Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంజయ్‌ వచ్చాడు..జీవన్‌రెడ్డి వెళ్లిపోయాడు

సంజయ్‌ వచ్చాడు..జీవన్‌రెడ్డి వెళ్లిపోయాడు

- Advertisement -

– రచ్చకెక్కిన కాంగ్రెస్‌ నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలోని వర్గపోరు
– రాజ్యాంగ ఉల్లంఘన చేసి మా పక్కన కూర్చోవడమేంటి
– మా గౌరవం ఏం కావాలి..అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆయనెవరు?
– సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
– వేరే పనిపై గాంధీ భవన్‌ వచ్చాను
– జీవన్‌రెడ్డి ఏం మాట్లాడారో నాకు తెల్వదు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గాంధీభవన్‌ సాక్షిగా నిజామాబాద్‌ పార్లమెంటరీ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌ నేతల ఆధిపత్యపోరు మరోమారు బట్టబయలైంది. నిజామాబాద్‌ పార్లమెంటర్‌ స్థానం పరిధిలో మున్సిపాల్టీ ఎన్నికలకు ఎలా వెళ్లాలి? అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి? అనే అంశంపై గాంధీభవన్‌లో బుధవారం సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వచ్చారు. ఆయన రాకను చూసి సమావేశం నుంచి జీవన్‌రెడ్డి బయటకు వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా సంజయ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనంతరం గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి సంజయ్‌ ఎవరు? దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు ఏం కావాలి? అంతర్గత సమావేశంలో వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఎలా చర్చించుకోగలుగుతాం? నిన్నటి వరకు ఆ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అక్రమాలపై పోరాటం చేశాననీ, ఎవరిపై కోట్లాడామో వాళ్ళని తమ పక్కన కూర్చొబేడితే గౌరవం ఏం కావాలి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి వచ్చి తమ పక్కన కూర్చోవడాన్ని తప్పుబట్టారు. దాన్ని జీర్ణించుకోలేకనే టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు క్షమాపణ చెప్పి బయటకు వచ్చేశానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని చులకన చేస్తున్నారనీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదని వాపోయారు. ఇది తన ఒక్కడి ఆవేదన కాదనీ, పదేండ్ల నుంచి బీఆర్‌ఎస్‌పై పోరాటం చేసిన కార్యకర్తలు, నాయకులదని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని నొక్కి చెప్పారు. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు భరించాననీ, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎంతో విలువ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. మీటింగ్‌కు నిరసనగా బయటకు మాత్రమే వచ్చానని తెలిపారు. పార్టీ విధానానికి, రాహుల్‌ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ విధానానికి వ్యతిరేకంగా సమావేశం జరుగుతున్నదని చెప్పారు.

సమావేశాన్ని బహిష్కరించి ఊహించని రీతిలో జీవన్‌రెడ్డి బయటకు వెళ్లిపోవడంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా గాంధీభవన్‌ నుంచి వెళ్లిపోయారు. జీవన్‌రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదనీ, వేరే పని నిమిత్తం గాంధీభవన్‌కు వచ్చానని సంజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఇతర అంశాలపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.

జీవనరెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నాం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌
తమ పార్టీ నేత జీవన్‌రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని టీపీసీసీ అధ్యక్షులు బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నేతలందర్నీ పిలిచామన్నారు. అందులో భాగంగానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా వచ్చారని తెలిపారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెల్వదనీ, రేపు పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడుతానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -