నవతెలంగాణ – రాజోలి
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల సరిహద్దులో ఉన్న సుంకేసుల బ్యారేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా అవుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వరుస పెట్టి సరిహద్దును దాటుతున్నాయి. ఈ అక్రమ ఇసుక ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడే అవకాశం అధిక సంఖ్యలో ఉంది. కానీ అధికారులు చూసి కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ రవాణా ఇప్పటిది కాదు.. గత కొన్ని నెలలుగా తండోపతండాలుగా ఏపీకి తరలుతోంది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక లేక లబ్దిదారులు నానా తంటాలు పడుతుంటే.. చెక్ పోస్టుల వద్ద ఉన్న అధికారులు మాత్రం నిమ్మకునీరత్తెనట్టు వ్యవహరించడం పలు అనుమానానాలకు దారి తీస్తోంది.
రాత్రి అయితే చాలు.!
అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు సుంకేసుల బ్యారేజ్ పై తిరిగేవి అక్రమ ఇసుక రవాణా వాహనాలే. తప్పిదారి ఏ వాహనమైన బ్యారేజ్ పై నుండి వస్తే అతికష్టంమీద గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మోతాదుకు మించి ఓవర్ స్పీడ్ తో వాహనాలు రాకపోకలు జరుగుతాయి. వెంటనే అధికారులు స్పందించి సరిహద్దు దాటుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడాలని అధికారులను స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.



