Sunday, February 22, 2026
E-PAPER
Homeఆటలుసూపర్‌ సమరానికి సై

సూపర్‌ సమరానికి సై

- Advertisement -

భారత్‌, దక్షిణాఫ్రికా ఢీ నేడు
విజయంపై కన్నేసిన ఇరు జట్లు
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌

2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌లు ఈసారి సూపర్‌8లోనే సమరానికి సై అంటున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌, రన్నరప్‌ దక్షిణాఫ్రికా నేడు అహ్మదాబాద్‌లో సూపర్‌8 పోరులో ఢీకొట్టనున్నాయి. సూపర్‌8కు చేరుకున్న జట్లలో భారత్‌, దక్షిణాఫ్రికా ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. దీంతో నేటి సూపర్‌ పోరును ఫైనల్‌కు ముందు ప్రీ పైనల్‌గా చూడవచ్చు!.

సూపర్‌8 దశలో ఒత్తిడి ఎక్కువ. తొలి మ్యాచ్‌లో ఓడితే.. చివరి రెండింట నెగ్గినా సెమీఫైనల్‌ బెర్త్‌కు గ్యారెంటీ లేదు. ఈ సమీకరణం ప్రతి మ్యాచ్‌ను చావోరేవో అనేలా చేస్తోంది. సఫారీలపై సవారీ చేయాలనే ఆలోచన భారత శిబిరంలో ఉండగా.. ఆఫ్‌ స్పిన్‌తో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టేందుకు దక్షిణాఫ్రికా ప్రణాళికలు రచించింది. భారత్‌, దక్షిణాఫ్రికా సూపర్‌ పోరు నేడు.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
భారత్‌, దక్షిణాఫ్రికా సూపర్‌8 మ్యాచ్‌ సమవుజ్జీల సమరం, అజేయ జట్ల రణం. గ్రూప్‌ దశలో డిఫెండింగ్‌ చాంపియన్‌ స్థాయికి తగ్గ, ఆశించిన ప్రదర్శన చేయలేదు. అయినా, అలవోక విజయాలతో అజేయంగా నిలిచింది. దక్షిణాఫ్రికా గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌పై సులువుగా గెలుపొంది ప్రత్యర్థులకు ప్రమాద ఘంటికలు పంపించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు సూపర్‌8 దశలో ముఖాముఖి పోరుకు సై అంటుంటే.. టైటిల్‌ పోరుకు ముందే ఫైనల్‌ వచ్చినట్టు అనిపిస్తోంది. సెమీఫైనల్‌ రేసులో నిలిచేందుకు విజయమే ఏకైక లక్ష్యంగా నేడు ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్‌ నల్ల మట్టి పిచ్‌పై ఎవరు పైచేయి సాధిస్తారో? ఆసక్తికరం.

అదొక్కటే ఆందోళన
టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంలో భారత్‌ అదరగొట్టింది. బ్యాట్‌తో, బంతితో, ఫీల్డింగ్‌లో ఎటువంటి లోపాలు లేని జట్టుగా నిలిచింది. కానీ అసలు సమరంలో ఆతిథ్య జట్టు అంచనాలను అందుకోలేదు. విజయాలు దక్కినా.. అటు ఆటగాళ్లు, అటు అభిమానులు సంతృప్తి పడే ప్రదర్శన చేయలేదు. అందుకు ఓ ప్రధాన కారణం అభిషేక్‌ శర్మ వైఫల్యం. ప్రమాదకర బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ పేస్‌, స్పిన్‌ను పవర్‌ప్లేలోనే చితక్కొడతాడు. తొలి ఆరు ఓవర్లలో అతడి విధ్వంసం నిలువరించటమే ప్రత్యర్థి బౌలర్లకు పెను సవాల్‌. అటువంటిది, అభిషేక్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల ఖాతా తెరవలేదు. ఇతర బ్యాటర్లు రాణించినా.. స్కోరు బోర్డు ఎవరినీ సంతోషపరచలేదు. సూపర్‌8 దశలో అభిషేక్‌ శర్మ భారత్‌కు అత్యంత కీలకం. ప్రతి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో అభిషేక్‌ మెరిస్తే.. ఆట ఏకపక్షమే.

నేడు అభిషేక్‌ శర్మ విశ్వరూపం చూపిస్తే.. సఫారీలకు చుక్కలే. అభిమానులు ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌ దశలో భారత్‌కు ఒక్కో మ్యాచ్‌లో ఓ మ్యాచ్‌ విన్నర్‌. ఇది సూపర్‌8లో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెంచుతుంది. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, శివం దూబెలు తమదైన జోరు చూపించారు. శస్త్రచికిత్స అనంతరం తిలక్‌ వర్మ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. తిలక్‌ సైతం జోరందుకుంటే..క్రీజులో ఎవరున్నా పరుగుల వరద ఖాయమే. జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి కాంబినేషన్‌ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. బుమ్రా, వరుణ్‌ 8 ఓవర్లలో వికెట్లు కాచుకోవటమే అతిపెద్ద సవాల్‌గా మారుతోంది. అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య సైతం బంతితో రాణిస్తున్నారు. నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

