నవతెలంగాణ – కాటారం
గర్భధారణ ప్రారంభం నుంచే పౌష్టికాహారం తీసుకోవడం, వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడడం ఎంతో ముఖ్యమని, గర్భిణులు 12 వారాల్లోపు స్థానిక మహిళా హెల్త్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలని, అలాగే వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక వైద్య అధికారిణి డాక్టర్ మౌనిక అన్నారు. బుధవారం కాటారం మండల కేంద్రం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ‘సేఫ్ మదర్ హుడ్ డే’ (తల్లి ఆరోగ్య సంరక్షణ)ను పురస్కరించుకుని స్థానిక వైద్య అధికారిణి మౌనిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….గర్భధారణ ప్రారంభం నుంచే పౌష్టికాహారం తీసుకోవడం, వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడడం ఎంత ముఖ్యమో వివరించారు. గర్భిణులు 12 వారాల్లోపు స్థానిక మహిళా హెల్త్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
వేసవి కాలంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ నివారణకు తగినంత నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలని చెప్పారు. పిల్లలను చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. ఓఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం అందించే ప్యాకెట్లనే వినియోగించాలని తెలిపారు.
పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని వివరించారు. అలాగే కాన్పుల మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యత్యాసం ఉండాలని, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం అవసరమని చెప్పారు. గర్భనిరోధకాలు, కండోమ్స్, అంతరా ఇంజక్షన్, కాపర్ టీ, ఛాయా మాత్రలు వంటి పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతిరెడ్డి (MLHP), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, మహిళా హెల్త్ సూపర్వైజర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వీణ, పద్మావతి, జిల్లా ఎపిడెమిక్ టీం సభ్యులు కాపర్తి రాజు, హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య, మహిళా హెల్త్ అసిస్టెంట్ జై శ్యామల, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి, పద్మ, సమ్మక్క, లలిత, రుక్సానా, ఇమ్మానియేల్ తదితర వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



