మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తిచేయాలి : సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ను ఉగాది పండుగ రోజున ప్రారంభించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మార్చి రెండో వారానికల్లా పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయాలనీ, ఎక్విప్‌మెంట్ ట్రయల్స్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి పడకలతో ఏర్పాటు చేయబోతున్న టిమ్స్‌లోని ఓపీ రూమ్‌లు, డయాగస్టిక్స్, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. ఆస్పత్రిలో అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగస్టిక్స్ యంత్రాలు ఇన్‌స్టాలేషన్ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆస్పత్రి ప్రారంభానికి ముందే టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.
నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి, త్వరితగతిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. మెడికల్ సర్వీసెస్‌తో పాటు సానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్‌ఎంఐఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని సూచించారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.



