Monday, December 22, 2025
E-PAPER
Homeదర్వాజసాహిల్‌ రావాలి.. మరి మార్పు?!

సాహిల్‌ రావాలి.. మరి మార్పు?!

- Advertisement -

అఫ్సర్‌ సర్‌ ప్రతీ వాక్యం నిటారుగా నిలబడ్డ స్ట్రాంగ్‌ గోడలా ఉంటుంది. అది కవిత్వంలో అయినా కథలో అయినా – అఫ్సర్‌ కథల సంపుటి ”సాహిల్‌ వస్తాడు” లో 11 కథలు ఉన్నాయి. అన్నీ కథలు ప్రత్యేకమైనవి. ముస్లిం జీవితాలను, ఆ జీవితాల్లోని వెలితిని, ఆ జీవితాలను శాసిస్తూ పీడిస్తున్న అధికార యంత్రాంగాలను ఎండగట్టే కథలు ఇవి. ‘గోరీమా’ కథ చదివి మనసు ద్రవించుకుపోయింది. విగ్రహం ముందు మనిషి ఎంతటివాడు? అతని ఎమోషన్‌ ఏ పాటిది? భక్తి, విగ్రహ రాజకీయాల్లో గోరీమా లాంటి వాళ్ళెందరో తమ నేల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళే. తుర్క తుత్తురు బండకు నెత్తురు, ఏంరా వారీ ఇయ్యాల్ల బండ మీద కూరనా? వాళ్ళు పెద్దకూర తింటరు మనం వాళ్ళతోని తినొద్దు, తుర్కిండ్లా? తురకోనికి … కోశి పెట్టినా సుట్టంగాడు …, ఇట్లా ఎన్నో సూటిపోటి మాటలు వింటున్నవే. భావితరాలు వినాల్సిందే? మార్పు ఊహించలేనంత దూరంలో ఉంది?

మొన్నటికి మొన్న బీహార్లో ఓ యువతి ఒంటి మీదకు పార్వతీ దేవీ వచ్చి సాయెబుల పొలం బురదలో దోగాడింది. అక్కడ తవ్వి తీస్తే శివ లింగం. సాక్షాత్తూ శివుడే వెలిశాడని, ఇక్కడ గుడి కట్టాల్సిందేనని ఊరంతా ముక్త కంఠంతో అన్నారు. ఇంకే ముస్లింల పొలం గుడి కోసం ధారాధత్తం చేసెయ్యాలి అన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు పకడ్బంధీగా పనిచెయ్యదంటే.. పాలకులు కూడా ముస్లిం ద్వేషపరులు అయినప్పుడు చట్టం, న్యాయం ఏం పనిచేస్తాయి? చివరికి ఈ విగ్రహ డ్రామాలు ఎక్కడికి వెళ్లాయంటే.. సుప్రీంకోర్టును కూడా తవ్వితే శివుడు ప్రత్యక్షమవుతాడని మాట్లాడుతున్నారు అంధభక్తులు. సుప్రీం కోర్టును తవ్వి గుడి కట్టాలనే మాటలు యథేచ్చగా మాట్లాడేస్తున్నారు.

ఇలాంటివి ఆర్గనైజ్డ్‌గా తరచూ జరుగుతుంటాయి. వాటిని నమ్ముతుండాలి. ముస్లింల ఇళ్లను, పొలాలను, ఆస్తులను ఇలా స్వాధీనపరుచుకునే కుట్ర అని ఎవరు ఎప్పటికి తెలుసుకుంటారు అన్నది థౌజెండ్‌ డాలర్ల ప్రశ్న? స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల రక్తం కూడా చిమ్మింది, వాళ్ళు ఈ దేశ మూలవాసులే అన్న నిజాన్ని మరుగునపడేస్తూ లేనిపోని విష ప్రచారాలు చేస్తూ స్వదేశంలోనే విదేశీయుణ్ణి చేస్తున్న కుట్ర జరుగుతున్న సంగతి తేటతెల్లం. ఎక్కడ చీమ చూర్‌ మన్నా అది వార్తగా మారడానికి నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటోంది. అంతగా వార్తా వాహిని స్పీడప్‌ అయింది. అలాగే ఎక్కడో ఏదో బాంబ్‌ బ్లాస్ట్‌ అయినా ఇక్కడున్న ముల్లాలు ముడుచుకుపోవాల్సిన పరిస్థితి దాపురించింది? గెడ్డం ఉన్న వ్యక్తిని తీవ్రవాదిగా చిత్రించిన సామ్రాజ్యవాద దుష్కియ. ముస్లింలు మాత్రమే బాంబులు పేల్చుతారు, క్రూరంగా వ్యవహరిస్తారనే ఒక విషాన్ని ఈ ప్రపంచానికి ఎక్కించిన దుర్ణీతి రాజకీయం.

