Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంగిరిజన స్కూళ్లలో సంఘ్‌ ఎజెండా

గిరిజన స్కూళ్లలో సంఘ్‌ ఎజెండా

- Advertisement -

ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను ప్రతిబింబించే అంశంపై చర్చా పోటీలు
వివాదాస్పదంగా మారిన ‘నెస్ట్స్‌’ ఆదేశాలు
తప్పుబడుతున్న విద్యావేత్తలు, మేధావులు
న్యూఢిల్లీ :
దేశంలో విద్య కాషాయీకరణే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ సర్కారు అటువైపుగా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. దేశంలో మత మౌఢ్యంతో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే స్వభావమున్నదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మాతృ సంస్థ సంఫ్‌ు ఎజెండాను అమలు చేయడంలో మోడీ సర్కారు లోతుగా పని చేస్తున్నది. ప్రభుత్వ గిరిజన స్కూళ్లలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సంఫ్‌ు ఎజెండాకు దగ్గరగా ఉండే ఓ అంశంపై గిరిజన విద్యార్థుల వసతి పాఠశాల (ఈఎంఆర్‌ఎస్‌)ల్లో పోటీలు నిర్వహించాలంటూ ఆదేశాలు వచ్చాయి. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) సంస్థ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ ఆదేశాలు వివాదంగా మారాయి. సదరు అంశం ఆరెస్సెస్‌ ఆలోచనలకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నదనీ, సంఫ్‌ు ఎజెండా అమలు లక్ష్యంగా నెస్ట్స్‌ వ్యవహరి స్తున్నదని మేధావులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

ఆ అంశం ఏమిటి?
నెస్ట్స్‌ అనే సంస్థ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా 400కు పైగా ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలలను నడిపిస్తోంది. ఈ సంస్థ ఇచ్చిన అంశం ‘ఆధునిక విద్య భారతీయ స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను బలహీనపరుస్తోంది’. ఈ అంశంపై చర్చా పోటీల్లో (డిబేట్‌) విద్యార్థులు పాల్గొనా లంటూ నెస్ట్స్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. 9-12వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొం టారు. ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ కల్చరల్‌ అండ్‌ లిటరరీ ఫెస్ట్‌, కళా ఉత్సవ్‌ 2025 కార్యక్రమాల్లో భాగంగా దీనిని నిర్వహించ నున్నారు. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పోటీలు ఉంటాయి.

‘విద్యార్థుల్లో తప్పుడు భావనలు తీసుకొచ్చే యత్నాలు’
పోటీలకు ఎంచుకున్న అంశమే సంకుచి తమైందనీ, ఆధునిక విద్య భారతీయ సాంప్రదాయ జ్ఞానానికి వ్యతిరేకమంటూ విద్యార్థులలో తప్పుడు భావనను తీసుకొచ్చే ప్రయత్నాలు తాజా చర్య ద్వారా జరుగుతున్నాయని విద్యావేత్తలు, మేధావులు ఆరోపిస్తున్నారు. ”ఈ అంశం తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. స్వదేశీ జ్ఞానాన్ని చాలా సార్లు బ్రాహ్మణీయ (వేద) సంప్రదాయం ద్వారానే అర్థం చేసుకుంటారు. అయితే అది బహుళ వర్గాలను విద్యకు దూరం చేసింది. ఆధునిక విద్య మంచిదే. అది మత మూఢనమ్మకాలను, అనవసర ఆచారా లను సరిదిద్దుతుంది” జేఎన్‌యూ ప్రొఫెసర్‌ వై.ఎస్‌ ఎలోనె చెప్పారు. ”ఆధునిక విద్య శాస్త్రీయత, నాగరికతను ప్రోత్సహిస్తుంది. కానీ ఆరెస్సెస్‌ వంటి సంస్థలు శాస్త్రీయ ఆలోచన కన్నా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తాయి” అని ఓ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే చర్యలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలి తప్పితే.. ఓ సంస్థ ఎజెండాను వారిపై రుద్దాలనే ప్రయత్నం దేశానికీ శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -