3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంక్రాంతి పండుగ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. డీఏను 3.64 శాతం పెంచుతూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తించనున్నది. జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏను ఫిబ్రవరి 1న చెల్లించనున్నది. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నది. గతంలో డీఏ 30.03 శాతం ఉండగా ప్రస్తుతం దానిని 33.67 శాతానికి పెంచారు. యూజీసీ, ఏఐసీటీఈ స్కేల్స్, 2016 ప్రకారం 42 శాతం డీఏను అందుకుంటున్న వారికి 2023 జులై 1 నుంచి దానిని 46 శాతానికి పెంచారు. సీపీఎస్ పరిధిలోకి వచ్చే వారికి పెరిగిన డీఏలో 10 శాతానికి 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు వ్యక్తిగత ప్రాన్ అకౌంట్లలో ప్రభుత్వ వాటాతో కలిపి జమ చేస్తారు.
మిగిలిన 90 శాతం డీఏను 2026 జనవరి జీతం (ఫిబ్రవరి 1న చెల్లించే జీతం)తో కలిపి 30 నెలల్లో సమానంగా చెల్లిస్తారు. జీపీఎఫ్ అకౌంట్లు లేని ఫుల్ టైం కాంటిన్ జెంట్ ఉద్యోగులకు కూడా రాబోయే 30 నెలలు సమానంగా చెల్లిస్తారు. డీఏకు సంబంధించిన ఆదేశాలు వచ్చే నాటికే ఎవరైనా ఉద్యోగి మరణించి ఉంటే ఆ ఉద్యోగి చట్టబద్ధ హక్కుదారులకు డీఏను పూర్తి మొత్తంలో అందజేస్తారు. పెన్షనర్లకు 3.64 శాతం డీఆర్‌ను పెంచుతూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. గతేడాది జూన్‌లో 26.39 శాతం ఉన్న డీఏను 30.03 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ డీఏను 2023 జనవరి 1 నుంచి వర్తింపజేశారు.
సర్కారు ఉద్యోగులకు సంక్రాంతి కానుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