ముస్లింలలో మంచివాళ్లున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధులు ఉన్నారు. కానీ వాళ్లను తలుచుకుని ఇప్పటి ముస్లింల మీద ప్రేమను ప్రదర్శించేవాళ్లు ఎంతమంది? ఒక్క మెతుకు పట్టుకుని అన్నం ఉడికిందా లేదా అని చూస్తే తెలిసిపోంతుంది అంటారు. కానీ ముస్లింల విషయంలో అది ముమ్మాటికి తప్పులానే ఉంది. ఎక్కడో ఎవడో తప్పు చేస్తే ఆ తప్పును అందరు ముస్లింల మీద ఎగదోపి రాక్షసానందం పొందుతుంటారు. ముస్లిం సమాజాన్ని ఆడిపోసుకోవడం కొందరికి రాక్షసానందాన్నిస్తుంది. ఈ కోణంలో ఆలోచనాత్మక కథ ‘సాహిల్‌ వస్తాడు’. దిల్సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కనిపించకుండా పోయిన సాహిల్‌ నేపథ్యంలో ఫ్రెండ్స్‌ అన్వేషించే కథ. కరోనా ముస్లింలతోనే ఈ దేశంలోకి వచ్చిందనే అబద్ధాన్ని ఎంతగా ప్రచారం చేసిందో ఈ ప్రభుత్వం. ‘అటు దూరం జరుగమ్మా.. మీ తుర్కోళ్లతోనే కరోనా అచ్చిందంట’ అని ఊళ్లల్లో జనాలు తోటి ముస్లింలను ఈసడించుకునేదాకా విపరీత ప్రచారం చేశారు. కానీ అబద్ధం అని తేల్చిన కోర్టు తీర్పును ఈ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ఎంత కంటకింపో అర్థం అవుతోంది.

రీసెంట్గా యూపీలోని ఫతేపూర్‌ మఖ్బరాపై హిందూత్వ సంఘాల దాడులను పోలీసులు దగ్గరుండి మరీ చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ఘటనలో నిందుతుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో చదువుతుంటే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. క్రితంసారి సంభల్‌ ఘటనలో ముస్లింల పేర్లను ఘంటా మోగించినట్టు చదివి వినించారు యోగీ. స్పష్టంగా వారికి ముస్లింల మీద ఎంతటి విషం ఉందో తెలుస్తోంది. సంభల్లో న్యాయం కోసం నిరసన చేస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను పోలీసులు కాల్చి చంపారు. గతంలోని ఊళ్లు, ప్రస్తుత ఊళ్లు, గతపు పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు అని బేరీజు వేసుకుని గతకాలపు పచ్చని స్నేహాలను వల్లి వేసుకుని కుమిలిపోవాల్సిన రోజులు దాపురించాయి. ఈ దేశపు పునాధి అయిన లౌకికత్వాన్ని ప్రభుత్వమే ఎలా పెకిలించిందో మనం చూస్తున్నాం.

అన్వర్‌, ఫైజ్ల కథ ‘ఒక తలుపు వెనక’. ఊళ్లల్లోకి ప్రవేశించిన మతోన్మాదం ఎలాంటి వైపరీత్యాలకు దారితీస్తుందో తెలిపే కథ. ముసల్మానులకు పాకిస్తాన్‌ లేదా కబ్రస్తాన్‌ అని అంటున్న తీరును చూస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజ్యాంగాన్ని మార్చుదాం అనుకుంటున్న వాళ్లు చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ బహుజనుల్లో, మైనార్టీల్లో ఆ స్పష్టత కరువైంది. కారణం భయం కావొచ్చు. ముసల్మాన్ల మీద ఎంతటి విషం ఉందో ఆ విషానికి అంతం ఉందో లేదో చెప్పడం సాధ్యం కాదు. అంతగా విషం నింపుకుని విద్వేషం చిమ్ముతున్న నేతలు ఏలుతున్న రాజ్యంలో సాయెబు ఒంటరివాడయ్యాడు. తన హక్కుల్ని కాలరాసేందుకు ఓటు హక్కును తొలగించే ప్రయత్నం దొడ్డి దారిన సాగుతోంది. అదేంటని ప్రశ్నిస్తే అక్రమంగా జైళ్ల పాలు చేస్తున్నారు. బెయిళ్లు లేకుండా చేస్తున్నారు. చంపుతున్నారు, హింసిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అయినా వారికి దాహం తీరట్లేదు. ఆ దైన్యాన్ని ఈ కథలో చూపించారు అఫ్సర్‌. ధర్మ క్షేత్రాల రీప్లేస్మెంట్లో ఎంతమంది అమాయకులు బలయ్యారు? ఎవరు ఎవర్ని బలిచేస్తున్నారు? అనే ప్రశ్న అందరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది.