ఉత్సాహంగా సఫారీలు
ఇటీవల భారత పర్యటనలో టీ20 సిరీస్‌ ఓడినా.. ఇక్కడి పిచ్‌లపై విలువైన పాఠాలు నేర్చుకుంది దక్షిణాఫ్రికా. గ్రూప్‌ దశ మ్యాచ్‌ల్లో సఫారీల జోరు చూశాక.. ఆ జట్టు స్పష్టమైన మ్యాచ్‌ ప్రణాళికలతోనే వచ్చిందని చెప్పవచ్చు. తుది జట్టు కూర్పుపై అవగాహన, జట్టులో ఎవరి పాత్ర ఏమిటనే స్పష్టత దక్షిణాఫ్రికాను సెమీస్‌ బెర్త్‌ రేసులో ముందు వరుసలో నిలుపుతోంది. ఎడెన్‌ మార్‌క్రామ్‌, క్వింటన్‌ డికాక్‌, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ సహా డెవిడ్‌ మిల్లర్‌కు భారత్‌పై మంచి రికార్డుంది. పైగా ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ భారత్‌తో గత సిరీస్‌లో చేసిన ప్రదర్శన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. సమతూకమైన జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా.. నేడు అహ్మదాబాద్‌లో భారత్‌కు షాక్‌ ఇవ్వాలనే పట్టుదల ప్రదర్శిస్తోంది.

పిచ్‌, వాతావరణం
అహ్మదాబాద్‌ పిచ్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఛేదనకు అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యే అహ్మదాబాద్‌లో నల్ల మట్టి పిచ్‌లు భిన్నమైన గణాంకాలు అందిస్తోంది. నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ నల్ల మట్టి పిచ్‌పైనే జరుగుతుంది. పేస్‌తో పాటు స్పిన్‌ బౌలర్లు కీలకం అవుతారు. టాస్‌ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా, తొలుత బౌలింగ్‌ ఎంచుకునే వీలుంది. నేటి మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవని సమాచారం.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా : ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రియాన్‌ రికెల్టన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవిడ్‌ మిల్లర్‌, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాచ్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.

ఆ ఓవర్లు కీలకం
గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచినా చాలా అంశాల్లో భారత్‌ గణనీయంగా మెరుగవ్వాల్సి ఉంది. అందులో ప్రధానమైనది పవర్‌ప్లే అనంతరం ఓవర్లలో రన్‌రేట్‌. అభిషేక్‌ శర్మ వైఫల్య పవర్‌ప్లే, ఆ తర్వాత ఓవర్లపై పడినా.. సూపర్‌8లో ఈ సమస్యను భారత్‌ అధిగమించాల్సి ఉంది. 7-10 ఓవర్లలో భారత్‌ రన్‌రేట్‌ 7.12 మాత్రమే. ఇదే ఓవర్లలో దక్షిణాఫ్రికా సగటున ఓవర్‌కు 10.37 పరుగులు చేసింది. పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లతో పాటు మిడిల్‌ ఓవర్ల ఆరంభంలోనూ భారత్‌ పరుగుల వేటపై మరింత దృష్టి నిలపాలి. అప్పుడే అగ్రజట్లతో సవాల్‌ను అలవోకగా అధిగమించవచ్చు.

స్పిన్‌ మంత్ర!
భారత్‌, దక్షిణాఫ్రికా సూపర్‌8 మ్యాచ్‌లో స్పిన్‌ పెను ప్రభావం చూపించనుంది. భారత టాప్‌-3 బ్యాటర్లు ఎడమ చేతి బ్యాటర్లు. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మకు తోడు శివం దూబె, అక్షర్‌ పటేల్‌, రింకు సింగ్‌లు సైతం ఎడమ చేతి బ్యాటర్లే. దీంతో ఆఫ్‌ స్పిన్‌తో లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లకు ముకుతాడు వేసేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమవుతోంది. అభిషేక్‌ శర్మ రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్‌ స్పిన్‌కు వికెట్‌ కోల్పోవటంతో.. నెట్స్‌లో సఫారీలు ఆఫ్‌ స్పిన్‌పై ఫోకస్‌ పెట్టారు. కేశవ్‌ మహరాజ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కాగా.. ఎడెన్‌ మార్‌క్రామ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌తో ఆఫ్‌ స్పిన్‌ మాయకు సఫారీ సిద్ధమవుతోంది. భారత్‌ సైతం స్పిన్‌ను ఎదుర్కొనేందుకు నెట్స్‌లో కఠోరంగా సాధన చేసింది. ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ సహా అభిషేక్‌ శర్మ నెట్స్‌లో స్పిన్‌ను ఎక్కువసేపు ఆడారు. స్పిన్‌పై బ్యాట్‌ను అడ్డంగా ఊపుతూ వికెట్‌ కోల్పోతున్న అభిషేక్‌.. నెట్స్‌లో స్ట్రయిట్‌ బ్యాట్‌తో షాట్లు ఆడుతూ కనిపించాడు. స్పిన్‌పై 200 ప్లస్‌ స్ట్రయిక్‌రేట్‌ కలిగిన అభిషేక్‌ శర్మ హ్యాట్రిక్‌ డకౌట్ల ప్రభావం లేకుండా.. సఫారీ స్పిన్నర్లను ఆడాలనే వ్యూహంతో రానున్నాడు.

5-2
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా ముఖాముఖి రికార్డు ఇది. ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట టీమ్‌ ఇండియా గెలుపొందగా, రెండింట దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.

5
ఈ ఏడాది అభిషేక్‌ శర్మ డకౌట్లు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన భారత బ్యాటర్‌గా అభిషేక్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనే అభిషేక్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ సున్నా పరుగులనే ఔటయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -