పడిపోయిన షేర్ విలువ
న్యూఢిల్లీ : విద్యుత్ తయారీ పరికరాలు, ఇంజనీరింగ్ సేవల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో మోడీ సర్కార్ ఐదు శాతం వాటాలను విక్రయిస్తోంది. బుధవారం ఇన్స్‌ట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.5600 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు వేశారు. ఇది రెండు రెట్లు ఎక్కువ. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 12న బిడ్లు వేసేందుకు అవకాశం కల్పించారు. గ్రీన్‌షు అప్షన్, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) సెక్రెటరీ అరునిష్ చావ్లా తెలిపారు. తొలి రోజు ఓఎఫ్‌ఎస్‌కు 2.3 రెట్ల స్పందన వచ్చిందని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఒక్కో షేర్‌ను రూ.254 వద్ద విక్రయించడం ద్వారా రూ.4,422 కోట్లు కేంద్ర ఖజానాకు చేరనున్నాయి. ఈ మొత్తం విలువ చేసే వాటాలు ప్రయివేటు శక్తుల సొంతం కానున్నాయి. మొత్తంగా 5 శాతానికి సమానమయ్యే 17.41 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం భెల్‌తో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. వాటాల ఉపసంహరణ తర్వాత ఇది మరింత తగ్గిపోనుంది.
వాటాల విక్రయ పరిణామంతో బుధవారం భెల్ షేర్ 5.58 శాతం పడిపోయి రూ.260.65 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో భెల్ నికర లాభాలు 190 శాతం వృద్ధితో రూ.390.40 కోట్లుగా నమోదయ్యాయి. సంస్థ ఆదాయం కూడా 16.4 శాతం పెరిగి రూ.8,473 కోట్లకు చేరింది. గడిచిన ఆరు నెలల్లో భెల్ షేర్ ఇన్వెస్టర్లకు దాదాపు 25 శాతం లాభాలను అందించింది. ఏడాది కాలంలో ఏకంగా 38 శాతానికి పైగా వృద్ధిని కనబరచడం విశేషం.
భెల్‌లో 5శాతం వాటాల విక్రయం..
- Advertisement -
- Advertisement -



