ఉదయం 8 నుంచి…మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహణ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలలకు మార్చి 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాగా..అంగన్వాడీలనూ ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించారు. వేసవిలో వడగాల్పులతో చిన్నారులు అవస్థలుపడే అవకాశం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుం చి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు తెరిచి ఉంచాలని మహిళా, స్త్రీ, శిశు సం క్షేమ శాఖ నుంచి ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు అందాయని తెలిపారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
మండల పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో తాడిచెర్ల, వల్లెంకుంట రెండు సెక్టర్లలో మొత్తం 38 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 1,199 చిన్నారులతో పాటు మరో 310 మంది గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసు కుంటున్నారు. ప్రస్తుతం రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడుగా కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో ఏటా వేసవిలో ఉక్కపోతతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చిన్నారులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ ఉండాల్సి రావడంతో ఎండ వేడికి తట్టు కోలేకపోతున్నారు. కొన్ని సెంటర్లలో కనీసం విద్యుత్ సదుపాయం కూడా ఉండని పరిస్థితి. ఈ క్రమంలో ఎండలు తీవ్రమైతే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్ వాడీ సెంటర్లకు పంపించడం లేదు.
ఒంటిపూటతో ఉపశమనం..
వేసవి ప్రారంభంలో పాఠశాలలకు ఏటా ఒంటి పూట తరగతులు నిర్వహిస్తుంటారు. విద్యా సంవత్సరం పూర్తికాగానే వేసవి సెలవులు సైతం ఉంటాయి. కానీ అంగన్వాడీ సెంటర్లకు ఎలాంటి సెలవులు, ఒంటిపూట నిర్వహణ ఉండదు. చాలాకాలం గా ఈ విషయంలో అంగన్వాడీ టీచర్లు, ఆయా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంగన్వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉదయం 8గంటలకు పిల్లలు సెంటర్లకు రావాల్సి ఉంటుంది. 11 గంటల నుంచి 11.30 గంటల్లోగా మధ్యాహ్న భోజనం అందించి 12గంటలకు పిల్లలను ఇళ్లకు పంపించాల్సి ఉంటుంది. మే 1వ తేదీ నుంచి నెలరోజులు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇళ్లకే పౌష్టికాహారాన్ని అందిస్తారు.
టీచర్లు చేపట్టాల్సినవి..
ఒంటిపూట బడి అనంతరం మధ్యాహ్నం టీచర్లు, ఆయాలు పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించడం, వార్షిక సర్వే, గృహ సందర్శన, పిల్లలను అంగన్ వాడీల్లో చేర్పించడం తదితరాలు చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాలు, ప్రీ స్కూల్ ప్రవేశాలకు విద్యార్థుల నమోదు, బడి మానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.



