ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ కామెంట్
వందేండ్ల నుంచి సేవచేస్తున్నారని కితాబు
దేశాన్ని రక్షించేందుకు మిషన్ సుదర్శన చక్ర
జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు
దేశీయ ఉత్పత్తుల్ని బోర్డులపై రాయాలంటూ వ్యాపారులకు సూచన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేండ్లుగా దేశానికి సేవ చేస్తోంది. వారి అంకితభావానికి నా సెల్యూట్’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడిక్కడ ఎర్రకోటపై నుంచి ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్, అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అంతకుముందు ఎర్రకోటపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌ను శత్రు దుర్భేద్యంగా చేసేందుకు మిషన్ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. వచ్చే పదేండ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడుతుందనీ, దేశంలోని ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారని చెప్పారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉందనీ, సాంకేతికత అభివృద్ధి కోసం విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. 2008 ముంబయి దాడులు సమీకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయనీ, దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా, ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు. పదేండ్ల క్రితం రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై దృష్టి పెట్టామనీ, ఇప్పుడు దాని ఫలితాలను చూస్తున్నామని అన్నారు.
మోడీ ప్రసంగంలో ముఖ్యాంశాలు
– దేశంలో హైపవర్డ్ డెమోగ్రఫీ మిషిన్‌ను అమలుచేస్తాం. దేశంలోని అవకాశాలను చొరబాటుదారులు లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యం. ముఖ్యంగా ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇకపై వారి ఆటలు సాగనీయం.
– మన రైతులకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి విధానాలకైనా నేనే గోడలా అడ్డుపడతా.
– ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ప్రయివేటు రంగంలో మొదటి ఉద్యోగం తెచ్చుకొన్నవారికి రూ.15 వేలు అందజేస్తాం.
– దేశీయ ఉత్పత్తుల్ని మన వ్యాపారులు బోర్డులపై రాసి ప్రదర్శించాలి.
– సముద్రంలో సహజవనరులు, గ్యాస్, చమురు అన్వేషణకు వీలుగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషిన్ ప్రారంభిస్తాం.
– శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర దేశానికి గర్వకారణం. గగన్‌యాన్ మిషిన్ కోసం భారత్ వేగంగా సిద్ధం అవుతోంది. భవిష్యత్‌లో సొంతం గా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయి
– బ్లాక్ మెయిల్‌కు ఇండియా తలవంచే రోజులు పోయాయి. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు.
– సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదు. నీరు, రక్తం కలిసి ప్రవహించవు. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. దానిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదు.
– ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేఛ్చ త్రివిధ దళాలకే ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్.
– ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్‌పై ఆధారపడటం కాదు. 2030లోగా భారత్‌లో 50 శాతం క్లీన్ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగు మతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం ఇండియా ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు.
– యువత సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి సారించాలి
– కొత్త ఇంథనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలని లక్ష్యం. 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని పది రెట్లు పెంచాలని నిర్ధేశించుకున్నాం. పది కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి.
– ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతుంది. వాటికోసం 1,200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ మార్కెట్‌ను ముంచెత్తుతాయి.
– రైతులు రసాయనిక ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలి.
– ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. యువత ప్రపంచ దేశాలతో పోటీపడాలి. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తనదైన ముద్ర వేస్తుంది.
ఆర్‌ఎస్‌ఎస్‌కు సెల్యూట్
- Advertisement -
- Advertisement -