– మన ఇసుక వాహనం ఆన్‌లైన్ బుకింగ్ చేసిన వారికి ఇంకా సరఫరా లేదు
– ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
– చరవానికి అందుబాటులోకి రాని తాహశిల్దార్
నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ ఇసుక బుకింగ్ విధానం ద్వారా ఇసుకను బుక్ చేసుకున్న పలువురు లబ్ధిదారులు ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఇసుక సరఫరా కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్‌లైన్ ద్వారా ముందుగానే ఇసుకను బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు వారికి ఇసుక అందలేదని చెబుతున్నారు.
ఇసుక రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని, దీంతో నిర్మాణ వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరు లబ్ధిదారులు సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదని ఆరోపిస్తున్నారు.
ఇల్లు నిర్మించుకోవడానికి అప్పు తీసుకుని ఇసుక బుక్ చేసుకున్నామని, అయితే ఇప్పటివరకు సరఫరా కాలేదని ఒక లబ్ధిదారు తెలిపారు. అప్పు తీసుకున్న డబ్బులకు వడ్డీలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అప్పుకు మిత్తి పెరుగుతుందే తప్ప ఇసుక రాలేదు
– గూడమోని బాలకృష్ణ, రాయిచేడు గ్రామం, ఉప్పునుంతల మండలం
ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అప్పు తీసుకుని ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానం ద్వారా 7 ట్రాక్టర్లకు రూ.22,138 చెల్లించి ఇసుక బుక్ చేసుకున్నాం. కానీ ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఇసుక రాలేదు. అప్పు తెచ్చిన డబ్బులకు మిత్తి కడుతూ ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి ఇసుక సరఫరా చేయాలి.
సంవత్సరం అయింది అధికారులు స్పందించాలి– జక్కుల మల్లేష్, రాయిచేడ్ గ్రామం, ఉప్పునుంతల మండలం
రెండు టాక్టర్లకు గాను రూ.5839 ఆన్లైన్ లో బుక్ చేసి ఇసుక కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. ఇసుక సరఫరా ఆలస్యం కావడంతో నిర్మాణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలి.



