Sunday, February 22, 2026
E-PAPER
Homeకవితదు:ఖపూరిత కవిత్వశకలం

దు:ఖపూరిత కవిత్వశకలం

- Advertisement -

కథకుడిగా తెలిసిన వజ్జీరు ప్రదీప్‌ ‘చుక్కల పందిరి’ కవిత్వ సంపుటితో కవిగా తానేమిటో నిరూపించుకున్నడు. సాధారణంగా తన కవిత్వ వస్తువులు ‘నాస్టాల్జియా’ చుట్టూ అల్లుకున్నవే. వాటితో పాటు రైతులు, ఆదివాసీలు, దివ్యాంగులు, స్త్రీలు తరచూ పలకరిస్తరు. రాజకీయాలు, సంస్కతి కేంద్రంగా మాట్లాడుతడు. ‘చుక్కల పందిరి’ కవిత్వం తర్వాత అబ్‌ స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ లాంటి రకరకాల ఇమేజెస్‌ తాను ఎంచుకునే వస్తువుల్లో కనిపిస్తూ వుంది. తానెప్పుడూ ‘వస్తువు’ ను దాటి మాట్లాడలేదు. ప్రకతిని విడిచి పయనించలేదు. ప్రస్తుతం తాను రాస్తున్న కవిత్వంలో ఒంటరితనం, భయం, మానసిక ఆందోళన, అంతరంగ ఆవిష్కరణ మొదలైన వస్త్వాంశాలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుండటం గమనించవచ్చు.

సామాజికత మెండుగా, నిండుగా కనిపించే తన కవిత్వంలో అంతర్గత మానసికత పెద్ద పీట వేయడం కనిపిస్తది. ‘మనస్సు’ కేంద్రంగా ‘వస్తువు’ను విస్తరించడం, లోలోతుల్లోకి వెళ్లి పరిశీలించడం, రహస్య సంభాషణలు, వ్యక్తీకరణలతో అబ్బుర పరుస్తడు. ‘గుట్టకో గుడికడదాం’ అన్నపుడు ఆధ్యాత్మిక కోణంతో పాటు పర్యావరణ స్పహ కల్గించిన కవి, చాలా ముందు చూపున్న వ్యక్తిగా తారసపడుతడు. గుడులున్న గుట్టలు, కొండలు మినహా అన్నీ ఆంబుక్క పెట్టిన ఆగామి కాలాన్ని సైతం దశ్యమానం చేసిన కవి. తెలంగాణ ఉద్యమాన్ని గురించి రాసినా, ఉద్యమకారుడిగా నినదించినా, సంచార జాతుల జీవనాన్ని చిత్రించినా, బహుజన బతుకుల గురించి తండ్లాడినా తనకు తానే సాటియని మిత్రులందరితో కొనియాడబడిన నిజాయితీకి నిలువెత్తు దర్పణమైన కవి, అతి సాధారణ మానవుడు ప్రదీప్‌. ఇటీవల తాను రాసిన ‘మామిడి పిందెల కల’ అనే కవిత గురించి మాట్లాడుకుందాం.

మామిడి పిందెల కల
నేను అమ్మకు రాసిన ఉత్తరం
ఇంకా అందిందో లేదో
దామెర చెరువు కాడా అలుగు
తెగిపోయిందని రాత్రి కల వచ్చింది

ఆ ఇంట్లో చీకటి ముసుగు దొంగలా
ఎప్పుడూ కాపు కాసే వుందని తానెరగదు కదా
బుజ్జికి తెచ్చిన పట్టీల మామిడి పిందెలు
అక్కడక్క రాలిపోయాయని
ఆ ఆకాశపు చుక్కలల్లో
మూడు కాళ్ళ జీవి వెతుకుతునే వుంది.

నిన్న పడమరకెళ్ళిన పక్షులు
నేడు తూరుపు వాకిట్లోని
వరికంకుల మీద వాలుతాయో లేదో
కవి రాసిన అక్షరాలు పోగేసిన వెన్నెల
ఆ గుడిసె ముందు దీపకాంతి పూలై మెరుస్తున్నాయి
నిన్నటి నిశబ్ధం గడప దాటి
కొత్త వేకువ చిగురిస్తుందన్న ఆశ నిజమో కాదో
వడలిన దేహం వాడిపోయిన చెట్ల కింద
అడవి చిగురించాలని నీళ్ళు పోస్తుందా ప్రాణం
తోకలేని పక్షి మనసు వాకిట్లో వాలి
గుస గుసగా చెవిలో
చెప్పిన ఊసులన్నీ నిజమో అబద్దమో అన్న
మీ మాంసలోనే వుంది
నాన్న పొలం నుండి తెచ్చిన ధాన్యం
నుదుట పూసిన సూర్య బింబంలో చూసుకుంటుంది
కల తీయగా మూలుగుతూ
వాసం మీది కొక్కెం ఎక్కి ముడుచుకుంటుంది

