కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా.. ఉద్రిక్తత
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
సొమ్మసిల్లిన పలువురు నేతలు.. న్యాయం చేయాలని పాతర్లపాడు మహిళల నినాదాలు
కలెక్టర్ బయటకు రావాలంటూ అఖిలపక్ష నేతల డిమాండ్
రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారకముందే నిందితులను అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ీసీపీఐ, బీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతల సంఘీభావం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్యా నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. మూడు గంటలకు పైగా ఈ ధర్నా ఏకబికిన సాగింది. ధర్నాకు బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సైతం మద్దతు ప్రకటించాయి. హత్య జరిగి 26 రోజులవుతున్నా నేరస్తులను పట్టుకోవటంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు. రామారావు స్వగ్రామం పాతర్లపాడు నుంచి గ్రామస్తులు భారీగా హాజరయ్యారు. రామారావు కుటుంబంతో పాటు తమ గ్రామస్తులకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భటి విక్రమార్క, ఆయన సతీమణి నందినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న నేటి రోజుల్లోనూ పోలీసులు కేసును పట్టించు కోకపోవడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పోలీసు కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
పోలీసుల భారీ మోహరింపుతో ఉద్రిక్తత
కలెక్టరేట్ వద్ద ధర్నా విషయం తెలిసి పోలీసులను భారీగా మోహరించారు. నగరంలోని నాలుగు పోలీసుస్టేషన్‌లతో పాటు జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, కొణిజర్ల, ముదిగొండ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బారికేడ్‌లు అడ్డుగా పెట్టి కలెక్టరేట్‌లోకి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు చేపట్టారు. శాంతియుతంగా ధర్నా చేపట్టాలని నాయకులు ముందు నుంచే సూచించటంతో కార్యకర్తలు సయమనం పాటించారు. కలెక్టర్‌కు తమ సమస్య వివరించాలని అఖిలపక్ష నేతలు కదిలిన సమయంలో పోలీసులు ఒక్కసారిగా హడావుడి చేశారు. దాంతో నిరసనకారుల్లో ఆందోళన మొదలై అడ్డుగా ఉన్న బారికేడ్‌లు, పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్ గేట్ల వరకూ చొచ్చుకొని వెళ్లి గేటు ఎదుటే బైటాయించి నినాదాలు చేశారు. కళాకారులు.. రామారావుతో పాటు ఎర్రజెండా అమరుల త్యాగాలను స్మరిస్తూ గీతాలాపన చేశారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన ధర్నా మధ్యాహ్నం 2.45 గంటల వరకూ సాగింది.
హాస్యాస్పదంగా పోలీసు విచారణ: పోతినేని సుదర్శన్‌రావు
పోలీసు విచారణ హాస్యాస్పదంగా సాగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. నేరస్తులను పట్టుకునే దిశగా కాకుండా పక్కదారి పట్టించే రీతిలో విచారణ సాగుతోందన్నారు. పోలీసులపై మల్లు భట్టివిక్రమార్క, ఆయన భార్య నందిని ఒత్తిడి పనిచేస్తోందన్నారు. మధిర నియోజకవర్గంలో జరుగుతున్న దురాఘతాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని కోరారు. ఈ హత్యకు భట్టినే బాధ్యత వహించాలని, లేనిపక్షంలో ఇది మరింత ఉధృతరూపం దాల్చుతుందని హెచ్చరించారు.
ఇదీ రాజకీయ హత్యే : సీపీఐ, బీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ నేతలు
సామినేని రామారావుది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, హత్యకేసులో నిందితులను తేల్చటంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, హంతకులను శిక్షించకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రామారావు హంతకులు ఇండ్లలో ఉంటే మనం ఆందోళనలు చేయాల్సి వస్తుందంటే ప్రభుత్వ యంత్రాంగం తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, జడ్పీ మాజీ చైర్మెన్ లింగాల కమలరాజ్ అన్నారు. మధిర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. దర్యాప్తు సక్రమ పద్ధతిలో సాగట్లేదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మాదినేని రమేశ్, బొంతు రాంబాబు, బండి పద్మ, మధిర, సత్తుపల్లి డివిజన్ కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, శీలం వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ ఖమర్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, ఎం.సుబ్బారావు, ఐద్వా జిల్లా అధ్యక్షులు మెరుగు రమణ, సామినేని రామారావు సతీమణి స్వరాజ్యం, కుమారుడు విజరు, చింతకాని మండల కార్యదర్శి రాచబంటి రాము, నాయకులు జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
అధికారపార్టీకి పోలీసుల గులాంగిరి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అధికారపార్టీకి పోలీసులు గులాంగిరి చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) నాయకున్ని హత్యచేస్తే ఆ పార్టీ నాయకులు అడక్కపోతే ఎవరడుగుతారని పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌ను ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్య అంటే భయపెట్టే రీతిలో ఖమ్మం సీపీ వ్యవహరం ఉందన్నారు. రామారావుది పూర్తిగా రాజకీయ హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య అని పునరుద్ఘాటించారు. సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకునిలా వ్యవహరిస్తున్నారన్నారు. కలెక్టర్, సీపీ ఇలానే స్పందించకుండా.. నిందితులను అరెస్టు చేయకుండా ఉంటే దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలుచుతామని హెచ్చరించారు. పోలీసులు పక్షపాతంగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టం పట్ల గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చట్టప్రకారం నిందితులను అరెస్టు చేయాలని కోరుతు న్నామని, ప్రజలనుకుంటే శిక్షించలేరా? అని ప్రశ్నించారు. రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సీపీని, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను వదిలిపెట్టేది లేదని తెలిపారు.
సామినేని హంతకులను అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