పేదల బతుకులు ఎంద దుర్భరంగా ఉంటాయో చిత్రించిన కథ ‘అడవి’. ఊళ్లో ఎంత పనిచేసినా పొట్ట గడవని స్థితి. పట్నానికి వలస వచ్చినా అక్కడా చిన్నా చితక పనులతో ఇబ్బందులు. కుటుంబం అంతా మొలదారాలు అమ్మినా కడుపు నిండదు. కొనేవాళ్లు కొసరి కొసరి బేరాలాడుతుంటారు. ఈ క్రమంలో వారు పిడికెడు ముద్దు కోసం ఎన్ని ఫీట్లు వేస్తారో అక్షరీకరించిన కథ అడవి. ‘తెలంగీ పత్తా’ కథలో తెలుగులో రాస్తున్న రచయితలు అందరూ తమనితాము చూసుకుంటారు ఇన్క్లూడింగ్‌ మీ! అతి ఆచార సాంప్రదాయాల నడుమ తెలుగులో చదివి, తెలుగులో రాసేవాళ్లంటే కుటుంబం నుంచి తీవ్ర నిరసన ఉంటుంది. సినిమా రంగంలో పనిచేసేవాళ్లంటే హరామీలు అన్నంత నీఛంగా చూస్తారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. చాలామందికి దూరమయ్యాను. నన్ను నేను చూసుకున్నంత బాధ కలిగింది ఈ కథ చదివి.

భారతీయతను ఇముడ్చుకున్న ఇస్లాం రాన్రాను అరబ్‌ కంట్రీ ఇస్లాంను ఇక్కడ పాటించాలని చూస్తూ ఇక్కడి అలారు బలారు సంస్కతికి విఘాతం కలిగిస్తోందని తెలుగులో రాస్తున్న ముస్లిం రచయితలు వాపోతున్నారు. ఇది నిజం. అందరం కలిసి ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అన్న యావను మతంతో దూరం చేసుకుంటున్నారు. ముస్లింలలో కూడా ఇలాంటి చాందసవాదులు ఉన్నారు. చాందసం ఏ మతానికి అయినా ప్రమాదమే. అసలు బోధించాల్సింది మానవత్వమే. అదే సాటి మనిషి పట్ల ప్రేమ భావాన్ని పెంపొదిస్తుంది. ఇస్లాం కూడా అదే చెబుతుంది కానీ అతివాదులు దాన్ని చెప్పరు. ఈ జాడ్యం నశించిన్నాడే మన భారతీయతకు నిజమైన అందం, ఆనందం, ఐకమత్యం వచ్చేస్తుంది. మతంతో కాకుండా సాటి మనిషిగా చూసిన్నాడే లౌకికత్వం పరిఢవిల్లుతుంది.

పల్లె విడిచి పట్నం వచ్చిన ఓ రఫీక్‌ కథ ‘ధేడీ’. మనిషిని మనిషిలానే చూడాలి గానీ కులంతో, మతంతో చూడకూడదు అని చెప్పే కథ. ఎన్ని దేశాలు వలస వెళ్లినా వివక్ష తప్పనిసరైనదని చెప్పిన కథ ‘ఛోటీ దునియా’. ఒక సంఘటన జరిగితే అందులో ముస్లిం దోషి అయితే మొత్తం ముస్లిం సమాజాన్ని చాలా తేలిగ్గా దునమాడుతుంటారు. కానీ వేరే వర్గంలో మాత్రం జరిగితే అలా మొత్తం సమాజాన్ని అనరు. కులమతాల చట్రంలో ఇరుక్కున్న చిన్న ప్రపంచం భారతీయులది. వాటిని దాటి ఆలోచించినప్పుడే భారతీయుల లోకం చాలా విశాలం అవుతుందనే ఎరుక కలిగించే కథ.
అఫ్సర్‌ గారివి ఈ 11 కథలు చదివాను. ఇంగ్లీష్లోకి కూడా ’Sahil will come’ పేరుతో ఈ పుస్తకం అనువాదమవడం మంచి పరిణామం. మంచి కథలు, మన్నికైన కథలు, చేదు నిజాల్ని విప్పి చెప్పే కథలు. అందరూ తప్పక చదవాల్సిన కథలు.

  • హుమాయున్‌ సంఘీర్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -