సెమీస్‌లో స్విటోలినా, పెగులా ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ప్రపంచ నం.1, బెలారస్ భామ అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాల్గో ఏడాది టైటిల్ పోరుకు సిద్ధమైంది. రాజకీయ కారణాలతో ఉత్కంఠ రేగిన సెమీఫైనల్లో ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)పై సబలెంక సూపర్ విక్టరీ సాధించింది. కజకిస్తాన్ అమ్మాయి ఎలెనా రిబకినా సెమీస్‌లో అమ్మాయి స్టార్ జెస్సికా పెగులాపై విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక, రిబకినాలు ‘2023’ టైటిల్ పోరు రీ మ్యాచ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు.
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. హార్డ్ హిట్టర్ అరినా సబలెంకతో ఐదో సీడ్ ఎలెనా రిబకినా అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. బెలారస్ స్టార్ అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా నాల్గోసారి ఫైనల్లోకి ప్రవేశించగా… వరల్డ్ నం.1తో 2023 తర్వాత మరోసారి మెల్‌బోర్న్‌లో టైటిల్ ఫైట్‌కు రిబకినా సై అంటోంది. గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అరినా సబలెంక, ఎలినా రిబకినా వరుస సెట్లలో విజయాలు సాధించారు. 6-2, 6-3తో ఎలెనా స్విటోలినాపై సబలెంక సూపర్ విజయం సాధించింది. ఆరో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై 6-3, 7-6(9-7)పై ఎలినా రిబకినా మెరుపు విజయం నమోదు చేసింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో అరినా సబలెంక, ఎలినా రిబకినా తలపడతారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండు సార్లు టైటిల్ సాధించిన అరినా సబలెంక.. ముచ్చటగా మూడో టైటిల్‌పై కన్నేసి శనివారం ఫైనల్లోకి బరిలోకి దిగనుంది.
సబలెంక సూపర్
అరినా సబలెంక సూపర్ ఫామ్ కొనసాగించింది. టోర్నమెంట్‌లో తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన సబలెంక.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇప్పటివరకు అత్యధిక విన్నర్లు (172) కొట్టిన క్రీడాకారిణిగా కొనసాగుతుంది. 12వ సీడ్ ఉక్రెయిన్ అమ్మాయి ఎలెనా స్విటోలినాతో సెమీఫైనల్ పోరు కావటంతో రాజకీయంగా కాస్త ఉత్కంఠ కనిపించింది. సెమీఫైనల్లో అటు స్విటోలినాపై, అటు సబలెంకపై అదనపు ఒత్తిడి పడింది. ఇక్కడే వరల్డ్ నం.1 సబలెంక అనుభవంతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచిన సబలెంక కోర్టులో ఎంతో కూల్‌గా కనిపించింది. 29 విన్నర్లు, 15 అనవసర తప్పిదాలతో మెప్పించింది. స్వీయ సర్వ్‌లో సబలెంక కేవలం 11 పాయింట్లు మాత్రమే కోల్పోయింది. సెమీఫైనల్లో సబలెంక ఆధిపత్యం వర్ణించేందుకు ఈ గణాంకాలు నిదర్శనం. తొలి గేమ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం సబలెంకలో మరింత దూకుడుకు దోహదం చేసింది.
తొలి సెట్ మూడో గేమ్‌లో 1-2 వెనుకంజతో స్విటోలినా సర్వ్ చేస్తుండగా.. అరుపులతో ప్రత్యర్థిని తికమక పెట్టే ప్రయత్నం చేస్తుందనే కారణంతో అంపైర్ పాయింట్‌ను స్విటోలినాకు ఇచ్చారు. సబలెంక వీడియో రివ్యూతో సవాల్ చేసినా, ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. రెట్టించిన ఉత్సాహం, ఏకాగ్రతతో ఆడిన సబలెంక ఆ గేమ్‌ను గెల్చుకోవటంతో పాటు వరుసగా నాలుగు గేమ్‌లు ఖాతాలో వేసుకుంది. 6-2తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుని 1-0 ముందంజ వేసింది. రెండో సెట్‌లోనూ సబలెంక జోరు తగ్గలేదు. స్విటోలినా మూడు గేమ్‌లు నెగ్గినా.. విలువైన బ్రేక్ పాయింట్లతో సబలెంక సూపర్ షో చేసింది. 6-2, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించింది. 76 నిమిషాల్లోనే స్విటోలినాకు చెక్ పెట్టిన సబలెంక.. వరుసగా నాల్గో సారి టైటిల్ పోరుకు చేరుకుంది. సబలెంక ఒక్క ఏస్ కొట్టకపోయినా.. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. స్విటోలినా 2 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ సహా ఓ బ్రేక్ పాయింట్ సాధించింది. పాయింట్ల పరంగా 65-46తో సబలెంక పైచేయి సాధించింది. సెమీఫైనల్‌కు ముందు ఇద్దరు టాప్-10 క్రీడాకారిణీలపై గెలుపొందిన స్విటోలినా.. సెమీస్‌లో నిరాశపరిచింది.
ఔరా.. రిబకినా
కజకిస్తాన్ అమ్మాయి ఎలినా రిబకినా సైతం సూపర్ ఫామ్‌లో ఉంది. గత 20 మ్యాచ్‌ల్లో రిబకినా కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఎదురులేని విజయాలు నమోదు చేసింది. ఒక్క సెట్ కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకుంది. బలమైన సర్వ్‌తో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే రిబకినా.. సెమీఫైనల్లోనూ అదే పని చేసింది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మూడు సెట్ల పోరులో తడబాటుకు గురైన ఎలినా రిబకినా.. మూడేండ్ల తర్వాత తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ ఏడాది సైతం మళ్లీ సబలెంకాతోనే టైటిల్ ఫైట్ చేయనుంది. 100 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా పెగులాపై 6-3, 7-6 (9-7)తో రిబకినా గెలుపొందింది. 2 ఏస్‌లు, 14 విన్నర్లతో పెగులా మెరువగా… 6 ఏస్‌లు, 31 విన్నర్లతో రిబకినా సత్తా చాటింది. పాయింట్ల పరంగా 81-68తో రిబకినా పైచేయి సాధించింది. రెండు సెట్లలో కలిపి పెగులా 3 బ్రేక్ పాయింట్లు సాధించింది. నాలుగు బ్రేక్ పాయింట్లతో రాణించిన రిబకినా.. కీలక రెండో సెట్లో టైబ్రేకర్‌లో 9-7తో పైచేయి సాధించింది. మూడో సెట్‌కు వెళ్లకుండానే ఫైనల్లో చోటు దక్కించుకుంది.