‘మామిడి పిందెల కల’ కవిత ‘నేను’తో మొదలైంది. ‘దామెర చెరువు’ కవి నివసిస్తున్న ‘పరకాల’ పట్టణం లోనిది. ‘రాత్రికల’ మనిషి లోపలి భయాందోళనలు, సకల భావోద్వేగాల్ని విప్పిజెప్పే వాహిక. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ‘ఇంటర్‌ ప్రిటేషన్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’- కలలకు ఆధారమైన మూలాల్ని వెతికిపట్టుకుంటే మరింత స్పష్టంగా, ఖచ్ఛితంగా అర్థం చేసుకోవచ్చని చెబుతది. ‘అలుగు తెగిపోవడం’ అనే భావన ఏదో జరగబోతుందనే సంకేతాన్ని ముందస్తుగా తెలయజేస్తది. అమ్మకు రాసిన ఉత్తరం అందిందో లేదోననే సంఘర్షణ కనిపిస్తది. ‘ఎత్తుగడ’ లోని సంఘర్షణను బలపరిచే విధంగా ‘చీకటి ముసుగు దొంగ’ అనే వ్యక్తీకరణ అనుమానాలకు తావిస్తది. ఎప్పుడూ ఏదో ఒక చెడు జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తది. మనసులోని ‘అశాంతి’ ని బహిర్గతం చేస్తది.

రాలిపోయిన పట్టీల మామిడి పిందెల్ని ఆకాశంలోని చుక్కల్లో వెతకడం అనే వ్యక్తీకరణ ద్వారా ‘దూరమైన వ్యక్తి యొక్క ఆలోచనల్లోంచి తేరుకోలేని మానసికత కల్గిన పాత్రగా ‘మూడుకాళ్ల’ జీవి’ దర్శనమిస్తది. ‘బుజ్జి’ లేకపోవడం, లేనితనం, ఖాళీతనం మరింత క్రుంగదీస్తున్నట్లుగా చూడొచ్చు. తల్లికి బిడ్డ ఆసరాగా వుంటుందన్న నమ్మకం కోల్పోయినతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తది. తల్లీ పిల్లల మధ్య వున్న పేగుబంధాన్ని ఆవిష్కరిస్తది.
వెళ్లిపోయిన వారు తిరిగొస్తారో లేదో తెలియదు. శాశ్వతంగా విడిచివెళ్లినవారు తమ జ్ఞాపకాల్లో పదిలంగా జీవిస్తరు. ‘పడమరకు వెళ్లిన పక్షులు తూర్పు వాకిట్లోని వరికంకుల మీద వాలటం’ అనే ఆశాభావాన్ని, పాజిటివిటీని వ్యక్తపర్చడంలోని తధాత్మ్యతను ప్రకతి నుండి సంగ్రహించడం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. కొంత నిర్దిష్టంగా మాట్లాడదలిస్తే కవి తన వైయక్తిక జీవితంలోని కోల్పోయిన క్షణాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నడు. కవి చెల్లెలు పేరు దీప. తానిప్పుడు మనమధ్య భౌతికంగా లేదు. బహుశా ‘దీప కాంతి’ పూలై మెరుస్తున్నాయనడంలో తను రాసే అక్షరాల్లో తన చెల్లెల్ని చూసుకుంటున్నట్లుగా భావించవచ్చు. ‘వాడిపోయిన చెట్లకింద అడవి చిగురించాలని నీళ్లు పోయటంలో, ‘ ‘వేకువ చిగురించాలని’ చెప్పడంలో తను జీవితాల్లో లేని ‘వెలుతురు’ ను తిరిగి ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పవచ్చు.

తోకలేనిపక్షి – కవి తన తల్లికి రాసిన ఉత్తరం. తల్లిని బ్రతికించుకోవడానికి చెప్పేవన్నీనిజాలు కాకపోవచ్చు. అందుకే ‘మీమాంస’ అయి వుంటుంది. కల తీయగా మూల్గడం, వాసం మీది కొక్కెం ఎక్కి ముడుచుకోవడం వంటి ప్రతీకలు గతకాలాన్ని సూచించే అంశాలు. ఉత్తరం చదివాక మనసు కుదుటపడటం, ఇంట్లో వాసం మీది కొక్కేనికి ఉత్తరాన్ని తగిలించడం అనే భావన దాగి వుంది. ఉత్తరాలు, శుభలేఖలు, రశీదులన్నీ ముందుతరం వారు కొక్కానికే వేళ్లాడదీసేవాళ్లు. ఇక్కడ చెప్పిన ‘నుదుట పూసిన సూర్యబింబం’ జీవితం పట్ల వున్న ఆకాంక్షను, ఆశను ప్రతిబింబింపజేస్తది.
కవిత్వంలో వ్యక్తిగత అంశాల ప్రస్తావన వచ్చినప్పుడు సాధారణం గానే సర్రియలిస్టిక్‌ ధోరణి పొడచూపుతది. మరింత ప్రతీకాత్మకంగా చెప్పడానికి ప్రయత్నిస్తరు. ఎవరికీ తెలియకూడదని జాగ్రత్త పడతరు. మనసులోని బాధను, దుక్కాన్ని అక్షరాల్లోకి వంపడం ద్వారా సాంత్వన పొందే అవకాశం దొరుకుతది. తమ జీవితాల్లోకి వెలుగుల్ని పంచడానికి ఎవరో ఒకరు రాకపోతారా అనే ఎదురుచూపు, ఆశ అక్షరాల వెనుక దాక్కొని వుంది. కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయిన వేదన, చెల్లెలు వుంటే అమ్మను మరింత బాగా చూసుకునేదన్న ఆలోచనల్లోంచి ఉబికి వచ్చిన దుఃఖపూరిత కవిత్వశకలం ఈ ‘మామిడి పిందెలకల’.

బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -