Sunday, January 25, 2026
E-PAPER
Homeసమీక్షసమ్మక్క... ది గ్లోరీ ఆఫ్‌ మేడారం

సమ్మక్క… ది గ్లోరీ ఆఫ్‌ మేడారం

- Advertisement -

అడవి అర్థం కాని చిక్కు ముడి. స్వేచ్చ.. అక్కడ నివసించే ఆదివాసీలకు ప్రకతి ప్రసాదించిన వరం. ఋతువులు మారినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, గుట్టు చప్పుడు లేకుండా కలిసికట్టుగా జీవిస్తుంటారు. అడవి ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. తమకు హాని చేసేవాళ్ళను వదలరు, తమకు సహాయం చేసిన వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్దపడతారు. తమకు అండగా నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన వాళ్ళను దేవుళ్ళు, దేవతలను చేసి పూజిస్తారు.

‘సమ్మక్క…ది గ్లోరీ ఆఫ్‌ మేడారం’ అన్న ఉప శీర్షికతో కన్నెకంటి వెంకటరమణ ఒక పుస్తకాన్ని వెలువరించారు. 1994 వ సంవత్సరం నుంచి దాదాపు పదమూడేళ్ళు ములుగు డివిజన్‌ పీఆర్‌ఒగా పనిచేసినప్పుడు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి తన అనుభవాలను వ్యాసాలుగా రాసి సంకలనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సమ్మక్క, సారలమ్మ జాతర విశేషాలు, జాతర సమయంలో అక్కడ నిర్వహించే క్రతువులను చాలా లోతుకి వెళ్ళి కూలంకుష అధ్యయనంతో, పరిశోధన చేసి రాసాడు. అసలు ఈ సమ్మక్క, సారలమ్మలు ఎవరు అని చరిత్రలోకి వెళితే వాళ్ళూ మనలాగే మనుషులే. అయితే వీళ్ళు ఎలా దేవుళ్ళు, దేవతలు అయ్యారంటే మనం సమ్మక్క, సారలమ్మ చరిత్ర తెలుసుకోవల్సిందే.

వేయి సంవత్సరాల క్రితం మేడారం ప్రాంతాన్ని మేడరాజులు పరిపాలించేవారు. వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. మేడ రాజ్యానికి సామంత రాజు పగిడిద్దరాజు. ఈయన భార్య సమ్మక్క. వీరికి ముగ్గురు సంతానం. సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సారలమ్మ భర్త గోవిందరాజు. మేడరాజ్యంలో ఒకానొక సమయంలో నాలుగేళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో ప్రజలు పన్నులు కట్టలేక, సామంత రాజులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు. కాకతీయులు కప్పం చెల్లించలేదని కోపంతో మేడరాజ్యంపై యుద్ధానికి దిగారు. మేడరాజులైన పగిడిద్దరాజు, నాగులమ్మ, జంపన్న, సారలమ్మ, గోవిందరాజులు కాకతీయులపై వీరోచిత పోరాటం చేసి, వీర మరణం పొందారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగు అయ్యింది. తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారన్న వార్త తెలుసుకున్న సమ్మక్క పరాశక్తి అవతారమెత్తి యుద్ధ రంగంలోకి దిగి, కాకతీయ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఓటమి తప్పదని తెలుసుకున్న కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అది గ్రహించిన సమ్మక్క యుద్ధం నుంచి వైదొలిగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్ట వైపుకు వెళ్లి అదశ్యం అయ్యింది. అక్కడి నెమలిమినార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరణి మాత్రం దొరికింది. ఆ భరిణెను సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయడం అక్కడి ఆదివాసీల ఆనవాయితీ…..ఇదీ చరిత్ర….
ప్రజల కోసం బతకాలి… చావాలి…అన్న సంకల్పంతో సమ్మక్క సారలమ్మ కుటుంబం వీర మరణం పొందారు. మాఘు శుద్ద పౌర్ణమి రోజున ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతర ఆదివాసీ సంస్కతి సంప్రదాయాల ప్రకారం నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగుండి నుంచి పడిగిద్దరాజును, మేళతాళాలతో, ఛత్తీస్‌గఢ్‌ గుత్తి కోయలు ప్రత్యేకంగా అలంకారాలతో నత్యం చేస్తూ ఆహ్వానం పలుకే దశ్యం కనుల పండువగా ఉంటుంది. ఆదివాసీలు తన్మయత్వంతో శిగాలు ఊగుతూ, మేడారం వరకు ఊరేగింపుగా వచ్చి గద్దెల మీద ప్రతిష్టిస్తారు.

రెండవ రోజు సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజు భక్తులు దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసి, తలనీలాలు సమర్పించడం, ఎదురుకోళ్ళు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర, శివసత్తుల పూనకాలు, వడ బియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, మండ మెలిగే ఉత్సవం, కోయదొరల భవిష్యవాణి, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట, పాట లాంటి దశ్యాలు జాతరను కోలాహలం చేస్తాయి. వేదమంత్రోఛ్చరణలు లేకుండా విగ్రహారాధన చేయకుండా ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు వీరినే వడ్డెలు అని స్థానికంగా పిలుస్తారు. కోయ గిరిజన పద్ధతిలో ఈ జాతర జరుగుతుంది. నాలుగవ రోజు దేవతలు వన ప్రవేశం చేస్తారు.
జాతర జరిగే ఈ నాలుగు రోజుల్లోనే తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు రెండు కోట్ల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

అప్పట్లో కనీస సౌకర్యాలు కూడా లేని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కవర్‌ చేయడానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లను సమన్వయం చేసుకుని తీసుకెళ్ళడానికి అనేక వ్యయప్రయాసలకు గురయినట్లు కన్నెకంటి వెంకటరమణ ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
సారలమ్మ, సమ్మక్క, గోవింద రాజులు, పడిగిద్దరాజు లను కన్నెపల్లి, కొండాయి, పూనుగుండి, చిలుకల గుట్ట గ్రామాల నుంచి మేడారం గద్దెల వరకు తీసుకువచ్చే ఊరేగింపును, ఆయా గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసే పూజలను అద్భుతంగా వివరించాడు వెంకటరమణ.
తమ ప్రజల కోసం కాకతీయ రాజులను ధిక్కరించి, వారితో పోరాటం చేసి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మలకు ఆదివాసీలు తమ గుండెల్లో గుడి కట్టారు. జాతరలో జరిగే ఒక్కొక్క క్రతువు మూలాల్లోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో పొందుపరిచాడు వెంకట రమణ. జంపన్న వాగుపై వంతెన నిర్మాణంలో అప్పటి కలెక్టర్‌ తీసుకున్న చొరవ, వంతెన నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళను ఆ గ్రామాల మహిళలు ఎదురుతిరగడం, కుంభమేళను తలపించే సమ్మక్క సారలమ్మ జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తీసుకునే జాగ్రత్తలను, ఆదివాసీల సంస్కతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ప్రతి అంశాన్ని అక్షరీకరించాడు వెంకటరమణ. కనుమరుగవుతున్న సంస్కతి సంప్రదాయాలు, పండుగలు, జాతరల గురించి రాబోయే తరాలు తెలుసుకునేందుకు ఈ సమ్మక్క-ద గ్లోరి ఆఫ్‌ మేడారం ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాంపిటేటివ్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారు, ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పుస్తకం చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రమోద్‌ ఆవంచ, 7013272452

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -