Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంయమునా నదిలో ఇసుకాసురులు

యమునా నదిలో ఇసుకాసురులు

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, యూపీలో అక్రమ తవ్వకాలు
పర్యావరణ ఉల్లంఘనల్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌-ఢిల్లీ సరిహద్దు సమీపంలోని యమునా నది వెంబడి అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డేలేకుండా పోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, యూపీలో యథేచ్ఛగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై దర్యాప్తు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి.దీనికి ప్రతిస్పందనగా ఏర్పాటు చేసిన కమిటీ గుర్తించిన తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘనలను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్‌ శాఖ, కాలుష్య నియంత్రణ అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఈ నెల ప్రారంభంలో నివేదిక సమర్పించింది. లీజు తీసుకున్న ప్రాంతానికి భిన్నంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టు నివేదికలో ప్రస్తావించింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత క్షీణిస్తుండటాన్ని ఎదుర్కోవడానికి విధించిన నిబంధనలను ఉల్లంఘించడం వంటి అనేక సంఘటనలను వెల్లడించింది. మైనింగ్‌, సంబంధిత కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించే గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ) యొక్క దశ-3 అమలులో ఉన్న కాలంలో కూడా కంపెనీ మైనింగ్‌ కొనసాగించిందని ప్యానెల్‌ కనుగొంది.

క్రియాశీల నదీ కాలువలో ఇన్‌-స్ట్రీమ్‌ మైనింగ్‌, అనధికార ర్యాంప్‌ల నిర్మాణం , నదీగర్భంలో 15-20 అడుగుల లోతు వరకు తవ్వకాలను కూడా నివేదిక గుర్తించింది. నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ పిటిషన్‌పై తమ స్పందనను దాఖలు చేయడానికి సంబంధిత అన్ని పార్టీలకు నాలుగు వారాల గడువు ఇచ్చింది . ఈ అంశాన్ని మార్చి 17కి జాబితా చేసింది. లీజు సరిహద్దుకు దాదాపు 110 మీటర్లు ఆవల యమునా నది మధ్యలో కంపెనీ మైనింగ్‌ చేసిందని ప్యానెల్‌ నివేదిక పేర్కొంది. ”ఈ ప్రాంతం యమునా నది నదీగర్భం మధ్యలో ఉంది, గూగుల్‌ ఎర్త్‌ ఇమేజ్‌ ప్రతివాది నెం. 9 (కంపెనీ) యమునా నది ప్రధాన ప్రవాహం వైపు దాదాపు 110 మీటర్ల దూరంలో మైనింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు గుర్తించినట్టు” కమిటీ తన నివేదికలో పేర్కొంది. పర్యావరణ ఆడిట్‌, ఆరు నెలల సమ్మతి నివేదికలు కూడా కంపెనీ రికార్డుల నుంచి తప్పిపోయాయని నివేదిక పేర్కొంది. ఆ సంస్థ ప్రాజెక్ట్‌ ప్రాంతానికి సమీపంలో చెట్లను నాటలేదు లేదా టాయిలెట్ల నుంచి మురుగునీటిని సేకరించడానికి సరైన సెప్టిక్‌ ట్యాంక్‌ను నిర్మించలేదని ప్యానెల్‌ ట్రిబ్యునల్‌కు తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -