211/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న టీమ్‌ ఇండియా.. చివరి ఐదు వికెట్లకు ఏకంగా 371 పరుగులు జోడించింది. ఆఖరు ఐదు వికెట్లకు భారత్‌ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావటం గమనార్హం. 2013 కోల్‌కత టెస్టులో వెస్టిండీస్‌పై చేసిన 370 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. రెండో టెస్టులో గిల్‌సేన ఈ రికార్డును బద్దలుకొట్టింది. భారత ఇన్నింగ్స్‌లో నమోదైన భారీ భాగస్వామ్యాలు (ఆరో వికెట్‌కు 203, ఏడో వికెట్‌కు 144) సైతం ఆఖరు వికెట్లలోనే రావటం విశేషం.


స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 87, కెఎల్‌ రాహుల్‌ (బి) వోక్స్‌ 2, కరుణ్‌ నాయర్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 31, శుభ్‌మన్‌ గిల్‌ (సి) పోప్‌ (బి) టంగ్‌ 269, రిషబ్‌ పంత్‌ (సి) క్రాలీ (బి) బషీర్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (బి) వోక్‌నస 1, రవీంద్ర జడేజా (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 89, వాషింగ్టన్‌ సుందర్‌ (బి) రూట్‌ 42, ఆకాశ్‌ దీప్‌ (సి) డకెట్‌ (బి) బషీర్‌ 6, మహ్మద్‌ సిరాజ్‌ (స్టంప్డ్‌) స్మిత్‌ (బి) బషీర్‌ 8, ప్రసిద్‌ కృష్ణ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు : 22, మొత్తం : (151 ఓవర్లలో ఆలౌట్‌) 587.
వికెట్ల పతనం : 1-15, 2-95, 3-161, 4-208, 5-211, 6-414, 7-558, 8-574, 9-574, 10-587.
బౌలింగ్‌ : క్రిస్‌ వోక్స్‌ 25-6-81-2, డ్రైడన్‌ కార్స్‌ 24-3-83-1, జోశ్‌ టంగ్‌ 28-2-119-2, బెన్‌ స్టోక్స్‌ 19-0-74-1, షోయబ్‌ బషీర్‌ 45-2-167-3, జో రూట్‌ 5-0-20-1, హ్యారీ బ్రూక్‌ 5-0-31-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -