అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో ఘటన
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ పారిశుధ్య కార్మికురాలు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముసారంబాగ్ శ్రీపురం కాలనీకి చెందిన పుష్ప(50) అంబర్‌పేట మున్సిపల్ సర్కిల్‌లోని ప్రేమ్‌నగర్ యూనిట్‌లో 20 ఏండ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త మరణించగా, కుమారుడు, కూతురు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం అలీ కేఫ్ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న సమయంలో సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్ వైపు వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. బస్సు చక్రాలు ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో తలలో మెదడు చిట్లిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్‌ఎఫ్‌ఏ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సయ్యద్ రహీముద్దీన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పారిశుధ్య కార్మికుల ధర్నా
పుష్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తోటి పారిశుధ్య కార్మికులు అలీ కేఫ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా. అలీ కేఫ్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



