Monday, January 5, 2026
E-PAPER
Homeజాతీయంకేరళకు సెల్యూట్‌ …ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కొనసాగాలి

కేరళకు సెల్యూట్‌ …ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కొనసాగాలి

- Advertisement -

అనంతవట్టం ఆనందన్‌ నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రత్యామ్నాయాన్ని లేవనెత్తుతున్న కేరళకు కార్మిక వర్గం సంఘీభావం తెలిపింది. సవాళ్లను ఎదుర్కొంటూ కార్మిక వర్గ ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రత్యక్షంగా సమర్థిస్తున్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభ సెల్యూట్‌ చేసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సీఐటీయూ ఉపాధ్యక్షులు అనాది కుమార్‌ సాహు ప్రతిపాదించగా, మాణిక్‌ దేవ్‌ బలపర్చారు. అనంతరం ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం చూపిన ప్రతిఘటనను, తిరువనం తపురంలో కార్మిక సమ్మేళనం నిర్వహించడానికి తీసుకున్న చొరవను ఈ మహాసభ ప్రశంసించింది. కేరళ కార్మిక అనుకూల ప్రత్యామ్నాయ విధానాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకరించగల విప్లవాత్మక నమూనా అని పేర్కొంది.

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ ప్రజా అనుకూల విధానాలను రక్షంచడానికి దేశంలోని కార్మికులు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చింది. ‘కేంద్రం నిధుల నిరాకరణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కార్మికుల సంక్షేమ బోర్డుల్లో పెన్షన్లు, పరిహారాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే అత్యధిక కనీస వేతనం పొందుతున్న రాష్ట్రం కేరళ. అక్కడ అనేక వ్యవసాయ పంటలకు అత్యధిక కనీస మద్దతు ధరను అందిస్తున్నది. ప్రజారోగ్యం, విద్యా రంగాల్లో కేరళ సాధించిన విజయాలు అసమానమైనవి. అందరికీ గృహ నిర్మాణం కల్పించడానికి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా అవతరించిన కేరళ, శ్రామిక ప్రజల పట్ల తన అచంచల నిబద్ధతను మరోసారి ప్రదర్శించింది’ అని పేర్కొంది. ‘కేంద్ర ప్రభుత్వం వివిధ షరతులు, ఆంక్షలు విధించడంతో కేరళపై విధించిన ఆర్థిక దిగ్బంధనంపై మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విపత్తు సహాయ నిధులను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమానవీయంగా తిరస్కరించడం దారుణం’ అని పేర్కొంది.

‘రాష్ట్ర లౌకిక సంప్రదాయాన్ని, మత ఐక్యతను నాశనం చేయడానికి కార్పొరేట్‌-మత కూటమి చేస్తున్న ప్రయత్నాలపై మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని రక్షించడానికి తమ సాహసోపేత పోరాటాన్ని కొనసాగిస్తున్న కేరళ కార్మిక-రైతు ఉద్యమాలను ఈ మహాసభ అభినందించింది. కేరళలో ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లో వ్యాప్తి చేయాలనీ, అటువంటి హక్కులను సాధించడానికి పోరాటాన్ని తీవ్రతరం చేయాలని అన్ని యూనిట్లకు పిలుపునిచ్చింది. వివక్షను తొలగించడంతో రాజ్యాంగంలో వాగ్దానం చేసిన సమాఖ్య విధానాన్ని నిలబెట్టడంతో రాష్ట్ర హక్కులను నిర్ధారించాలని మహాసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా చూసుకోవాలని కేరళ కార్మికులకు మహాసభ పిలుపునిచ్చింది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను రక్షంచడానికి దేశ వ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా నిలబడాలని మహాసభ కోరింది.

కార్మిక, రైతులు, ప్రజాస్వామ్య హక్కులపై దాడికి ఖండన
దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతులు, ప్రజాస్వామ్య హక్కులపైన తీవ్ర దాడి జరుగుతుందని మహాసభ విమర్శించింది. దాడులను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. కార్మిక, రైతు, ప్రజాస్వామ్య హక్కులపై దాడిని మహాసభ ఖండించింది. ఈ తీర్మానాన్ని ఎంపీ ఎలమారం కరీం ప్రతిపాదించగా ఉషారాణి మద్దతు తెలిపింది. ‘2025 సంవత్సరం చివరి వారాల్లో, దేశవ్యాప్తంగా జరిగిన వరుస హింసాత్మక ఘటనలు ఆందోళనకర ధోరణిని బయటపెట్టాయి. ఈ దాడులు, తమపై దాడి చేసినవారిచే బంగ్లాదేశీయులు, చైనీయులు అని ముద్ర వేయబడిన వలసదారులపై మూక హింస రూపంలో జరిగాయి.

ఈ కేసుల్లో బాధితులైన ముగ్గురూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయ పౌరులే. భాష, ప్రాంతం, రూపం, ఊహించిన జాతీయత ఆధారంగా ఏర్పడిన అనుమానం వివిధ ప్రాంతాల్లో మూక హింసకు దారితీసింది. ఇది అత్యంత ఆందోళనకరం, ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. హింస ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేయాలి. అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ చొరబాటు పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మూకలు నిస్సహాయ ప్రజలపై దాడి యాదృచ్ఛికం కాదు. ఇది కొన్ని మితవాద సంస్థల సైద్ధాంతిక దాడిలో భాగమే’ అని మహాసభ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -