– ముగ్గురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు
నవతెలంగాణ – కామారెడ్డి
పోలీసు శాఖకు సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు యం. ప్రకాష్ (ఎస్‌ఐ – బాన్స్వాడ పోలీస్ స్టేషన్), యం. రాజయ్య (ఎస్‌ఐ – వీఆర్ కామారెడ్డి), యం. నారాయణ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ – కామారెడ్డి)లను వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. 40 నుంచి 42 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు అంకితభావంతో సేవలందించినందుకు వారికి అభినందనలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.
రిటైర్మెంట్ అనంతరం వారికి అందవలసిన అన్ని ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. వారు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యం. ప్రకాష్, యం. రాజయ్య 1984లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుళ్లుగా సేవలు ప్రారంభించి దాదాపు 42 సంవత్సరాలు విధులు నిర్వహించారు. యం. నారాయణ 1985లో సేవలు ప్రారంభించి సుమారు 41 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు సేవలందించారు. చివరగా, అధికారులు, సిబ్బంది కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు నవీన్ కుమార్, కృష్ణ, సంతోష్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



