డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ వై.మోహన్ బాబు
సీఈపీ ఆధ్వర్యంలో పరిశ్రమల ఉద్యోగులకు ఒక్కరోజు శిక్షణ
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
రసాయన ఔషధ పరిశ్రమలు, కర్మాగారాలలో పకడ్బందీగా భద్రత ప్రమాణాలు పాటించాలని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ వై.మోహన్‌బాబు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల ఇండిస్టియల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్‌ఎస్ ప్రొఫెషనల్స్ (సీఈపీ) ఆధ్వర్యంలో పలు పరిశ్రమల ఉద్యోగులకు శనివారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడారు. రసాయన ఔషధ పరిశ్రమలలో ఇటీవల తరచూ ప్రమాదాలు సంభవిస్తుండటంతో ప్రాణ నష్టం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్మికులకు నిరంతరం భద్రతపరమైన అంశాలపై శిక్షణ కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు.
కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ప్రతి పరిశ్రమలో భద్రత పట్ల యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించాలని, దాంతో చాలా వరకు ప్రమాదాలను నివారించొచ్చని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే నివేదికలు ముఖ్యం కాదని, జీరో ప్రమాదాల స్థాయికి చేరినప్పుడే పరిశ్రమ 100 శాతం అభివృద్ధి సాధించినట్టని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన, భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల శిక్షణకు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంటర్నెట్‌లో భద్రత ప్రమాణాలపై విషయాలు తెలుసుకొని సైతం కింది స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వొచ్చని చెప్పారు. ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులను అభినందించారు.
కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్‌ఎస్ ప్రొఫెషనల్స్ (సీఈపీ) వ్యవస్థాపకులు, అధ్యక్షులు తపస్ సాహ మాట్లాడుతూ.. నాడు చిన్న వాట్సప్ గ్రూప్‌గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు వేల మందితో నడుస్తున్నదని, నిత్యం పరిశ్రమలలో ఎదుర్కొనే సమస్యల పట్ల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాజమాన్యాలు భద్రత ప్రమాణాల విషయాలలో సహకరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అరబిందో అండ్ ఆపిటోరియా ఫార్మా ఈహెచ్‌ఎస్ జనరల్ మేనేజర్ అమర్ కూడాలే, బిఎస్ అండ్ బి సేఫ్టీ సిస్టమ్స్ చెన్నరు రాష్ట్ర అధ్యక్షులు బి.జయ శంకర్, గ్రాన్యూవల్స్ ఇండియా లిమిటెడ్ ఈహెచ్‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ మెట్లపల్లి శ్రీనివాస్, 3ఎం జీఎం ఏ సందీప్ కుమార్, వియాష్ లైఫ్ సెన్స్ ఈహెచ్‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాంసన్, కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్‌ఎస్ ప్రొఫెషనల్స్ (సీఈపీ) సభ్యులు ఏ.సూర్య ప్రకాష్, ఈ.తిరుపతి, పి.రామకృష్ణ, చంద్రకాంత్, జి.జగదీష్, ఏ.మురళీకృష్ణ, హరిబుకీయ, సుమారు 72 పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.