న్యూఢిల్లీ : దిగ్గజ మహారత్న కంపెనీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో 14 శాతం వృద్ధితో 12.7 మిలియన్ టన్నుల (ఎంటి) విక్రయాలను సాధించింది. గతేడాది ఇదే కాలంలో 11.1 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదు చేసింది. ధరల ఒత్తిడి, డిమాండ్‌లో అనిశ్చితి ఉన్నప్పటికీ ఆకర్షణీయ అమ్మకాలు సాధించామని ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం శనివారం వెల్లడించింది. ”ప్రపంచ వ్యాప్తంగా ధరల ఒత్తిడి, వివిధ దేశాల వాణిజ్య విధానాల్లోని అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన డిమాండ్ హెచ్చుతగ్గుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, పటిష్టమైన విక్రయ వ్యూహం కారణంగానే ఈ మెరుగైన ఫలితాలను సాధించగలిగాం” అని సెయిల్ తెలిపింది.
గడిచిన ఎనిమిది నెలల కాలంలో రిటైల్ విక్రయాలు కూడా బలంగా ఉన్నాయి. 2024 ఏప్రిల్-నవంబర్‌లో 8.6 లక్షల టన్నులుగా ఉన్న రిటైల్ విక్రయాలు, ఈ ఏడాది 13 శాతం పెరిగి 9.7 లక్షల టన్నులకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమాలు ఇందుకు తోడ్పడ్డాయని ఆ సంస్థ పేర్కొంది. కేవలం నవంబర్ నెలలోనే మొత్తం విక్రయాలు గతేడాదితో పోలిస్తే 27 శాతం పెరగ్గా, రిటైల్ విక్రయాలు ఏకంగా 69 శాతం వృద్ధిని సాధించడం విశేషం. దేశంలోని జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఐదు తయారీ ప్లాంట్ కలిగిన సెయిల్ ఏడాదికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సెయిల్ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి
- Advertisement -
- Advertisement -



