Friday, March 20, 2026
E-PAPER
Homeకరీంనగర్కాలం చెల్లిన నెయ్యి విక్రయం.. వినియోగదారుకు అస్వస్థత

కాలం చెల్లిన నెయ్యి విక్రయం.. వినియోగదారుకు అస్వస్థత

- Advertisement -

-పునరావృతమవుతున్న ఘటనలపై ఆందోళన..
-అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
నవతెలంగాణ – రాయికల్

రాయికల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు లో గల ఓ సూపర్ మార్కెట్‌లో కాలం చెల్లిన నెయ్యి విక్రయం వెలుగులోకి రావడంతో వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయించడం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఓ కంపెనీకి చెందిన 100 గ్రాముల నెయ్యి డబ్బాను సంబంధిత సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాత్రి తన కూతురు అన్నంలో కలుపుకుని తినగా కడుపునొప్పితో వాంతులు చేసుకోవడంతో అనుమానం వ్యక్తమైంది.

వెంటనే నెయ్యి డబ్బాను పరిశీలించగా.. అది గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే కాలం చెల్లినదిగా ముద్రించి ఉండటం గుర్తించారు. దీంతో శుక్రవారం సాయంత్రం తన కుమారుడు యశ్వంత్‌ను అదే సూపర్ మార్కెట్‌కు పంపగా.. మరో కంపెనీకి చెందిన నెయ్యి డబ్బా తీసుకురాగా అది అక్టోబర్ 2025 వరకు మాత్రమే వినియోగించాలని ముద్రించి ఉండటం చూసి వినియోగదారు ఆశ్చర్యానికి లోనయ్యారు. వరుసగా కాలం చెల్లిన లేదా గడువు ముగిసే దశలో ఉన్న ఉత్పత్తులు విక్రయించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నవతెలంగాణ దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ దుకాణంలో గత ఐదు నెలల క్రితమే కాలం చెల్లిన నెయ్యి డబ్బాలు విక్రయిస్తున్నట్లు వినియోగదారు గుర్తించినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో సమస్య కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు అంటున్నారు.

గతంలో కూడా పట్టణంలోని మరో సూపర్ మార్కెట్‌లో ఉప్మా రవ్వలో పురుగులు రావడంతో వినియోగదారు జిల్లా ఆహార భద్రతాధికారినికి ఫిర్యాదు చేయగా, తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి మమ అనిపించినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే గత ఏడాది ఓ బేకరిలో కాలం చెల్లిన మిక్స్డ్ ఫ్రూట్స్ శీతల పానీయం విక్రయంపై నవతెలంగాణలో కథనం ప్రచురితమయ్యాక మున్సిపల్ అధికారులు స్పందించి దుకాణాన్ని సీజ్ చేసి రూ.10 వేల జరిమానా విధించారు. అయినా పట్టణంలో ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతమవుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయటకు వచ్చినప్పుడో, ఫిర్యాదు వచ్చినప్పుడో మాత్రమే తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును నవతెలంగాణ వివరణ కోరగా.. వెంటనే తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలం చెల్లిన ఆహార పదార్థాల విక్రయాలు కొనసాగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని, పట్టణంలోని దుకాణాల్లో నియమిత తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -